వల్లూరులో రూపుమారిన ప్రాథమిక పాఠశాల
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో గ్రామసీమల రూపు రేఖలు మారుతున్నాయి. ఒకనాడు పల్లెల్లో అంతం త మాత్రంగా జీవనం సాగిస్తున్న ప్రజల జీవనశైలి లో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో అధునాతన వసతులు సమకూరడం, ఆరోగ్యానికి అభయం లభించడంతో పల్లెలు నవజీవనంతో వెలిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు, చెరు వుల్లో నీరు నిండడంతో పల్లె సీమలు పచ్చని పంట లతో కళకళలాడుతున్నాయి. పల్లెల్లో పరిస్థితి చూస్తే ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కళ్లెదుటే కనిపి స్తోంది. మనం పరు గెత్తే పరిస్థితి నుంచి అధికారులే ఇంటి వద్దకు వచ్చి సంక్షేమ ఫలాలు అందించే పరిస్థితి వచ్చింది. పెన్షన్, బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, అవసరమైన సర్టిఫికెట్లు.. ఇలా అవసరమైనవన్నీ ఊళ్లోని సచివాలయంలోనే ఇస్తున్నారు. సచివాలయానికి వెళ్లలేనివారికి వలంటీరే ఇంటివద్దకు వచ్చి అందజేస్తున్నారు.
రూ.400 కోట్లకు పైగా నిధులతో గ్రామాల్లో పనులు
వైఎస్సార్ జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లెసీమల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. పల్లెలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గంలోను, పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగాను విస్తృతంగా అభివృద్ధి పనులు జరిగాయి. సిమెంటు రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం రూ.400 కోట్లకుపైగా ఖర్చుచేశారు.
వైద్యానికి భరోసా
జిల్లాలో 74 పీహెచ్‌సీలు, 17 పట్టణ ఆరోగ్య కేం ద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించింది. దీన్లో భాగంగా జిల్లాలో రూ.87.50 కోట్లతో 500 హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో 10 భవనాలు పూర్త య్యాయి. 450 భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నాటికి వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు.
కమలాపురంలో ఇటీవల ప్రారంభించిన రైతు భరోసా కేంద్రం
ఆధునిక టెక్నాలజీ
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 2012–13 పంటల బీమా మొదలు అన్నింటినీ ప్రభుత్వం ఒక్కొక్కటి అన్నదాతలకు అందిస్తూ వస్తోంది. ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో కూడిన రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వీటి ద్వారా సత్వరం అందిస్తున్నారు. జిల్లాలో 621 ఆర్బీకేల నిర్మాణానికి ప్రభుత్వం రూ.135.38 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.21.77 కోట్లు వెచ్చించి 14 భవనాలను పూర్తిచేశారు.
ప్రజలకు సత్వరసేవలు
గ్రామాల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందిం చడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగు తోంది. జిల్లాలో 631 సచివాలయాలున్నాయి. వీటి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.233 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.88.65 కోట్లు ఖర్చుచేసి 142 భవనాలను పూర్తిచేశారు. మరో 430 భవనాల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నా యి. 59 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
ఆహ్లాదకర వాతావరణంలో విద్య
శిథిలావస్థకు చేరిన భవనాలు, ఫర్నిచర్ లేని తరగతి గదులు, మరుగుదొడ్ల కొరత.. వంటి సమస్యలతో కునారిల్లుతున్న పాఠశాలలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. జిల్లాలో తొలివిడతలో 1,040 పాఠశాలలను నాడు–నేడులో భాగంగా తీర్చిదిద్దేందుకు రూ.185 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే దాదాపు అన్ని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించారు. 300 పాఠశాలలకు సంబంధించి పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నాయి. మార్చి చివరి నాటికి పనులన్నీ పూర్తిచేసేలా కసరత్తు చేస్తున్నారు. రెండో విడత కూడా మరో 1000కి పైగా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏప్రిల్ నుంచి పనులు చేపట్టాలని భావిస్తున్నారు.
చదువుకునేందుకు మంచి వాతావరణం
నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో వసతులు కల్పించడంతో చదువుకునేందుకు మంచి వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్దపీట వేయడంతో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 20 వేలమందికి పైగా విద్యార్థులు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇప్పటికే నాడు–నేడు పనుల్లో భాగంగా పాఠశాలలకు తుది మెరుగులు దిద్దుతున్నాం.
– డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి, కడప
వేగవంతంగా పనులు చేయిస్తున్నాం
జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతంగా నడిపిస్తున్నాం. జిల్లాలో రైతుభరోసా కేంద్రాలతోపాటు సచివాలయాల నిర్మాణం, హెల్త్ క్లినిక్‌ల పనులు కూడా చేయిస్తున్నాం. మార్చి చివరి నాటికి వీలైనన్ని ఎక్కువ భవన నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నాం.
– వెంకటసుబ్బారెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌శాఖ, కడప
Comments
Please login to add a commentAdd a comment