సాక్షి, హైదరాబాద్: గ్రామాల పాలన మరోసారి అధికారుల చేతుల్లోకి వెళ్తోంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు 1తో ముగుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తాయి. అదే రోజు నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులకు పాలన వ్యవహారాలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సర్పంచ్‌లకు ప్రత్యామ్నాయంగా అధికారులు పాలన అందించేలా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీల పునర్విభజన జరిగింది. కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పాలకవర్గాల పదవీకాలం ముగిసే రోజు నుంచే కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. కొత్త పంచాయతీల ఏర్పాటు, కొత్త పంచాయతీలకు అవసరమైన భవనాలు, ఇతర సామగ్రి, ప్రత్యేక అధికారుల పాలన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించింది. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... దీని కోసం చేసే ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు వికాస్‌రాజ్.. పంచాయతీరాజ్ కమిషనర్‌కు, అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
♦ ప్రస్తుత పంచాయతీల పదవీకాలం ఆగస్టు 1న ముగుస్తుంది. కొత్త పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదవుతుంది. కొత్త, పాత పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే ఏర్పాట్లను ముందుగానే చేయాలి.
♦ గ్రామ పంచా యతీలను కలిపి ఏర్పాటు చేసిన క్లస్టర్లను పునర్విభజన చేయాలి. కొత్త పంచాయతీల ఏర్పాటుతో వీటి పరిధి మారుతుంది. గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా క్లస్టర్లను పునర్విభజన జరపాలి.
♦ కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాలకు అవసరమైన భవనాలను గుర్తించి సిద్ధం చేయాలి. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కొత్త వాటికి అనుగుణంగా విభజించాలి. స్వీపర్లు, వాచ్‌మెన్, ఎలక్ట్రీషియన్స్, బిల్ కలెక్టర్లు వంటి సిబ్బంది విభజన పూర్తి చేయాలి.
♦ ప్రస్తుత గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే వాటి పరిధి, జనాభాకు అనుగుణంగా ఆస్తుల పంపిణీ పూర్తి చేయాలి. డిమాండ్, రెవెన్యూ రిజిస్టర్లను పంపిణీ చేయాలి. అన్ని రకాల అధికార వ్యవహారాల పత్రాలను వేర్వేరు చేసి పంపిణీ జరపాలి.
♦ కొత్త పంచాయతీల ఏర్పాటును పండుగలా నిర్వహించాలి. విస్తృత ప్రచారం జరపాలి. డప్పు చాటింపు చేయాలి. కొత్త గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు అభినందనలు తెలిపేలా బ్యానర్లు కట్టాలి.
♦ కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేయాలి. ‘గ్రామ పంచాయతీ కార్యాలయం’అని తెలుగులో బోర్డు పెట్టాలి. కొత్త గ్రామ పంచాయతీ పేరుతో అధికారిక స్టాంప్, సీల్, సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేయాలి. పాత, కొత్త గ్రామ పంచాయతీల పరిధిని తెలిపేలా భౌగోళిక చిత్రాలను సూచించేలా బోర్డులను రూపొందించాలి.
♦ గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి నిర్దేశించిన రోజున కచ్చితంగా బాధ్యతలు తీసుకోవాలి. కొత్త గ్రామపంచాయతీ పేరుతో ప్రత్యేక అధికారులు కొత్తగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించాలి. గ్రామపంచాయతీలో అవసరమైన అన్ని రకాల మౌలిక సేవల ప్రక్రియను పర్యవేక్షించాలి. రోజువారీ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సామాజిక పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను, స్థానిక అవసరాలను తీర్చేలా ప్రత్యేక అధికారులు పని చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment