గ్రేటర్‌లో ఇక ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు
* జూన్ 1 నుంచి అమలు
* లేఔట్ అనుమతులు కూడా..
* 'టౌన్‌ప్లానింగ్’లో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే...
* అవకతవకలకు అడ్డుకట్ట పడే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. వచ్చేనెల (జూన్) ఒకటో తేదీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్ అనుమతుల దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు.
ఆన్‌లైన్ ద్వారానే అనుమతుల్ని జారీ చేయనున్నారు. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఈ దరఖాస్తులను సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తు అందజేశాక సైతం అనుమతుల కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్‌పెట్టేందుకు, పారదర్శక సేవల కోసం ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆటో డీసీఆర్ సాఫ్ట్‌వేర్ వినియోగంతో వచ్చే ఒకటో తేదీనుంచి ఆన్‌లైన్ ద్వారా ఈ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ విధానంలో మొదట ఆటో డీసీఆర్ ద్వారా ఆటోక్యాడ్‌లో ప్లాన్‌ను రూపొందించి, సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తుల్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఏవైనా లోటుపాట్లుంటే ప్రాథమిక దశలో ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. తద్వారా ఉద్యోగులకు సమయం కలిసి రావడమే కాక, నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం ఉంటుంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది.
ఆన్‌లైన్ ద్వారా అనుమతులు జారీకి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పుణేకు చెందిన సాఫ్టెక్ సంస్థ రూపొందించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజలు ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సహకారం పొందవచ్చు. ఇందుకుగాను వారికి ఈనెల 6వ తేదీన భవననిర్మాణ, లే ఔట్‌ల అనుమతుల జారీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీలో పేర్లు నమోదు చేసుకున్న లెసైన్సుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు.
సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ అవ గాహన కార్యక్రమం ఉంటుందని కమిషనర్ తెలిపారు. సులభతరమైన పరిపాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆన్‌లైన్ అప్రూవల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన వందరోజుల ప్రణాళికలోనూ ఈ కార్యక్రమం ఉంది. దీంతోపాటు జీహెచ్‌ఎంసీలో ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా ఈ- ఆఫీస్ ప్లస్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
దాదాపు ఏడాదిగా ఈ- ఆఫీస్ అమల్లో ఉన్నప్పటికీ, అది కేవలం అధికారులకు మాత్రమే పరిమితమైంది. ఈ-ఆఫీస్ ప్లస్‌తో ప్రజలు కూడా తమ ఫైలు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉంది. విశ్వనగరంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌కు సైతం కొత్త హంగులద్దారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో తాజాగా ‘ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్‌సిటీ’ అనే నినాదం కొత్తగా దర్శనమిస్తోంది. వెబ్‌సైట్‌లో గతంలో లేని పింక్ కలర్‌ను చేర్చారు.
ప్రయోజనాలెన్నో..
⇒ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించడం వల్ల దరఖాస్తు ఏ రోజు, ఏ సమయంలో సమర్పించింది స్పష్టంగా తెలుస్తుంది.
⇒ దరఖాస్తుతోపాటు జతపరచాల్సిన పత్రాలు జత చేయలేదనేందుకు, ఎవరైనా మాయం చేసేందుకు ఆస్కారం ఉండదు.
⇒ భవనం విస్తీర్ణానికి అనుగుణంగా సెట్‌బ్యాక్‌లు తదితరమైనవి ప్లాన్‌లో సరిగ్గా ఉన్నదీ లేనిదీ సాఫ్ట్‌వేరే గ్రహిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా లేనివాటిని తిరస్కరిస్తుంది. తద్వారా అధికారులకు పనిభారం తగ్గుతుంది. సమయం కలసి వస్తుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది.
⇒ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ లేదని కొర్రీలు వేస్తూ , ప్రజలను పదేపదే తిప్పేందుకు అవకాశం ఉండదు.
⇒ దరఖాస్తు ఎప్పుడు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వీలు.
⇒ దరఖాస్తు పరిశీలన పూర్తయి, అనుమతి జారీ అయితే
⇒ ఆ విషయం సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. ఈమెయిల్ ద్వారాను తెలుస్తుంది. ఎక్కడైనా ఫైలు ఎక్కువ రోజులు ఉంటే, ఆ విషయం పైఅధికారులకు తెలుస్తుంది. తద్వారా జాప్యం తగ్గుతుంది.
⇒ 30 రోజుల నిర్ణీత వ్యవధిలో అనుమతుల జారీకి అవకాశం.
⇒ నిర్లక్ష్యం కనబరుస్తూ, జాప్యం చేసే అధికారులకు పెనాల్టీలు వేసేందుకు వీలు.
⇒ 30 రోజుల్లోగా ఫైలు పరిష్కారమో, తిరస్కారమో తెలుస్తుంది.
ఆన్‌లైన్ లుక్... అక్రమాలకు చెక్!
Published Wed, May 4 2016 3:08 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
Advertisement