సాక్షి, హైదరాబాద్: పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడిన నేపథ్యంలో గ్రామాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కార్యాచరణ ప్రణాళిక అమలుకు నడుం బిగించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజల రోజువారీ జీవనవిధానం, శైలిలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలోని చట్టాల్లో వివిధ అంశాలకు సంబంధించి నిబంధనలున్నా వాటిని పెద్దగా పట్టించుకున్న, కచ్చితంగా అమలుచేసిన సందర్భాలు తక్కువే. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చిన వివిధ అంశాలను ఆచరణాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. పరిసరాల పరిశుభ్రత కొనసాగేలా చూడటంతోపాటు వివిధ రూపాలు, చర్యల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడే వారినుంచి జరిమానా వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా వారిలో పరివర్తన తీసుకురావడంతో పాటు ఆయా నిబంధనలు పటిష్టంగా అమలుచేసే దిశగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో ఉంది. కొత్త చట్టంలోని అంశాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాక నియమ నిబంధనలు అమలు చేయడం మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఉల్లంఘనులను ఉపేక్షించరు..
కొత్తగా నిర్దేశించిన నిబంధనలు కచ్చితంగా అమల్లోకి వస్తే పల్లెల్లో జరిమానాల మోత మోగనుంది. గ్రామాల పరిధిలో వివిధ అంశాలకు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కొరడా ఝళిపించే అవకాశాలున్నాయి. గ్రామపంచాయతీలు రూపొందించిన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తి నుంచి పంచాయతీ ఖరారు చేసిన మేర జరిమానా (రూ.ఐదు వేలు మించకుండా) వసూలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఉల్లంఘనలు అదే రీతిలో కొనసాగించిన పక్షంలో రోజుకు రూ.వంద చొప్పున జరిమానా విధిస్తారు.
రోడ్లపై అశుద్ధం పారితే రూ. 5వేలు.
►పబ్లిక్ రోడ్లపై మురుగు, అశుద్ధం ప్రవహింపజేస్తే రూ.ఐదువేలు జరిమానా
►నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ మార్కెట్‌ను తెరిచి ఉంచితే రూ.ఐదు వేలు
►మురుగునీటి కాల్వ పూడ్చి, దానిపై అనధికార భవన నిర్మాణం చేపడితే రూ.2 వేలు
►ఆక్రమణలు తొలగించడంలో, మార్పుచేయడంలో విఫలమైతే రూ.రెండు వేలు
►రోడ్లపై, గ్రామ పంచాయతీ పరిధిలోని ఇతర చోట్ల అనుమతి లేకుండా మొక్కలు నాటితే రూ. 2 వేలు
►పంచాయతీ పరిధి, క్రమబద్ధీకరించిన భూమి లేదా పోరంబోకు భూమిలో చెట్లు అనుమతి లేకుండా నరికితే రూ. రెండు వేలు
►గ్రామపంచాయతీ ఆస్తులు ఆక్రమించుకున్నా లేదా అనధికారికంగా కలిగి ఉన్నా రూ.2 వేలు
►లైసెన్స్ లేకుండా లేదా ఇచ్చిన లైసెన్స్‌లకు విరుద్ధంగా రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని వాహనాలు నిలిపి ఉంచే ప్రదేశంగా వాడుకుంటే రూ. 2వేలు
► లైసెన్స్ లేకుండా ఇచ్చిన లైసెన్స్‌లకు విరుద్ధంగా కొత్త ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినా, ప్రైవేట్ పార్కింగ్ స్థలాన్ని కొనసాగిస్తే రూ. 2వేలు
►వధశాలకు వెలుపల పశువులను వధించినా, చర్మం వలిచినా రూ. 2 వేలు
► రిజిస్ట్రేషన్ లేకుండా అనధికార శ్మశానాలు తెరవడం, శవాల ఖననం చేస్తే రూ.వెయ్యి
► తాగునీటి సరఫరా వనరుకు లేదా నివాస ప్రాంతాలకు 200 మీటర్ల పరిధిలో శవాల ఖననం, దహనం వంటివి చేస్తే రూ.వెయ్యి
►నిషేధిత స్థలంలో శవాలు పాతిపెట్టినా, దహనం చేసి, ఇతర పద్ధతులు పాటించినా రూ.వెయ్యి
►పబ్లిక్ రోడ్డుపై లేదా రోడ్డు మీదుగా అనధికారికంగా గోడ లేదా ఫెన్స్ నిర్మిస్తే రూ.వెయ్యి
►నీటిని వృథా చేయకుండా నిషేధిస్తూ ఇచ్చిన నోటీసును పట్టించుకోకపోతే రూ.500
►తాగునీటికోసం ఏర్పాటుచేసిన స్థలంలో బట్టలు ఉతికితే రూ.500
►తాగునీటి ఉపయోగం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో స్నానం, ఇతర చర్యలకు పాల్పడితే రూ.500
►మంచినీటి ఉపయోగం కోసం ఏర్పాటు చేసిన చోట్ల హానికరమైన వస్తువులను ఉంచితే రూ.500
►తాగునీరు, స్నానం చేయడానికి లేదా బట్టలు ఉతకడానికి ఏర్పాటు చేసిన స్థలంలో మురుగునీటిని, మురుగు కాల్వలు మొదలైన వాటిని అనుమతిస్తే రూ.500 జరిమానా విధించనున్నారు.
ఉల్లంఘిస్తే ఉతుకుడే!
Published Fri, Feb 8 2019 12:25 AM | Last Updated on Fri, Feb 8 2019 12:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment