Panchayaths
-
ఉలిక్కిపడిన గ్రామం : ఇద్దరి దారుణ హత్య
సాక్షి, కామారెడ్డి : బికనూర్ మండలం జంగంపల్లిలో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్, కోశాధికారి రాములును అర్ధరాత్రి గ్రామ శివారులో అత్యంత పాశవికంగా బండరాళ్లతో మోది చంపారు. సంఘటన స్థలంలో మద్యం సీసాలు ఉన్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో తగాదాలు జరిగినప్పుడు తరచుగా పంచాయితీలు నిర్వహించడం ఆనవాయితీ. మృతులిద్దరూ పంచాయతీ వివాదాల్లో తలదూర్చడం వల్లే హత్యలకు కారణాలుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి సందర్శించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
గులాబీ నేతలకు ‘పంచాయతీ’ గ్రేడింగ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి రావడం.. గ్రామపంచాయతీలను పెంచుతూ తీర్మానించి అసెంబ్లీ లో ఆమోదించడం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముహుర్తం కుదిరినట్లు సంకేతాలు ఇస్తున్నాయి. పంచాయతీ చట్టంలో సవరణలు చేసినప్పటికీ పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కొత్త గ్రామ పంచాయతీలనూ ప్రకటించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ‘పంచాయతీ’ సమరం ఉంటుందన్న చర్చ రాజకీయ పార్టీల్లో జోరందుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రం కీలకంగా మారాయి. నెలరోజులుగా పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎన్నికలపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గత ఫలితాలను విశ్లేషించి ఏమాత్రం తగ్గకుండా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ‘ముందస్తు’గా అప్రమత్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే ‘గ్రేడింగ్’ ఉంటుందన్న సంకేతాలు కూడా ఇచ్చారు. హైదరాబాద్‌ను వదిలి నియోజకవర్గాల్లో తిరగాలనీ ఇటీవల సూచించారు. సాధారణ ఎన్నికలకు ముందువస్తున్న ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినప్పటికీ శాసనసభ్యుల గెలుపోటములను ముందే నిర్ణయించేంత పగడ్బందీగా జరగనుండడంతో ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు సంకటంగా మారనున్నాయి. ‘పంచాయతీ’ల బాధ్యత ఎమ్మెల్యేలపైనే.. సాధారణ ఎన్నికలకు ముందు వస్తున్న పంచాయతీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సవాలుగా మారనున్నాయి. ఉమ్మడి జిల్లాలో జగిత్యాల మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అధిష్టానం ఎమ్మెల్యే పనితీరుపై గ్రేడింగ్ విధానాన్ని అమలుచేస్తోంది. సర్వేల ఆధారంగా పనితీరును అంచనా వేస్తూ గ్రేడింగ్‌లు ఇస్తోంది. దాని ఆధారంగానే ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం కావడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల గుబులు మొదలైంది. సర్పంచ్‌లను గెలిపించుకునే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేల భుజాలకెత్తిన సీఎం కేసీఆర్.. బలం నిరూపించుకునేందుకు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలను పాత పద్ధతిలో (ప్రత్యక్ష పద్ధతి) నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలు ఉండగా జిల్లాల విభజన తర్వాత కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్న జీపీల సంఖ్య 1022 కు తగ్గింది. ఇటీవల ప్రకటించిన కొత్త పంచాయతీలతో తిరిగి 1202కు చేరింది. వీటిలో అత్యధిక స్థానాలను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అధికార పార్టీ నేతలపై పడింది. దీంతో ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చు తడిసిమోపెడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, పుట్ట మధు, వొడితెల సతీష్‌బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, రామగుండం, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, మంథని, హుస్నాబాద్, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీ సర్పంచులే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని అధినేత కేసీఆర్ సీరియస్‌గా ఆదేశించడం అధికార నేతల్లో ఆందోళన మొదలైంది. ‘పంచాయతీ’లో ఎక్కడెక్కడ ఆధిక్యం.. గత ఫలితాల విశ్లేషణలో నేతలు 2013లో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు జిల్లాలోని అప్పటి మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులనే తెచ్చిపెట్టాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రజాప్రతినిధులు గత సర్పంచ్ ఎన్నికల విశ్లేషణలో పడ్డారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నియోజకవర్గస్థాయి నేతలూ ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో కూడిన ఈ రెండు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 12 నియోజకవర్గాలకు ఐదుచోట్ల అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ, నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నాయి. మంథనిలో మాత్రం శ్రీధర్‌బాబు అప్పుడు మంత్రిగా ఉండడంతో 122 పంచాయతీలకుగాను 83 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 19 చోట్ల టీఆర్ఎస్, 20 చోట్ల టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ బలపరిచిన అభ్యర్థులు, ఇతరులు గెలిచారు. జగిత్యాలలో 80 పంచాయతీలకు 39 కాంగ్రెస్, 18 టీడీపీ, కేవలం 4మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్తో పోలిస్తే కోరుట్లలో మొత్తం 69 స్థానాలకు 26 కాంగ్రెస్, 23 టీఆర్ఎస్, మానకొండూరులో 122 జీపీలకు 38స్థానాల్లో కాంగ్రెస్, 34చోట్ల టీఆర్ఎస్, చొప్పదండిలో 118 జీపీలకు 34కాంగ్రెస్, 23 టీఆర్ఎస్ గెలుచుకుంది. హుజూరాబాద్‌లో 92 జీపీలకు టీఆర్ఎస్ 53, కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొందింది. అక్కడ 21మంది స్వతంత్రులు గెలిచారు. సిరిసిల్లలో 92జీపీలకు టీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 19 చోట్ల గెలిచాయి. 14 మంది స్వతంత్రులు, 8 మంది వైఎస్ఆర్ సీపీ, ఆరుగురు టీడీపీ, బీజేపీ బలపరచినవారు విజయం సాధించారు. హుస్నాబాద్‌లో 122 జీపీలకు టీఆర్ఎస్ 62, కాంగ్రెస్ 21 గెలుచుకున్నాయి. మిగతా చోట్ల సీపీఐ, ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ధర్మపురిలో 129జీపీలకు 51 టీఆర్ఎస్, 42చోట్ల కాంగ్రెస్ గెలిచాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు, టీడీపీ, ఇతరపార్టీలు గెలిచాయి. వేములవాడలో 109 జీపీలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ తలా24 గెలిచాయి. పెద్దపల్లిలో 102 జీపీలకు టీడీపీ అత్యధికంగా 31 గెలుచుకుంది. టీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 20చోట్ల గెలిచాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు గెలిచాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫలితాలు తారుమారై చాలామంది స్వతంత్రులు, ఇతర పార్టీల సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. -
విలీనం వద్దు
ఆదిలాబాద్ : జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటు.. మున్సిపాలిటీలో గ్రామాల విలీనం ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జూన్‌లో పంచాయతీ సర్పంచ్ల పదవి కాలం ముగుస్తుండడంతో ముందస్తుగానే పంచాయతీల ఎన్నికలకు నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త పంచాయతీల ఏర్పాటు, మున్సిపాలిటీలో గ్రామాల విలీనం ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. గతంలో వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని జనాభా ప్రాతిపదికన కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తుండగానే, మరికొన్ని గ్రామాల ప్రజలు పంచాయతీలు ఏర్పాటు చేయలంటూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గ్రామాల వీలినాన్ని సైతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బల్దియాలో విలీనం చేయకూడదంటూ అధికారులకు విన్నవిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మరో 226 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కొత్త పంచాయతీలు.. వినతులు.. ఈ నెల 31వ తేదీ వరకు కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు అందించాలని ప్రభుత్వం గడువు విధించడంతో ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కలిసి వినతులు అందజేస్తున్నారు. సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్‌ను ఆయా గ్రామాల ప్రజలు కలిశారు. మున్సిపాలిటీలో ఆదిలాబాద్ మండలంలోని అనుకుంట గ్రామాన్ని విలీనం చేయకూడదని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ గ్రామంలో వ్యవసాయ కుటుంబాలు ఎక్కువగా ఉండడం, ఉపాధి హామీ పనుల కూలీలు సైతం రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. దీంతోపాటు మావల, కచ్కంటి, బట్టిసావర్గం గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. మావల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కేఆర్కే కాలనీని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కలెక్టర్‌ను కలిశారు. సుమారు 4,800 జనాభా ఉంటుందని, అందరూ కూలీ పనులు చేసుకునే వారే ఉన్నారని తెలిపారు. పంచాయతీ ఏర్పాటు చేస్తే బీఆర్జీఎఫ్, ఎన్ఆర్ఈజీఎఫ్, ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వారు భావిస్తున్నారు. సిరికొండ మండలంలోని నేరడిగొండ–కె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాంజీగూడ, పాలవాగు గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కలిశారు. ఆదిలాబాద్ మండలంలోని చిచ్ధరిఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్టంలొద్ధి, అల్లికోరిని కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామ పంచాయితీలపై ప్రభుత్వం 31 వరకు కొత్త ప్రతిపాదనల గడువు ఉండడంతో మరికొన్ని గ్రామాల నుంచి ఇలాంటి డిమాండ్లు తెరపైకి రావడం గమనార్హం. ఉపాధిపైనే ప్రభావం.. మున్సిపాలిటీలో గ్రామాల విలీనంపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి కారణంగా ఉపాధి అని చెప్పవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం విస్తృతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు పని దొరికింది. గ్రామాలను విలీనం చేయడం ద్వారా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు విలీనాన్ని కాదంటున్నారు. ఒకవేళ విలీనం చేస్తే పేదలపై పన్నుల భారం కూడా పెరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. రెండు విధాలుగా నష్టపోయే అవకాశాలు ఉండడంతో గ్రామాల విలీనానికి ఒప్పుకోవడం లేదు. దీంతోపాటు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని వస్తున్న దరఖాస్తులపై అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పడితే తమకు అన్ని రకాలుగా నిధులు వస్తాయని, గ్రామాభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 300లపైన ఉన్న జనాభా, 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను ప్రతిపాదనల్లో చేర్చారు. 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం కొత్త పంచాయతీలపై స్పష్ఠత ఇచ్చే అవకాశం ఉంది. దీంతో గతంలో పంపిన ప్రతిపాదనలు, ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు కొత్త ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలుస్తోంది. -
పల్లెలకు బిల్లుల షాక్
జిల్లాలోని పలు పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నాయి. సరైన ఆదాయ వనరుల్లేని కారణంగా నెలవారీ విద్యుత్తు బిల్లుల చెల్లింపులు కష్టమవుతున్నాయి. నెలనెలా పెరుగుతున్న బిల్లులు గుదిబండగా మారి ఆందోళన కలిగిస్తున్నాయని పంచాయతీల పాలకులు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరా చేస్తామని, లేదంటే నిలిపేస్తామని సంబంధిత శాఖల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు పంచాయతీలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ఆయా పల్లెల్లో చీకట్లు అలముకున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 1043 గ్రామ పంచా యతీలు విద్యుత్ సరఫరాను పొందుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలకు చెందిన సర్ఫేస్ బోర్లకు సంబం ధించి 12 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 11,210 వీధిలైట్ల కనెక్షన్లు ఉన్నాయి. వీటి విద్యుత్తు బిల్లుల రూపేణా నెలకు రూ.7.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒక్కో పంచాయతీ నెలకు రూ. 15 వేల నుంచి గరిష్టంగా రూ.30 వేల దాకా బిల్లులు చెల్లించాలి. అయితే పంచాయతీల్లో ని«ధులు లేవు. సరైన ఆదాయ వనరుల్లేని కారణంగా ఇవి నెలవారీ విద్యుత్తు బిల్లులను చెల్లించడంలో వెనుకబడుతున్నాయి. దీంతో 2010నుంచి ఇప్పటివరకూ పంచాయతీలు చెల్లించాల్సి న విద్యుత్తు బకాయిలు రూ.220 కోట్లకు చేరాయి. నోటీసుల మీద నోటీసులు... జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 విద్యుత్తు డివిజన్లలోనూ అన్ని కేటగిరీలకు చెందిన 20 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. రోజుకు 4 లక్షల యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. డిమాండ్‌కు తగ్గ విద్యుత్ సరఫరా జరుగుతున్నా బిల్లులు మాత్రం సకాలంలో అందడం లేదని ఎస్పీడీసీఎల్ మండిపడుతోంది. పంచాయతీల బిల్లుల చెల్లింపులో రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుం డటంతో ఎస్పీడీసీఎల్ పరిస్థితి ఇబ్బందికరంగా మారిం ది. దీంతో బిల్లులు చెల్లించాలని సంబంధిత ఏడీఈలు నెలనెలా జిల్లా పంచాయతీ అధికారికి, గ్రామ సర్పంచులకు, విలేజ్ సెక్రెటరీలకు నోటీసులు జారీ చేస్తోంది. ఏప్రిల్ నుంచి కూడా చెల్లింపులు నిల్.. పాత బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటన చేసింది. ఏప్రిల్ 2017 వరకూ ఉన్న బకాయిలను పంచాయతీలు చెల్లించాల్సిన పనిలేదని, ఆ తరువాత చెల్లింపులు మాత్రం జరుపుకోవాలని సూచిం చింది. ఈ లెక్కన ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ పంచా యతీలు రూ.52 కోట్ల దాకా చెల్లించాలి. కనీసం వీటినన్నా కట్టాలని విద్యుత్తు అధికారులు పట్టుబడుతున్నారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చూపే పంచాయతీలకు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరికలు కూడా చేశారు. అప్పటికీ స్పందించని 40 పంచాయతీల్లో విద్యుత్తు సరఫరాను మూడు నెలల కిందట నిలిపేశారు. దీంతో సంబంధిత సర్పంచులు విద్యుత్తు కార్యాలయాలకు వెళ్లి లిఖితపూర్వకంగా లెటర్లు ఇచ్చారు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ పడగానే చెల్లిస్తామని చెప్పారు. దీంతో అధికారులు ఆయా గ్రామాలకు తిరిగి సరఫరాను పునరుద్ధరించారు. అడ్వాన్సు చెక్కులిస్తే సరి.. పంచాయతీలకు త్వరలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు జమయ్యే అవకాశం ఉంది. ఈ లోగా ఎక్కువ మొత్తం బకాయిలు చెల్లించాల్సిన సర్పంచులు అడ్వాన్సు చెక్కులు అందజేస్తే బాగుంటుందని చెబుతున్నాం. కనీసం మూడు నెలలకు ఇవ్వాల్సిన మేర బిల్లులైనా చెక్కుల రూపంలో అందజేయాల్సి ఉంది. అప్పుడే విద్యుత్తు సరఫరా నిరాటంకంగా చేయగలం. గ్రామ సర్పంచులు బిల్లుల చెల్లింపులో సహకరించాలి. – హరినాథరావు, ఎస్ఈ,ఏపీఎస్పీడీసీఎల్, తిరుపతి సర్కిల్ -
పంచాయతీలకు కాసుల కళ
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: పంచాయతీల దశ తిరగనుంది. కొన్నేళ్లుగా నిధులందక.. అభివృద్ధి పనులు చేపట్టలేక కటకటలాడిపోతున్న గ్రామ పంచాయతీలను ప్రభుత్వాలు ఎట్టకేలకు కరుణించాయి. ఒకేసారి మూడు పద్దుల కింద జిల్లాకు రూ.17.41 కోట్ల నిధులు మంజూరు చేశాయి. దీంతో గ్రామాలు నిత్యం ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యతోపాటు ఇతరత్రా సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడింది. పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత నిధులు మంజూరు కావడం ఇదే తొలిసారి. వీటితో అభివృద్ధి పనులు చేపట్టే వెసులుబాటు కొత్త సర్పంచులకు లభిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సాకుగా చూపిస్తూ ప్రతి ఏటా మంజూరు చేయాల్సిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లు గా నిలిపివేసింది. ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలలే మిగిలిన తరుణంలో ఇప్పుడు ఆదరాబాదరాగా మంజూరు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాలకు చెందిన రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు 4,09,78,800 రూపాయలు, 2013-14 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి చెందిన వృత్తి పన్ను వాటా 85,93,200 రూపాయలు, అలాగే 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి 2011-12 సంవత్సరం రెండో విడత నిధుల కింద 12,45,50,200 రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులను జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు కేటాయించారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో మొత్తం 1099 పంచాయతీలున్నాయి. వీటిలో 13 మేజర్ పంచాయతీలు కాగా, మిగిలినవన్నీ మైనర్ పం చాయతీలే. ఇటీవల కాలంలో సంభవించిన వరుస తుఫాన్లు, వరదలు, వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్య పరి స్థితి దారుణంగా తయారైంది. పంచాయతీల ఆస్తులు సైతం దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో నిధులు విడుదల కావడంతో పారిశుద్ధ్యం మెరుగు పరచడంతోపాటు, వీధి దీపాలు, పంచాయతీ భవనాల మరమ్మతులు, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ భవనాల మరమ్మతులు, నిర్వహణ తదితర పనులు చేపట్టేందుకు వీలు కలిగింది. దీనిపై ఇన్‌ఛార్జి డీపీవో బలివాడ సత్యనారాయణ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీలకు 17,41,22200 రూపాయలు మంజూరయ్యాయన్నారు. వీటిని నిర్మాణాత్మక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు.