సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో వెలిసిన లే అవుట్లను కూడా క్రమబద్ధీకరించాలని సర్కారు యోచిస్తోంది. అక్రమ వెంచర్లలోని ప్లాట్లకు కూడా దీన్ని వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమ భవనాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలోని లే అవుట్లకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. డీటీసీపీ నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్న వెంచర్లకు కాకుండా.. వాటి పరిధిలో అక్రమంగా వెలిసిన వాటికే క్రమబద్ధీకరణను వర్తింపజేస్తారని అధికారవర్గాలు తెలిపాయి. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మారుమూల ప్రాంతాల్లోని లే అవుట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
లే అవుట్ల వివరాలు పంపండి..
గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన లే అవుట్ల సమాచారాన్ని తక్షణమే సేకరించాలని డీటీసీపీ యంత్రాంగం డీపీవోలకు లేఖ రాసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి ఆమోద ముద్ర పడిన మూడు నెలల్లోపు లే అవుట్లను నోటిఫై చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో లే అవుట్ల వివరాలను రాబడు తోంది. వెంచర్ యజమాని, సర్వే నంబర్, రెవెన్యూ గ్రామం, విస్తీర్ణం, రోడ్లకు కేటాయించిన విస్తీర్ణం (శాతం), ఓపెన్ ఏరియా, జీవో 67 ప్రకారం మౌలిక సౌకర్యాలు కల్పించారా లేదా తదితర వివరాలను సేకరించాలని నిర్దేశిస్తూ ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. అనధికార లేఅవుట్ల వ్యవహారంలో చూసీచూడనట్లు వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి/ఈవోపీఆర్‌డీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వాటి స్థితిగతులపై స్పష్టమైన వివరణ కోరుతూ డీటీసీపీ డైరెక్టర్ లేఖ రాశారు.
ఈ సమాచారాన్ని ఈ నెల 25వ తేదీలోపు పంపాలని ఆదేశించారు. మరోసారి ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశమిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తుండటంతో.. ఇందులో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ను హెచ్‌ఎండీఏ పరిధిలోకి రాని గ్రామాలకు కూడా వర్తింపజేస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూలు, నల్లగొండ, యాదాద్రి, మెదక్ తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన పలువురు మధ్యతరగతి ప్రజానీకానికి ఊరట కలగనుంది.
గ్రామీణ లే అవుట్లకూ క్రమబద్ధీకరణ
Published Wed, Jun 20 2018 1:25 AM | Last Updated on Wed, Jun 20 2018 1:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment