స్థానిక సంస్థలు అత్యంత క్రియాశీలకంగా పనిచేసేలా కొత్త పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో విఫలమైతే చర్యలు తీసుకునే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థపై అవగాహన, అనుభవం కలిగిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. వీలైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి.. చట్టం తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయానంద్, తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెట్ కన్సల్టెంట్ జి.జయపాల్‌రెడ్డి, కన్సల్టెంట్లు శంకరయ్య, లింబగిరి స్వామి, ఎన్జీవో ప్రతినిధులు ఎ.పి. రంగారావు, బాలాజీ ఊట్ల తదితరులను ముఖ్యమంత్రి ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ఎలా ఉండాలి? స్థానిక సంస్థలకు ఎలాంటి విధులు అప్పగించాలి? వారు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి? నిధులు ఎలా సమకూర్చాలి? ప్రజలకు మరింత జవాబుదారీగా, మరింత క్రియాశీలకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?.. అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.