సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధి మరింత విస్తృతం కానుంది. శివార్లలోని గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా గ్రేటర్ భౌగోళిక విస్తీర్ణం భారీగా పెరగనుంది. తాజాగా రాజధాని శివార్లలోని 27 గ్రామాలను జీహెచ్‌ఎంసీలో కలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజా ప్రతిపాదనలతో రాజేంద్రనగర్(ప్రస్తుతం గండిపేట) గ్రామీణ మండలం అంతా బల్దియా గొడుగు కిందకు రానుంది. శంషాబాద్ మండలంలోని ఆరు గ్రామాలను కూడా జీహెచ్‌ఎంసీలో చేర్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. శరవేగంగా పట్టణ రూపు సంతరించుకుంటున్న శంషాబాద్ మండల కేంద్రం సహా పరిసర గ్రామాలను ఇందులో కలిపేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. దీంతో కొత్తగా 1,52,261 జనాభా(2011 గణాంకాల ప్రకారం) గ్రేటర్ పరిధిలోకి రానుంది.
నగరీకరణ నేపథ్యంలో..
బహుళజాతి సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీల తాకిడి, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పా టుతో శివారు ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. ఈ క్రమంలో ఐటీ హబ్‌కు సమీపంలో ఉన్న గండిపేట మండలంలోని గ్రామా లు బహుళ అంతస్తు భవనాలు, కార్పొరేట్ కంపెనీలతో కొలువుదీరాయి. అయితే, మౌలిక సదుపాయాలు అంతగా లేకపోవడం.. పంచా యతీ పాలకవర్గాలు ఆ దిశగా ఆలోచన చేయకపోవడం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో నగరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా శివారు పంచాయతీలను గ్రేటర్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో వెనక్కి తగ్గింది. అయితే త్వరలోనే ఈ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం పాత ప్రతిపాదనలపై
దృష్టి సారించింది.
గండిపేట మండలమంతా..
కొత్త పంచాయతీరాజ్ చట్టంపై కసరత్తు చేస్తున్న సర్కారు.. బల్దియాలో పంచాయతీల విలీనం, కొత్త పంచాయతీల ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల జాబితాను కోరింది. ఈ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు గ్రేటర్‌లో కలపాలని నిర్ణయించింది. దీంతో గండిపేట మండలంలోని బండ్లగూడ, గండిపేట, హిమాయత్‌సాగర్, హైదర్షాకోట్, కిస్మత్‌పూర్, ఖానాపూర్, కోకాపేట, మంచిరేవుల, మణికొండ జాగీర్, నార్సింగి, నెక్నాంపూర్, పీరంచెరువు, పుప్పాల్‌గూడ, వట్టినాగుపల్లి పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో కలపనుంది. ఈ మేరకు బుధవారం పంచాయతీరాజ్ కమిషనర్‌కు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. అలాగే, శంషాబాద్ సహా కొత్వాల్‌గూడ, ఊట్‌పల్లి, తొండుపల్లి, చిన్నగొల్లపల్లి, సాతంరాయి గ్రామాలు కూడా గ్రేటర్‌లో కలవనున్నాయి. తాజా ప్రతిపాదనలతో గండిపేట ఇకపై పట్టణ మండలంగా కొనసాగనుంది. ప్రస్తుతం ఉన్న మండల పరిషత్ వ్యవస్థ రద్దయి.. పురపాలనలోకి మారనుంది.
హయత్‌నగర్‌లోని ఏడు గ్రామాలు..
హయత్‌నగర్ (ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్) మండలంలోని తొర్రూరు, బ్రాహ్మణపల్లి, మునగనూరు, కోహెడ, ఇంజాపూర్, తుర్కయాంజాల్, కమ్మగూడ గ్రామాలు జీహెచ్‌ఎంసీలో చేరనున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ సరిహద్దు నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున.. వీటిని విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు ప్రస్తుత నగర పంచాయతీలకు కిలోమీటర్ దూరంలోని గ్రామాలను ఆయా నగర పంచాయతీల్లో కలిపేస్తోంది.
న్యాయపరమైన చిక్కులు లేకుండా..
మరోవైపు షాద్‌నగర్ మున్సిపాల్టీలోకి ఎనిమిది సమీప గ్రామాలు చేరనున్నాయి. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అన్నారం, బుచ్చిగూడ, చిలకమర్రి, దుస్‌కల్, హాజిపల్లి, కమ్మదనం, లింగారెడ్డిగూడ, నాగులపల్లి గ్రామాలు ఈ పురపాలికలో విలీనం కానున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 2తో ప్రస్తుత పంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ముగిస్తున్నందున.. ఆ లోపు వీటిని పంచాయతీరాజ్‌శాఖ నుంచి డీనోటిఫై చేసి.. పురపాలక శాఖలో చేరుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో గతంలో మాదిరి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. మరోవైపు ఈ పంచాయతీలే కాకుండా.. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న గ్రామాలను కూడా పురపాలన పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే.. హైదరాబాద్ మరింత విస్తరించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment