కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన రాంజీగూడ, పాలవాగు ప్రజలు
ఆదిలాబాద్ : జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటు.. మున్సిపాలిటీలో గ్రామాల విలీనం ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జూన్‌లో పంచాయతీ సర్పంచ్‌ల పదవి కాలం ముగుస్తుండడంతో ముందస్తుగానే పంచాయతీల ఎన్నికలకు నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త పంచాయతీల ఏర్పాటు, మున్సిపాలిటీలో గ్రామాల విలీనం ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. గతంలో వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని జనాభా ప్రాతిపదికన కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తుండగానే, మరికొన్ని గ్రామాల ప్రజలు పంచాయతీలు ఏర్పాటు చేయలంటూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గ్రామాల వీలినాన్ని సైతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బల్దియాలో విలీనం చేయకూడదంటూ అధికారులకు విన్నవిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మరో 226 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
కొత్త పంచాయతీలు.. వినతులు..
ఈ నెల 31వ తేదీ వరకు కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు అందించాలని ప్రభుత్వం గడువు విధించడంతో ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కలిసి వినతులు అందజేస్తున్నారు. సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్‌ను ఆయా గ్రామాల ప్రజలు కలిశారు. మున్సిపాలిటీలో ఆదిలాబాద్ మండలంలోని అనుకుంట గ్రామాన్ని విలీనం చేయకూడదని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ గ్రామంలో వ్యవసాయ కుటుంబాలు ఎక్కువగా ఉండడం, ఉపాధి హామీ పనుల కూలీలు సైతం రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. దీంతోపాటు మావల, కచ్‌కంటి, బట్టిసావర్గం గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. మావల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కేఆర్‌కే కాలనీని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కలెక్టర్‌ను కలిశారు. సుమారు 4,800 జనాభా ఉంటుందని, అందరూ కూలీ పనులు చేసుకునే వారే ఉన్నారని తెలిపారు. పంచాయతీ ఏర్పాటు చేస్తే బీఆర్‌జీఎఫ్, ఎన్‌ఆర్‌ఈజీఎఫ్, ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వారు భావిస్తున్నారు. సిరికొండ మండలంలోని నేరడిగొండ–కె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాంజీగూడ, పాలవాగు గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కలిశారు. ఆదిలాబాద్ మండలంలోని చిచ్‌ధరిఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్టంలొద్ధి, అల్లికోరిని కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామ పంచాయితీలపై ప్రభుత్వం 31 వరకు కొత్త ప్రతిపాదనల గడువు ఉండడంతో మరికొన్ని గ్రామాల నుంచి ఇలాంటి డిమాండ్‌లు తెరపైకి రావడం గమనార్హం.
ఉపాధిపైనే ప్రభావం..
మున్సిపాలిటీలో గ్రామాల విలీనంపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి కారణంగా ఉపాధి అని చెప్పవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం విస్తృతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు పని దొరికింది. గ్రామాలను విలీనం చేయడం ద్వారా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు విలీనాన్ని కాదంటున్నారు. ఒకవేళ విలీనం చేస్తే పేదలపై పన్నుల భారం కూడా పెరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. రెండు విధాలుగా నష్టపోయే అవకాశాలు ఉండడంతో గ్రామాల విలీనానికి ఒప్పుకోవడం లేదు. దీంతోపాటు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని వస్తున్న దరఖాస్తులపై అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పడితే తమకు అన్ని రకాలుగా నిధులు వస్తాయని, గ్రామాభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 300లపైన ఉన్న జనాభా, 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను ప్రతిపాదనల్లో చేర్చారు. 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం కొత్త పంచాయతీలపై స్పష్ఠత ఇచ్చే అవకాశం ఉంది. దీంతో గతంలో పంపిన ప్రతిపాదనలు, ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు కొత్త ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment