- అక్రమ లే అవుట్ల తొలగింపు బాధ్యత పంచాయతీలకు
- పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ లే అవుట్ల వివరాలు
- వీజీటీఎం ఉడా నూతన నిర్ణయం
- సిబ్బంది కొరత వల్లేనని చెబుతున్న అధికారులు
సాక్షి, విజయవాడ : అక్రమ లే అవుట్ల తొలగింపునకు వీజీటీఎం ఉడా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించారు. అన్ని అనుమతులు ఉన్న లే అవుట్ల జాబితాను ఉడా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వారంలోపు ఆ జాబితాలను ఉడా పరిధిలోని అన్ని పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో భూసేకరణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే అక్రమ లే అవుట్ల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు ఇటీవల నిర్వహించిన సమీక్షలో కూడా అక్రమ లే అవుట్లను తక్షణమే తొలగించాలని ఆదేశించడం ఇందుకు బలాన్నిస్తోంది. అయితే లే అవుట్లకు అనుమతులు ఇవ్వడంతోపాటు సంబంధిత ఫీజులను ఉడా వసూలు చేస్తోంది. దీంతో లే అవుట్ల తొలగింపునకు పంచాయతీ అధికారులు ఎంత మేరకు ముందుకు వస్తారనేది ప్రశ్నార్థకమే.
సిబ్బంది కొరత వల్లే!
వీజీటీఎం ఉడా పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలో రెండు నగరపాలక సంస్థలు, ఎనిమిది మున్సిపాలిటీలు, సుమారు 1,400 గ్రామాలు ఉన్నాయి. ఉడాలో 120 మంది పనిచేయాల్సి ఉండగా, 58 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయడం సాధ్యం కావడం లేదని ఉడా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ లే అవుట్ల తొలగింపు బాధ్యతలను చేపట్టాలని ఆయా గ్రామ పంచాయతీలకు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని నిర్ణయించారు. తమ దృష్టికి వచ్చిన వాటిపై మాత్రం చర్యలు తీసుకుంటామని ఉడా అధికారులు చెబుతున్నారు.
ఉడా పరిదిలో 476 లేఅవుట్ల
ఉడా పరిధిలో రెండు జిల్లాల్లో కలిపి 2008 నుంచి ఇప్పటి వరకు అన్ని అనుమతులు ఉన్న లే అవుట్లు 476 మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఉడా పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో కూడా కొన్ని వెంచర్లు ఉన్నాయి. వీటితోపాటు అనధికారికంగా సుమారు 100 వెంచర్లు ఉన్నాయని ఉడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనధికార వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి నష్టపోవద్దని ఉడా అధికారులు ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని అనుమతులు ఉన్న 476 లే అవుట్ల వివరాలతో ఉడా కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అవసరమైతే అనధికార లేఅవుట్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు.