పనిచేయని సర్పంచులు ఇంటికే.. | Sarpanch it does not work homes | Sakshi
Sakshi News home page

పనిచేయని సర్పంచులు ఇంటికే..

Published Wed, Sep 10 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

పనిచేయని సర్పంచులు ఇంటికే..

పనిచేయని సర్పంచులు ఇంటికే..

వారి సస్పెన్షన్‌పై స్టే మంజూరు చేసే అధికారం మంత్రులకు లేకుండా సవరణ
అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై విచారణకు అంబుడ్స్‌మెన్
పంచాయతీరాజ్ చట్టంలో భారీ మార్పులకు తెలంగాణ సర్కారు నిర్ణయం
ముసాయిదా ప్రతిని సిద్ధం చేసిన అధికారులు
సీఎం, కేబినెట్ ఓకే చేస్తే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు..

 
హైదరాబాద్: పనిచేయని సర్పంచులను ఇక ఇంటికే పంపనున్నారు. అంతేకాదు.. వారిని సస్పెండ్ చేస్తే.. మంత్రులు జోక్యం చేసుకుని ‘స్టే’ మంజూరు చేసే విధానానికీ త్వరలో చెల్లుచీటీ ఇవ్వనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో భారీ మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సవరణలతో కూడిన ముసాయిదా ప్రతిని కూడా అధికారులు సిద్ధం చేశారు. ముసాయిదాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే శాసన సభ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది. ఏపీ పంచాయతీరాజ్ చట్టాన్ని యథాతథంగా అమ లుచేయకుండా అందులో మార్పు చేయాలని, గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే సమయంలో  సర్పంచులు సరిగా పనిచేయకుంటే వారిని ఇం టికి సాగనంపేలా చట్టంలో మార్పులు చేయాలని ముసాయిదాలో పేర్కొన్నట్లు తెలిసింది. సర్పంచులను సస్పెండ్ చేస్తే మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని ‘స్టే’ మంజూరు చేసే విధానానికీ స్వస్తి చెప్పనున్నారు. దీంతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో అధికారులు, ప్రజాప్రతి నిధులు ఎవరు అవినీతికి పాల్పడినా విచారించడానికి వీలుగా అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పా టు చేసే అంశం కూడా ముసాయిదాలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు లోకాయుక్త వ్యవస్థ ఉన్నా దాని వల్ల ఆలస్యం అవుతున్నందున అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 73వ రాజ్యాంగ సవరణలో పే ర్కొన్న 29 అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ కీలక అధికారాలను పంచాయతీలకు బదిలీ చేయలేదు.

నామమాత్రంగా అధికారాలు బదిలీ చేసి చేతులు దులుపుకున్నాయి. అయితే వ్యవసాయం, విద్య, పశువైద్యం, ఉపాధి హామీ పథకం, హాస్టళ్లు వంటి వాటిపై పూర్తి బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే.. ప్రజల సహకారంతో అభివృద్ధి జరగాల్సిన వ్యవస్థ అని.. అది కాస్తా రాజకీయ వ్యవస్థగా మారిందని కేసీఆర్ గతంలో పలుమార్లు అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని పదే పదే చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణం గా అధికారులు ముసాయిదాను రూపొందిం చారు. ఇదిలా ఉండగా తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ కోసం కొత్తగా ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయాల్సి ఉన్నం దున, ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement