శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: పంచాయతీల దశ తిరగనుంది. కొన్నేళ్లుగా నిధులందక.. అభివృద్ధి పనులు చేపట్టలేక కటకటలాడిపోతున్న గ్రామ పంచాయతీలను ప్రభుత్వాలు ఎట్టకేలకు కరుణించాయి. ఒకేసారి మూడు పద్దుల కింద జిల్లాకు రూ.17.41 కోట్ల నిధులు మంజూరు చేశాయి. దీంతో గ్రామాలు నిత్యం ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యతోపాటు ఇతరత్రా సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడింది. పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత నిధులు మంజూరు కావడం ఇదే తొలిసారి. వీటితో అభివృద్ధి పనులు చేపట్టే వెసులుబాటు కొత్త సర్పంచులకు లభిస్తుంది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సాకుగా చూపిస్తూ ప్రతి ఏటా మంజూరు చేయాల్సిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లు గా నిలిపివేసింది. ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలలే మిగిలిన తరుణంలో ఇప్పుడు ఆదరాబాదరాగా మంజూరు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాలకు చెందిన రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు 4,09,78,800 రూపాయలు, 2013-14 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి చెందిన వృత్తి పన్ను వాటా 85,93,200 రూపాయలు, అలాగే 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి 2011-12 సంవత్సరం రెండో విడత నిధుల కింద 12,45,50,200 రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులను జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు కేటాయించారు.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో మొత్తం 1099 పంచాయతీలున్నాయి. వీటిలో 13 మేజర్ పంచాయతీలు కాగా, మిగిలినవన్నీ మైనర్ పం చాయతీలే. ఇటీవల కాలంలో సంభవించిన వరుస తుఫాన్లు, వరదలు, వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్య పరి స్థితి దారుణంగా తయారైంది. పంచాయతీల ఆస్తులు సైతం దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో నిధులు విడుదల కావడంతో పారిశుద్ధ్యం మెరుగు పరచడంతోపాటు, వీధి దీపాలు, పంచాయతీ భవనాల మరమ్మతులు, ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాల మరమ్మతులు, నిర్వహణ తదితర పనులు చేపట్టేందుకు వీలు కలిగింది. దీనిపై ఇన్‌ఛార్జి డీపీవో బలివాడ సత్యనారాయణ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీలకు 17,41,22200 రూపాయలు మంజూరయ్యాయన్నారు. వీటిని నిర్మాణాత్మక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు.
పంచాయతీలకు కాసుల కళ
Published Thu, Dec 12 2013 4:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement