మంగళవారం ఉదయం వరకు జరిగిన కౌన్సెలింగ్
162 మందికి బదిలీలు
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఎట్టకేలకు పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ బదిలీలు జరిగాయి. వారం రోజులుగా బదిలీలు ఏ విధంగా జరుపుతారోనని సిబ్బందిలో ఆందోళన మొదలైంది. సోమవారంతో బదిలీల ప్రక్రియ సమయం ముగియనున్నందున బదిలీలు ఎక్కడ జరుపుతారో, ఏవిధంగా జరుపుతారో సిబ్బందిలో అయోమయం నెలకొంది. అయితే ఎట్టకేలకు సోమవారం రాత్రి సీనియార్టీ జాబితాలు విడుదల చేశారు. ఈ జాబితాలను పరిశీలించిన మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు, చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, సీఈవో నాగార్జునసాగర్‌తో చర్చలు జరిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లో పనిచేసే సిబ్బంది పనితీరును ఒకే రకంగా మార్పులు చేశారని అలా కాకుండా మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో పనిచేసే సిబ్బంది సర్వీసు వివరాలు తప్పులతడకగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
సర్వీస్ సీనియార్టీపై 15 మార్కులు, ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న సిబ్బందికి విధి నిర్వహణను బట్టి 10 మార్కులు, బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా కొన్ని మార్కులు కలపాల్సి ఉన్నాయన్నారు. ఇవి కాకుండా స్వీయ మదింపు ద్వారా కొన్ని మార్పులు కలపాలని కలెక్టర్ ఆదేశాల ప్రకారం జాబితా తయారు చేశారని ఈ జాబితాలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని సంఘ నాయకులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆమె స్పందించి సిబ్బందికి అనుకూలంగా ఎటువంటి అన్యాయం జరగకుండా జాబితాను తయారుచేయాలని సూచించారు. దీంతో సోమవారం రాత్రి ఒంటి గంటకు వివిధ క్యాడర్ల వారీగా బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము వరకు ఈ కౌన్సెలింగ్ కొనసాగింది. క్యాడర్ల వారీగా బదిలీ అయిన సిబ్బంది
వివరాలు ఇలా ఉన్నాయి
జిల్లాలో ఐదేళ్లు దాటిన సిబ్బంది 156 మంది బదిలీ కాగా మూడు సంవత్సరాలు దాటి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరుగుర్ని బదిలీ చేశారు. ముందుగా ఎంపీడీవోల్లో ఆగిరిపల్లిలో పనిచేస్తున్న కె.బసవరావు పమిడిముక్కల ఎంపీడీవోగా, జగ్గయ్యపేటలో పనిచేస్తున్న జయచంద్రను వత్సవాయి ఎంపీడీవోగా, మొవ్వలో పనిచేస్తున్న పిచ్చిరెడ్డిని జగ్గయ్యపేట ఎంపీడీవోగా బదిలీ చేశారు. వీరు కాక సూపరింటెండెంట్లు ముగ్గురు, సీనియర్ అసిస్టెంట్లు 11, జూనియర్ అసిస్టెంట్లు 17, టైపిస్ట్‌లు ఆరుగురు బదిలీ చేశారు.
రికార్డు అసిస్టెంట్లు 32 మంది, ల్యాబ్ అసిస్టెంట్లు 15 మంది, లైబ్రరీ అసిస్టెంట్లు 14 మంది, అటెండర్లు 43, నైట్‌వాచ్‌మెన్లు ఏడుగురు, గార్డెనెర్లు ఐదుగుర్ని బదిలీ చేశారు. వీరు కాక మూడు సంవత్సరాలు దాటిన సీనియర్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్లు నలుగురు, టైపిస్ట్ ఒకర్ని బదిలీ చేశారు.
పంతం నెగ్గించుకున్న చైర్‌పర్సన్
జిల్లా పరిషత్ సిబ్బంది బదిలీల విషయంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బదిలీల ప్రక్రియను చైర్‌పర్సన్ గద్దె అనూరాధ బదిలీల కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. ప్రభుత్వం నుంచి బదిలీల మార్గదర్శకాలు వచ్చిన అనంతరం అన్నిశాఖల్లో సిబ్బంది బదిలీలను కలెక్టర్ బాబు.ఎ ఆదేశాల ప్రకారం నిర్వహించాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బదిలీల ప్రక్రియను చట్టప్రకారం నిర్వహించాల్సి ఉండగా కలెక్టర్ జోక్యం చేసుకోవటంతో ఆమె ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో బదిలీల ప్రక్రియలో సిబ్బందికి ఇబ్బందులు జరుగుతున్నాయని గ్రహించిన చైర్‌పర్సన్ ఉద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆమె సిబ్బంది సమక్షంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా కొంత మంది ఉద్యోగులకైనా న్యాయం జరిగిందని సంఘ నాయకులు చెప్పుకోవటం గమనార్హం.