సాక్షి, హైదరాబాద్: గ్రామ పరిపాలన మొత్తం ఇకముందు సర్పంచ్ కేంద్రంగానే జరగనుంది. గ్రామ పంచాయతీ పరిధిలో కార్యనిర్వాహక నిర్ణయాలన్నీ సర్పంచ్ చేతుల్లోనే ఉండనున్నాయి. ప్రస్తుతం గ్రామ కార్యదర్శి నిర్వహిస్తున్న పలు కార్యనిర్వహణ అధికారాలను సర్పంచ్‌లకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ బిల్లు రూపకల్పన కోసం నియమించిన మంత్రుల సంఘం చేసిన సిఫారసుల ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లుకు తుది రూపం ఇస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
వేటుకూ అవకాశం!
గ్రామ సుపరిపాలన లక్ష్యంగా పంచాయతీరాజ్ చట్టానికి భారీగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నిధుల ఖర్చులో ప్రస్తుతం గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు సమానంగా అధికారాలు ఉన్నాయి. ఇద్దరూ సంతకాలు చేస్తేనే నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇకముందు చెక్ పవర్ పూర్తిగా సర్పంచులకే దఖలు పడనుంది. ఇలా సర్పంచ్‌లకు అధికారాలు ఇవ్వడంతోపాటు సరిగా పనిచేయకపోతే వేటు వేసేలా బిల్లును రూపొందిస్తున్నారు.
అవినీతి జరిగినట్లు నిరూపణ జరిగితే సర్పంచ్‌ను పూర్తిగా తొలగించేలా చట్టంలో సవరణలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన తండాలు, ఇతర ఆవాసాలను కొత్త పంచాయతీలుగా మార్చాలన్న నిర్ణయం మేరకు కొత్తగా 4,122 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. అయితే ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. దీంతో పాత, కొత్త పంచాయతీలన్నింటికీ కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు.
కొత్త వాటికే కొత్త రిజర్వేషన్లు!
కొత్త పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపైనా కీలక మార్పులను చేర్చనున్నారు. ప్రస్తుతమున్న పంచాయతీలకు ప్రస్తుత రిజర్వేషన్లనే వర్తింపజేయాలని, కొత్త గ్రామ పంచాయతీలకు మాత్రం కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా పదేళ్లకోసారి గ్రామ పంచాయతీల రిజర్వేషన్లలో మార్పులు ఉండేలా నిబంధనలు మార్చనున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్‌ను 33 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment