
నేలకొండపల్లిలో సమావేశమైన పలువురు సర్పంచ్‌లు
సాక్షి, నేలకొండపల్లి : ప్రభుత్వం ఇటీవల సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించడాన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కలిపి చెక్ పవర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని సర్పంచ్‌లు ఆందోళన బాటకు సిద్ధమయ్యారు. గత ఐదు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆమోదంతో గెలిచిన సర్పంచ్‌లు చెక్‌పవర్ కోసం నెలల తరబడి ఎదురుచూశారు.
గ్రామాలను అభివృద్ధి చేయాల నే సంకల్పంతో సర్పంచ్‌లు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం జీవోఎంఎస్ నంబర్ 38ని ప్రవేశపెట్టింది. అందులో సర్పంచ్–ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఈ నెల 15న జీఓ విడుదల చేశారు. ఉప సర్పంచ్‌తో కలిపి సంయుక్తంగా చెక్ పవర్ కల్పించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని సర్పంచ్‌లు అంటున్నారు.
రాజకీయంగా సర్పంచ్ ఒక పార్టీ, ఉప సర్పంచ్ మరో పార్టీ నుంచి గెలుపొందిన చోట్ల..ఐక్యత ఉండదని చెబుతున్నారు. పాలకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కుంటుపరిచేందుకు వీలు ఉందని ఇంకొందరు భావిస్తున్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. రాజకీయ గొడవలకు కూడా ఆస్కారం ఉండే ప్రమాదం ఉంది. జీఓ 38ని రద్దు చేయాలనే డిమాండ్‌తో సర్పంచ్‌లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 21న మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు.
సర్పంచ్–పంచాయతీ కార్యదర్శికి చెక్‌పవర్ అప్పగించాలని కోరుతున్నారు. జాయిం ట్ చెక్‌పవర్ విషయంలో పునారాలోచించాలని, అలాగే..కనీస గౌరవ వేతనం పెంచాలని సర్పంచ్ లు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీ పోరాటాలకు సిద్ధమవుతున్నారు.
సర్పంచ్‌ల ప్రధాన డిమాండ్లు ఇలా..
⇒ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలి
⇒ జాయింట్ చెక్ పవర్‌లో ఉపసర్పంచ్‌కు ప్రాధాన్యం వద్దు
⇒ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు వెంటనే రూ.15 లక్షలు ఇవ్వాలి
⇒ సర్పంచ్‌లకు గౌరవ వేతనం రూ.20 వేలు ఇవ్వాలి
⇒ 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి
Comments
Please login to add a commentAdd a comment