సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం అభివృద్ధికి ఇబ్బందికరంగా మారిన పలు నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీంతోపాటు కొన్ని అంశాల్లో మార్పులు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భవన నిర్మాణ నియమావళి, లేఅవుట్ల అభివృద్ధి నిబంధనలను సరళీకరిస్తూ... రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదెకరాలు/అంతకు మించిన విస్తీర్ణం గల హౌసింగ్ ప్రాజెక్టుల్లో పేదలకు 25 శాతం గృహాలు లేక భవనంలో 10 శాతం ప్రాంతాన్ని కేటాయించాలన్న నిబంధనను రద్దు చేసింది.
‘సిటీ లెవల్ ఇంపాక్ట్ ఫీజు’ తగ్గింపు, ఆన్‌లైన్ విధానం అమలు, 15 రోజుల్లో ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ జారీ వంటి నిర్ణయాలు తీసుకుంది. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో గిఫ్టు రిజిస్ట్రేషన్ నిబంధనను సడలించింది, అంతర్గత రోడ్లను 40 అడుగుల వెడల్పుతో నిర్మిస్తే.. సెట్‌బ్యాక్ సడలింపులు/ అదనపు అంతస్తులకు అనుమతులు/ ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్) సౌకర్యాన్ని కల్పించనుంది. మూసీ బఫర్ స్ట్రిప్‌ను 50 మీటర్లకు తగ్గించింది.
మరిన్ని కీలక నిర్ణయాలు..
► చిరు వ్యాపారుల ప్రయోజనాలు, హక్కులను పరిరక్షించడం, వారికి భద్రత కల్పించేందుకు ‘తెలంగాణ స్టేట్ స్ట్రీట్ వెండింగ్ స్కీం’ను ప్రకటించారు.
► తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ శివార్లలో నిర్మించనున్న జంట జలాశయాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించారు.
► జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 1చ200, ఆలోపు వార్షిక ఆస్తిపన్ను గల నివాస గృహాల నుంచి ఇకపై రూ.101 మాత్రమే వసూలు చేస్తారు.
► హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో నల్లా నీటికి సంబంధించి జల మండలికి చెల్లించాల్సిన రూ. 457.75 కోట్ల బకాయిలను రద్దు చేశారు.
‘నాలా’ ఫీజు భారీగా తగ్గింపు
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ (వ్యవసాయేతర అవసరాల కోసం మార్చేందుకు) యాక్ట్-2006’ను తెలంగాణ రాష్ట్రానికి అన్వయించుకుంటూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టంలో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నచోట తెలంగాణ పదాన్ని చేర్చింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగం కోసం అనుమతించేందుకు చెల్లించాల్సిన ఫీజు (నాలా ఫీజు)ను భారీగా తగ్గించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఫీజు భూమి ముఖ విలువ (బేసిక్ వాల్యూ)లో 5 శాతం ఉండగా... తాజాగా 2 శాతానికి తగ్గించింది. జీహెచ్‌ఎంసీ అవతలి పరిధిలో (హెచ్‌ఎండీఏ పరిధిలో) 9 శాతం నుంచి 3 శాతానికి తగ్గించింది.
ఇక ఈ ప్రక్రియకు వివిధ స్థాయిల్లో ఉన్న గడువును కుదించింది. దరఖాస్తుదారులు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు చెల్లించాల్సిన మొత్తం కంటే తక్కువగా చెల్లించినట్లయితే... మిగతా సొమ్ము చెల్లించాలని సంబంధిత ఆర్డీవో 30రోజుల్లోగా నోటీసు జారీ చేయాలి. ఈ గడువును 7 రోజులకు తగ్గించారు. ఈ నోటీసు జారీ చేసిన తర్వాత దరఖాస్తుదారు మిగతా సొమ్మును చెల్లించేందుకు ఉన్న 15 రోజుల గడువును ఏడు రోజులకు కుదించారు. ఇక ఆర్డీవో నుంచి దరఖాస్తుదారుకు 30 రోజుల్లోగా నోటీసు రాకుంటే ఆ దరఖాస్తుకు అంగీకారం వచ్చినట్లుగా పరిగణించేవారు. ఈ గడువును 7 రోజులకు తగ్గించారు. ఇక దరఖాస్తుదారు విన్నపానికి అంగీకారం లేదా తిరస్కారాన్ని తెలిపేందుకు 60 రోజుల గడువు ఉండగా.. దానిని 15రోజులకు తగ్గించారు. దర ఖాస్తుదారు పూర్తి సొమ్ము చెల్లించాక దరఖాస్తును క్లియర్ చేసేందుకు ఉన్న 30రోజుల గడువును ఏడు రోజులకు తగ్గించారు.
‘రియల్’ అభివృద్ధికి ఊతం!
Published Wed, Jan 6 2016 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement