surpanches
-
జాయింట్ చెక్ పవరొద్దు..
సాక్షి, నేలకొండపల్లి : ప్రభుత్వం ఇటీవల సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించడాన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కలిపి చెక్ పవర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని సర్పంచ్‌లు ఆందోళన బాటకు సిద్ధమయ్యారు. గత ఐదు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆమోదంతో గెలిచిన సర్పంచ్‌లు చెక్‌పవర్ కోసం నెలల తరబడి ఎదురుచూశారు. గ్రామాలను అభివృద్ధి చేయాల నే సంకల్పంతో సర్పంచ్‌లు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం జీవోఎంఎస్ నంబర్ 38ని ప్రవేశపెట్టింది. అందులో సర్పంచ్–ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఈ నెల 15న జీఓ విడుదల చేశారు. ఉప సర్పంచ్‌తో కలిపి సంయుక్తంగా చెక్ పవర్ కల్పించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని సర్పంచ్‌లు అంటున్నారు. రాజకీయంగా సర్పంచ్ ఒక పార్టీ, ఉప సర్పంచ్ మరో పార్టీ నుంచి గెలుపొందిన చోట్ల..ఐక్యత ఉండదని చెబుతున్నారు. పాలకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కుంటుపరిచేందుకు వీలు ఉందని ఇంకొందరు భావిస్తున్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. రాజకీయ గొడవలకు కూడా ఆస్కారం ఉండే ప్రమాదం ఉంది. జీఓ 38ని రద్దు చేయాలనే డిమాండ్‌తో సర్పంచ్‌లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 21న మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. సర్పంచ్–పంచాయతీ కార్యదర్శికి చెక్‌పవర్ అప్పగించాలని కోరుతున్నారు. జాయిం ట్ చెక్‌పవర్ విషయంలో పునారాలోచించాలని, అలాగే..కనీస గౌరవ వేతనం పెంచాలని సర్పంచ్ లు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ల ప్రధాన డిమాండ్లు ఇలా.. ⇒ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలి ⇒ జాయింట్ చెక్ పవర్లో ఉపసర్పంచ్‌కు ప్రాధాన్యం వద్దు ⇒ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు వెంటనే రూ.15 లక్షలు ఇవ్వాలి ⇒ సర్పంచ్‌లకు గౌరవ వేతనం రూ.20 వేలు ఇవ్వాలి ⇒ 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి -
ఇక పంచాయతి పోరు షురు...
సాక్షి, ఆసిఫాబాద్‌రూరల్/ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసింది. రేపటితో అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములు కూడా తేలిపోనున్నాయి. ఇక పంచాయతీ పోరుపై దృష్టి పడింది. జనవరి 10లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గత అక్టోబర్‌లో ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారులు ఆదివారం పంచాయతీల వారీగా బీసీ ఓటర్ల ముసాయిదా జాబి తాను విడుదల చేశారు. ఈ జాబితాలో పేరు లేని బీసీలు సోమవారం నుంచి నమోదుతో పాటు మా ర్పులు, చేర్పులు చేసుకోవచ్చు. బీసీ ఓటర్ల జాబితా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉంచారు. అధికారులు ప్రకటించిన ము సాయిదాలో బీసీ ఓటర్ల వివరాలు స్పష్టంగా ఉ న్నాయి. కాగా, ఇన్ని రోజులు ముందస్తు ఎన్నికల తో బీజీగా గడిపిన ఎన్నికల సంఘం, జిల్లా అధి కారులు ఇప్పుడు పంచాయతీపై దృష్టి పెట్టారు. 13,14న గ్రామసభలు.. ఉమ్మడి జిల్లాలో గల నాలుగు జిల్లాల పంచాయతీ అధికారుల వద్ద ఓటర్ల జాబితా అందుబాటులో ఉంది. ఆ జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,14,835 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఆదివారం విడుదల చేసిన బీసీ ఓటర్ల ముసాయిదా జాబితా అనంతరం మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. ఏవైనా మార్పులు ఉన్నట్లయితే ఈ నెల 13, 14 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం స్వీకరిస్తారు. ఈ ప్రక్రియను ఈ నెల 14 సాయంత్రంలోగా పూర్తి చేసిన 15న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. విడుదల చేసిన జాబితాను పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. అనంతరం ఆ జాబితా ప్రకారం రిజర్వేషన్లకు కేటాయింపుకు చర్యలు తీసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్లపై ఆశ.. గత సర్పంచ్ల పదవీ కాలం గత ఆగస్టు 2తో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. సర్పంచ్ల పదవీ ముగిసే నెల ముందే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత రిజర్వేషన్లపై చోటు చేసుకున్న పరిణామాలు హైకోర్టు వరకు తీసుకెళ్లాయి. ఆ సమయంలో 2019 జనవరి 10లోగా పంచాయతీలకు ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఊపిరి పీల్చుకున్న ఎన్నికల సంఘం తద్వారా వచ్చిన ముందస్తు ఎన్నికల పనుల్లో నిమగ్నమైంది. ఇప్పుడు ఆ ఎన్నికలు ముగియడంతో పంచాయతీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీసీ ఓటర్ల తయారీ జాబితా ప్రక్రియ ప్రారంభించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ నుంచి ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పుడు అధికారులు జాబితాను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. అనంతరం ఆ జాబితా ప్రకారం తాజాగా ఖరారు కానున్న రిజర్వేషన్ల కోసం జిల్లా వాసులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సర్పంచ్ పదవులకు బీసీలు, ఎస్టీ, ఎస్సీలు అందరు ముందుకు రావడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. 50 శాతానికి మించరాదనే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఓటరు జాబితా ప్రదర్శన ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకొని బీసీ ఓటర్ల జాబితాను ఆదివారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించినట్లు ఈవోపీఆర్డీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించామని, సోమవారం ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని, 12న పరిష్కరిస్తామని, 13 నుంచి 14 వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి 15న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. -
సర్పంచుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యేంతవరకు సర్పంచ్‌లుగా తమనే కొనసాగించాలంటూ పలువురు సర్పంచ్‌లు చేస్తున్న అభ్యర్థనలపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా, ఏదులాబాద్ గ్రామ సర్పంచ్ బట్టే శంకర్, మరో ఏడు మంది సర్పంచ్‌లు హైకోర్టులో మంగళవారం లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, స్పెషల్ ఆఫీసర్ల నియామకం పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. చట్టంలో ఎక్కడా కూడా స్పెషల్ ఆఫీసర్ల నియామక ప్రస్తావనే లేదని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ల నియామకం వల్ల ఆయా పంచాయతీల్లో అభివృద్ధి పనులు కుంటుపడే అవకాశం ఉందన్నారు. అందువల్ల సర్పంచ్‌లను యథాతథంగా కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సర్పంచ్‌లు చేస్తున్న అభ్యర్థనలపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కొత్త ‘పంచాయితీ’!
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ చట్టంలో వస్తున్న మార్పులతో సరికొత్త ‘పంచాయితీ’మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ అంశం గ్రామ రాజకీయాల్లో కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో రాజకీయ పోరు ఉధృతం అవుతుందని, రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయనే భావన వస్తోంది. చెక్‌పవర్ ఉన్న కారణంగా గ్రామ పాలనా వ్యవహారాల్లో ఉప సర్పంచ్ల జోక్యం పెరిగే అవకాశముంది. మరోవైపు గ్రామ కార్యదర్శులు నామమాత్రంగా మిగిలిపోనున్నారు. కార్యదర్శులకు కత్తెర వేసి.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, వేతనాలు, ఇతర పనుల కోసం నిధుల ఖర్చు అంశం సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు ఉంది. వారిద్దరూ సంతకాలు చేస్తేనే నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రామ సభ నిర్ణయం మేరకు నిధులు ఖర్చు చేస్తారు. అయితే అత్యవసర పనులు, కార్యక్రమాలకు గ్రామ కార్యదర్శి, సర్పంచ్ల ఆమోదంతో నిధులు విడుదల చేస్తారు. కానీ ఇక ముందు కార్యదర్శులు గ్రామ ప్రణాళికల రూపకల్పన, పన్నుల వసూలు, ధ్రువపత్రాల జారీ, గ్రామసభల నిర్వహణ విధులకు పరిమితం కానున్నారు. గ్రామ రాజకీయాల్లో కొత్త మార్పు సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వడం గ్రామ రాజకీయాల్లో మార్పులు తెచ్చే పరిస్థితి ఉందని సర్పంచ్ల సంఘం రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో ఇన్నాళ్లు సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే పోటీ ఉండేదని, ఇప్పుడు ఉప సర్పంచ్ పదవి కోసం పోరు ఉంటుందని అంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేయనందున.. ప్రస్తుతమున్నట్టుగానే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించిన రోజే ఫలితాలు వస్తాయి. అదే రోజు వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఇప్పటివరకు ఉప సర్పంచ్ పదవికి పెద్దగా పోటీ ఉండేదికాదు. కానీ చెక్‌పవర్ రానుండడంతో సర్పంచ్ పదవితో సమానంగా పోటీ పెరగనుంది. ఆధిపత్య పోరుకు అవకాశం..! జాయింట్ చెక్‌పవర్ కారణంగా సర్పంచ్‌గా ఎన్నికైనవారికి, ఉప సర్పంచ్‌గా ఎన్నికైన వారికి మధ్య ఆధిపత్య పోరు నెలకొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి మధ్య సయోధ్య నెలకొనని పరిస్థితి ఉంటే గ్రామ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళలు తదితర వర్గాలకు సర్పంచ్ పదవులు రిజర్వు అయిన చోట ఉప సర్పంచులు ఆధిపత్యం చెలాయించడం ఇప్పటికే జరుగుతోంది. తాజాగా చెక్‌పవర్‌తో ఇది మరింత ఉధృతమవుతుందని అంటున్నారు. ఇక సర్పంచ్ లేని సందర్భాల్లో గ్రామ పరిపాలన అంతా ఉప సర్పంచ్ చేతుల్లోనే ఉంటుంది. దీనికితోడు తాజా నిబంధనల్లో.. విధి నిర్వహణలో విఫలమైన, నిధుల దుర్వినియోగం విషయంలో సర్పంచ్‌లను తొలగించేలా నిబంధనలు చేర్చారు. ఉప సర్పంచులు దీనిని ఆసరాగా చేసుకుని సర్పంచ్‌లను తొలగించేలా ప్రయత్నాలు చేయవచ్చనే అభిప్రాయమూ వస్తోంది. తాగునీటితో స్నానం చేస్తే రూ.500 జరిమానా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి, మెరుగైన పరిపాలన దిశగా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చాలా అంశాలను చేర్చారు. నీటి వృధాను అరికట్టడం, అక్రమ నిర్మాణాల నియంత్రణ, అల్లర్ల నిరోధం, పారిశుధ్య అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తాగునీటిని స్నానానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.500 జరిమానా వేయాలని చట్టంలో పేర్కొన్నారు. మిషన్ భగీరథ, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థతో సరఫరా చేసే నీటిని వృథా చేయడం, స్నానానికి వినియోగించడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, వాహనాలను శుభ్రపరచడం వంటి చర్యలకు పాల్పడితే ఈ జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో అల్లరి (నూసెన్స్) చేసిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుంది. లైసెన్సు లేకుండా రోడ్డు దగ్గరలో ఇసుక తీసినా, రోడ్డు తవ్వినా రూ.ఐదు వేల జరిమానా వసూలు చేస్తారు. అనుమతి లేకుండా చెట్లను నరికినా, బహిరంగంగా గొర్రెలు, మేకలు, పశువులను వధించడం చేసినా.. నాలాపై అక్రమంగా భవనాన్ని నిర్మించినా రూ. రెండు వేల అపరాధ రుసుము విధిస్తారు. నిషేధిత ప్రాంతంలో చెత్తను కాల్చడం, పారవేయడం, రోడ్డును ఆక్రమించి గోడను నిర్మించడం, ఇనుప కంచె ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘలనకు రూ.వెయ్యి జరిమానా ఉంటుంది. ఇళ్ల లేఔట్లకు ఆన్లైన్ అనుమతులు గ్రామాల్లో ఇళ్ల లేఔట్ల అనుమతుల జారీ కోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోంది. ఇళ్ల స్థలాల లేఔట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసిన వారంలోగా సాంకేతిక మంజూరు విభాగానికి పంపాలి. అలా పంపకపోయినా పంపినట్టే పరిగణిస్తారు. సాంకేతిక విభాగం అన్ని అంశాలను పరిశీలించి 30 రోజుల్లోగా పంచాయతీకి వివరణ ఇవ్వాలి. అనంతరం ఏడు రోజుల్లోగా లేఔట్ యజమానికి గ్రామ పంచాయతీ సమాచారం ఇవ్వాలి. 300 చదరపు గజాల్లో 10 మీటర్ల ఎత్తుకు మించని జీ ప్లస్ టు భవనాల నిర్మాణానికి పంచాయతీలు అనుమతి ఇస్తాయి. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే అనుమతి లభించినట్లుగా భావించాల్సి ఉంటుంది. -
విలీనం వద్దు
ఆదిలాబాద్ : జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటు.. మున్సిపాలిటీలో గ్రామాల విలీనం ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జూన్‌లో పంచాయతీ సర్పంచ్ల పదవి కాలం ముగుస్తుండడంతో ముందస్తుగానే పంచాయతీల ఎన్నికలకు నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త పంచాయతీల ఏర్పాటు, మున్సిపాలిటీలో గ్రామాల విలీనం ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. గతంలో వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని జనాభా ప్రాతిపదికన కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తుండగానే, మరికొన్ని గ్రామాల ప్రజలు పంచాయతీలు ఏర్పాటు చేయలంటూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గ్రామాల వీలినాన్ని సైతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బల్దియాలో విలీనం చేయకూడదంటూ అధికారులకు విన్నవిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మరో 226 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కొత్త పంచాయతీలు.. వినతులు.. ఈ నెల 31వ తేదీ వరకు కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు అందించాలని ప్రభుత్వం గడువు విధించడంతో ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కలిసి వినతులు అందజేస్తున్నారు. సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్‌ను ఆయా గ్రామాల ప్రజలు కలిశారు. మున్సిపాలిటీలో ఆదిలాబాద్ మండలంలోని అనుకుంట గ్రామాన్ని విలీనం చేయకూడదని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ గ్రామంలో వ్యవసాయ కుటుంబాలు ఎక్కువగా ఉండడం, ఉపాధి హామీ పనుల కూలీలు సైతం రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. దీంతోపాటు మావల, కచ్కంటి, బట్టిసావర్గం గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. మావల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కేఆర్కే కాలనీని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కలెక్టర్‌ను కలిశారు. సుమారు 4,800 జనాభా ఉంటుందని, అందరూ కూలీ పనులు చేసుకునే వారే ఉన్నారని తెలిపారు. పంచాయతీ ఏర్పాటు చేస్తే బీఆర్జీఎఫ్, ఎన్ఆర్ఈజీఎఫ్, ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వారు భావిస్తున్నారు. సిరికొండ మండలంలోని నేరడిగొండ–కె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాంజీగూడ, పాలవాగు గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కలిశారు. ఆదిలాబాద్ మండలంలోని చిచ్ధరిఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్టంలొద్ధి, అల్లికోరిని కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామ పంచాయితీలపై ప్రభుత్వం 31 వరకు కొత్త ప్రతిపాదనల గడువు ఉండడంతో మరికొన్ని గ్రామాల నుంచి ఇలాంటి డిమాండ్లు తెరపైకి రావడం గమనార్హం. ఉపాధిపైనే ప్రభావం.. మున్సిపాలిటీలో గ్రామాల విలీనంపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి కారణంగా ఉపాధి అని చెప్పవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం విస్తృతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు పని దొరికింది. గ్రామాలను విలీనం చేయడం ద్వారా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు విలీనాన్ని కాదంటున్నారు. ఒకవేళ విలీనం చేస్తే పేదలపై పన్నుల భారం కూడా పెరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. రెండు విధాలుగా నష్టపోయే అవకాశాలు ఉండడంతో గ్రామాల విలీనానికి ఒప్పుకోవడం లేదు. దీంతోపాటు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని వస్తున్న దరఖాస్తులపై అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పడితే తమకు అన్ని రకాలుగా నిధులు వస్తాయని, గ్రామాభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 300లపైన ఉన్న జనాభా, 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను ప్రతిపాదనల్లో చేర్చారు. 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం కొత్త పంచాయతీలపై స్పష్ఠత ఇచ్చే అవకాశం ఉంది. దీంతో గతంలో పంపిన ప్రతిపాదనలు, ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు కొత్త ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలుస్తోంది. -
గ్రామపంచాయతీలకూ ప్రోత్సాహమివ్వాలి
కరీంనగర్ సిటీ: ఐఎస్ఎల్, ఇంకుడుగుంతల్లో వంద శాతం లక్ష్యం సాధించిన గ్రామ పంచాయతీలకూ అవార్డులు ఇవ్వాలని పంచాయతీరాజ్ చాంబర్ జిల్లా అధ్యక్షుడు ఉప్పుల అంజనీప్రసాద్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్లు కోరారు. స్వచ్చభారత్‌లో జిల్లా కలెక్టర్‌కు అవార్డు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల్లో జిల్లాకు అవార్డు వచ్చిందన్నారు. కాని కొంతమంది ఉన్నతాధికారులు అవార్డు రావడానికి కృషి చేసిన స్థానిక ప్రజాప్రతినిధుల ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం శోచనీయమన్నారు. పంచాయతీకార్యదర్శులు, ఎంపీడీఓలు పూర్తిస్థాయిలో లేకున్నా జిల్లాకు అవార్డు వచ్చిందంటే స్థానిక ప్రజాప్రతినిధుల శ్రమతోనేనన్నారు. వందశాతం ఐఎస్ఎల్, ఇంకుడుగుంతలు సాధించిన గ్రామపంచాయతీలకు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో అవార్డులివ్వాలని కోరారు. సమావేశంలో చాంబర్ కార్యదర్శి ముల్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.