సాక్షి, హైదరాబాద్: గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పంచాయతీరాజ్ చట్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీలకు కొత్తగా అధికారాలివ్వడం పక్కనబెట్టి.. పాలక వర్గాలు, కార్యనిర్వాహక సిబ్బందిని కట్టడి చేయడానికే చట్టంలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులు, అవసరాలను పట్టించుకోకుండా కొత్త చట్టం రూపొందించారని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. కొత్త చట్టంలోని కొన్ని లోపాలపై ఉన్నతాధికారులకు వివరిస్తే.. ‘అవునా.. అలా ఉందా? అదెలా సాధ్యం’ అంటున్నారని చెబుతున్నారు. కొత్త చట్టం అమలు కోసం ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. దీనికి ముందు చట్టంలోని అంశాల ఆధారంగా నిబంధనలు రూపొందించి ఫలానా తేదీ నుంచి చట్టం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులిస్తారు. దీనికి ముందే ఆ లోపాలు సరి చేయాలని ప్రభుత్వాన్ని కార్యదర్శులు కోరుతున్నారు.
ఇదెక్కడి ‘లెక్క’
సరైన సమయంలో పంచాయతీ లెక్కలు ఆడిట్ చేయించడంలో విఫలమైతే సర్పంచ్, గ్రామకార్యదర్శిని పదవి నుంచి తొలగించినట్లు భావించవచ్చని చట్టంలోని సెక్షన్–34లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత చట్ట ప్రకారం కార్యదర్శి, సర్పంచ్‌కి కలిపి చెక్ పవర్ ఉండగా.. కొత్త చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా ఉంది. కాబట్టి చెక్ పవర్ బాధ్యత లేని గ్రామకార్యదర్శిని బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పంచాయతీ తీర్మానాలకు గ్రామ కార్యదర్శులే బాధ్యత వహించాలని సెక్షన్ 43(4) పొందుపరిచారు. ఆ తీర్మానాల్లో ఎక్కువగా నిధులకు సంబంధించిన అంశాలే ఉంటాయి. కొత్త పనులకు నిధులు అవసరమవుతాయి. ఎక్కువ గ్రామాల్లో పనులకు సరిపడా నిధులుండవు. ఇలాంటి సందర్భాల్లో పంచాయతీ తీర్మానాల బాధ్యత కార్యదర్శిదే అంటే ఇబ్బందేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘రోజ్నాంచ’ ఇప్పుడెలా..?
పంచాయతీకి వచ్చే కొత్తవారు, విశేష సంఘటనలను రోజూ ‘రోజ్నాంచ’లో నమోదు చేయాలని సెక్షన్ 43(5)(1)లో పేర్కొన్నారు. రోజ్నాంచ నమోదు రెవెన్యూ శాఖ వ్యవహారం. అది వీఆర్వో (పట్వారీ) ఆధ్వర్యంలో జరుగుతోంది. రవాణా వ్యవస్థ పెద్దగా లేని రోజుల్లో, తక్కువ జనాభా ఉన్నప్పుడు రోజ్నాంచ మొదలైంది. ఇప్పుడు వాహనాల సంఖ్య పెరిగింది. ప్రస్తుత సందర్భాల్లో ప్రతి వాహనాన్ని నిలిపి వివరాలు నమోదు చేయడం సాధ్యమవదు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి బాధ్యత ల్లో చేర్చడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. అలాగే పంచాయతీ ఆదాయ, ఖర్చుల వివరాలను లెక్కల పుస్తకంలో గ్రామ కార్యదర్శి పొందుపరచాలని సెక్షన్ 43(5) (10)లో పేర్కొన్నారు. అయితే ఖర్చుల వ్యవహారం చెక్ పవర్ ఉండే సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆదా య, ఖర్చు వివరాల నిర్వహణ కార్యదర్శికి ఉండటం సరికాదనే అభిప్రాయం ఉంది.
100 శాతం పన్నులెలా సాధ్యం..?
సెక్షన్ 43(5)(14) ప్రకారం పన్నులు, పన్నేతర ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత కార్యదర్శిపైనే ఉంటుంది. పంచాయతీ సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులకు అవసరమైన డిమాండ్‌ను కార్యదర్శి రూపొం దించి ఆ డిమాండ్ ఆమోదం పొందిన 3 నెలల్లో సరిపడా మొత్తాన్ని వసూలు చేయాలి. లేదంటే కార్యదర్శిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పేద కుటుంబాలను పన్ను వసూలు కోసం ఒత్తిడి చేయలేరు. కాబట్టి 100 శాతం పన్నుల వసూలు అనేది వాస్తవంగా సాధ్యం కాదు. అలాగే పంచాయతీ జారీ చేసిన నిర్ణయాలపై మరుసటి రోజే కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయాలని సెక్షన్ 43(12)లో పేర్కొన్నారు. అయితే ఒకేరోజు అమలు.. వాస్తవ పరిస్థితుల్లో సాధ్యం కాదని కార్యదర్శ లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధుల పర్యటనలు, వ్యక్తిగత సెల వుల రోజుల విషయంలో నిబంధన మార్చాల ని కోరుతున్నారు. ఫీజులు, బెటర్‌మెంట్ చార్జీ ల విషయంలో పంచాయతీ తీసుకునే నిర్ణయా న్ని ఒకేరోజులో అమలు చేయడం కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది.
వారిని వదిలేసి మాపైనా..?
సెక్షన్ 43(6)(4) ప్రకారం గ్రామకార్యదర్శి.. గ్రామంలో నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చూడాలి. లేదంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో గ్రామకార్యదర్శికి సగటున 3 గ్రామాల బాధ్యతలిచ్చారు. ఉపాధి హామీ పథకం సిబ్బంది మొక్కల పెంపకం విధుల్లోనే ఉంటారు. అటవీ శాఖలో సామాజిక అడవుల పెంపకం విభాగం ఉంటుంది. ఈ రెండు విభాగాల సిబ్బందిని మినహాయించి కార్యదర్శులనే బాధ్యులు చేయడం సరికాదనే అభిప్రాయం ఉంది. అలాగే సెక్షన్ 43(6)(2) ప్రకారం.. ‘ప్రతి గృహ యజమానికి కనీసం 6 మొక్కలను పంచాయతీ కార్యదర్శి సరఫరా చేయాలి. మొక్కల సంరక్షణలో యజమాని విఫలమైతే అతని ఆస్తి పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించాలి’ అని పేర్కొన్నారు. ఇంటి ఆవరణలోని మొక్కల విషయంలో జరిమానా విధింపు, వసూలంటే వివాదాలకు కారణమవొచ్చు.
ప్రభుత్వం పరిశీలించాలి
బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని స్వాగతిస్తున్నాం. పంచాయతీలకు ఈ చట్టం ఎంతో మేలు చేస్తుంది. అయితే గ్రామ కార్యదర్శుల బాధ్యతల విషయంలో చట్టంలో పేర్కొన్న అంశాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఉద్యోగ భద్రత పరంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.
– ఎస్.భాస్కర్‌రెడ్డి, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment