కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకేనా?
మనోళ్లు పనికిరారా?: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పంపిణీ చేసిన చెత్తడబ్బాల కాం ట్రాక్టు ఆంధ్రా వాళ్లకే.. మన ఊరిలో చెరువులు బాగు చేయించే పనులు వాళ్లకే.. చెత్త డబ్బా లను తయారు చేయడానికి, ఊళ్లో చెరువుల్లో మట్టి ఎత్తిపోయడానికి కూడా మన వాళ్లు పనికిరారా..?’’ అని టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు తెలంగాణ వారికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మిషన్ భగీరథ పైపులు ఎక్కడ తయారవు తున్నాయో, ఎక్కడ్నుంచి వస్తున్నయో తెలియడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపైకి కట్టె పట్టుకుని మీదకు ఉరికి వచ్చిన వాళ్లే పదవుల్లో ముందున్నారని వ్యాఖ్యానించారు.
ఆదివారమిక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) రూపొందించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణకు అడ్డంపడి, ఉద్యమకారులపై దాడులు చేసిన శక్తులే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అధిపత్యం చెలాయిస్తున్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు, ఉద్యమ వ్యతిరేకులకు మధ్య ఘర్షణ జరుగుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదని పేర్కొన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టులను ఇక్కడి ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ‘‘సాగునీటి ప్రాజెక్టుల్లో ఆంధ్రా కాంట్రాక్టర్ల ఆధిపత్యం చెప్పతరం కాదు. ఇక్కడి భారీ, చిన్నతరహా పరిశ్రమల్లోనూ తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలు రావడం లేదు. తెలంగాణకు చెందిన చిన్న కాలేజీలను ఇప్పటికి నాలుగుసార్లు తనిఖీల పేరుతో వేధించారు.
ఆంధ్రా కార్పొరేటు యాజమా న్యాల దోపిడీని మాత్రం ప్రభుత్వం ప్రశ్నించడం లేదు. నసీబును తుడిచే రబ్బరు లేదా అని దాశరథి అడిగినట్టు వలసాధి పత్యాన్ని తుడిచే రబ్బరు లేదా అని ప్రశ్నిం చారు. కాలుష్యం పేరుతో వరంగల్‌లోని చిన్నచిన్న పరిశ్రమలను మూయించేస్తున్న ప్రభుత్వానికి హైదరాబాద్ పరిసరాల్లో విషం చిమ్ముతున్న ఆంధ్రావాళ్ల కంపెనీలు కనబడవా అని ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ఇళ్లు లేవ ని, న్యాయవాదుల ఆ కాంక్షలు నెరవేరలేదని, ఇంకా హైకోర్టును విభ జించలేదని అన్నారు.
ఉద్యోగాలను ఏ కాకి ఎత్తుకెళ్లిందో?
రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న ప్రభుత్వం ఆ తర్వాత 55 వేలే అని చెప్పిందని కోదండరాం పేర్కొన్నారు. ‘‘ఆ తర్వాత ఏడాదికి 20 వేలు ఇస్తామని చెప్పింది. ఆ తరువాత 10 వేలు ఇస్తామంది. మరోసారి మాటమార్చి 4 వేలు అన్నారు. ఇప్పుడేమో కేవలం 16 వందల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. లక్షల ఉద్యోగాలను ఏ కాకి ఎత్తుకుపోయిందో పదవుల్లో ఉన్నవాళ్లే చెప్పాలి’’ అని అన్నారు.
రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు?
రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఎందుకొచ్చిందని కోదండ రాం ప్రశ్నించారు. కందులు కొనాలని రైతు లు అధికారుల కాళ్లు పట్టుకుంటున్నా కనిక రించడం లేదని, రంగారెడ్డి పరిసరాల్లో కూర గాయలకు ధర లేకపోవడంతో రోడ్లపై పార బోస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం లోనూ నిజాం షుగర్ తెరవాలని అడ గాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. దానికి పక్కనే ఉన్న ఆంధ్రా కంపెనీలు చక్కగా నడుస్తున్నాయని, ప్రజలకు సంబం ధించిన వాటినే ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, జేఏసీ నేతలు శంకర్, వెంకటరెడ్డి, భైరి రమేశ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.