Building Construction Permissions
-
భవన నిర్మాణ అనుమతులు చిటికెలో..
సాక్షి, హైదరాబాద్: భవనాలు, లేఔట్ల అనుమతుల్లో విప్లవాత్మక సంస్క రణలు ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్–బీపాస్) సత్ఫలితాలి స్తోంది. అత్యంత పారదర్శకంగా, తక్షణ అనుమతులు/ నిర్దేశిత గడువు లోగా అనుమతుల కోసం గత సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్– బీపాస్ చట్టం తీసుకొచ్చింది. నవంబర్ నుంచి టీఎస్–బీపాస్ పోర్టల్ (https://tsbpass.telangana.gov.in) ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. 85 శాతానికి పైగా దరఖాస్తులకు ఈ విధానం ద్వారా నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు లభించాయి. ఇప్పటివరకు మొత్తం 8,498 దరఖాస్తులు రాగా, అందులో 4,903 (58 శాతం) దరఖాస్తుల పరి శీలన పూర్తయింది. ఫీజుల రూపంలో రూ.44.08 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల్లో లోపాలు, ఫీజు బకాయిల కారణాలతో 354 దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పరిశీలన దశలో 3,241 (38 శాతం) దరఖాస్తులుండగా, వీటిలో 1,956 దరఖాస్తుల గడువు ఇంకా ముగియలేదు. మిగిలిన 1,285 (15 శాతం) దరఖాస్తుల గడువు ముగిసిపోయింది. సింగిల్ విండో కేటగిరీలో పరిశీలనలో ఉన్న 54 దరఖాస్తుల్లో రెండు దరఖాస్తుల గడువు తీరింది. తక్షణ అనుమతుల కేటగిరీలో 2,457 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా, 1,000 దరఖాస్తుల గడువు ముగిసింది. తక్షణ రిజిస్ట్రేషన్ కేటగిరీలో 730 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా, 283 దరఖాస్తుల గడువు మీరింది. గణనీయంగా పెరిగిన దరఖాస్తులు.. టీఎస్–బీపాస్ విధానంపై దరఖాస్తుదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నవంబర్‌లో 1,131 దరఖాస్తులు రాగా, డిసెంబర్లో 1,978కు, జనవరిలో 3,671కు పెరిగాయి. అత్యంత పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తుండటం, లంచాల కోసం వేధింపులు తగ్గడంతో అనుమతులు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టే వారి సంఖ్య పెరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 70 శాతం ‘ఇన్స్టంట్’ టీఎస్–బీపాస్ దరఖాస్తులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. ఈ విధానం అమల్లోకి రావడంతో 75 చదరపు గజాల స్థలంలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించనున్న ఇళ్లకు బిల్డింగ్ ప్లాన్ అనుమతి అవసరం లేదు. ఆస్తి పన్నులు మదించేందుకు రూ.1 చెల్లించి టీఎస్–బీపాస్ పోర్టల్‌లో ‘తక్షణ రిజిస్ట్రేషన్’చేసుకుంటే సరిపోతుంది. 76 చదరపు గజాల నుంచి 500 చదరపు మీటర్ల స్థలంలో 10 మీటర్ల లోపు ఎత్తులో నిర్మించనున్న నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో ‘తక్షణ అనుమతులు’ఇవ్వనున్నారు. 500 చదరపు మీటర్లకు మించిన స్థలాల్లో, 10 మీటర్లకుపైగా ఎత్తులో నిర్మించనున్న నివాస, నివాసేతర భవనాలకు ‘సింగిల్ విండో’విధానంలో 21 రోజుల గడువులోగా అనుమతులు జారీ కావాలి. లేదంటే అనుమతి లభించినట్లేనని భావించి నిర్మాణం ప్రారంభించొచ్చు. అయితే రూ.1 చెల్లించి తక్షణ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అధిక దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించింది. దీనికి విరుద్ధంగా భవన నిర్మాణ ఫీజులు పూర్తిగా చెల్లించి ‘తక్షణ అనుమతుల’కోసం వచ్చిన దరఖాస్తులే అధికంగా ఉండటం టీఎస్–బీపాస్‌కు లభిస్తున్న విశేష స్పందనను తెలియజేస్తోంది. టాప్‌లో జీహెచ్ఎంసీ టీఎస్–బీపాస్ దరఖాస్తుల పరిశీలనలో జీహెచ్ఎంసీ ముందంజలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో జీహెచ్ఎంసీ 69 శాతం, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ (డీటీసీపీ) 60 శాతం, హెచ్ఎండీఏ 53 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. వివిధ కేటగిరీల దరఖాస్తుల పరిశీలనలో ఆయా శాఖలు/విభాగాలు సాధించిన పురోగతిని ఈ కింది పట్టికలో చూడవచ్చు. అత్యధిక దరఖాస్తులు ఇక్కడి నుంచే.. అత్యధిక సంఖ్యలో టీఎస్–బీపాస్ దరఖాస్తులొచ్చిన టాప్–5 జిల్లాలుగా మేడ్చల్(1803), రంగారెడ్డి(1332), మహబూబ్‌నగర్(582), సంగారెడ్డి(497), కామారెడ్డి(434) నిలిచాయి. జీహెచ్ఎంసీ, మహబూబ్‌నగర్, బడంగ్‌పేట, దుండిగల్, కామారెడ్డి దరఖాస్తుల సంఖ్యలో టాప్–5 పురపాలికలుగా ఉన్నాయి. ఎల్టీపీ రూ.9 వేలు తీసుకున్నడు: వెంకటనర్సయ్య, మహబూబ్‌నగర్ 150 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా, 15 రోజుల్లోగా అనుమతి ఇచ్చారు. ఆన్లైన్లో నిర్దేశించిన మేరకు రూ.63 వేల ఫీజు చెల్లించాం. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి లైసెన్డ్ టెక్నికల్ పర్సన్(ఎల్టీపీ) రూ.9 వేలు అడిగితే ఇచ్చేశాం. అధికారులెవరూ లంచాలు అడగలేదు. 21 రోజులు ఆగమన్నారు: అడప కృష్ణ, మధురానగర్ కాలనీ, ఖమ్మం 113 చదరపు గజాల స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణం కోసం జనవరి 1న దరఖాస్తు చేసుకుని, అప్పుడే నిర్దేశించిన మేరకు ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్ ఫీజుల కింద రూ.56 వేలు చెల్లించాను. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ప్రాథమిక అనుమతులు ఇచ్చారు. అయితే వెంటనే పనులు ప్రారంభించొద్దని, 21 రోజులు ఆగాలని చెప్పారు. 21 రోజుల్లోగా తుది అనుమతుల సర్టిఫికెట్ ఇచ్చి మరో రూ.15 వేలు ఫీజు చెల్లించాలని అడిగి తీసుకున్నారు. తక్షణ అనుమతుల విషయంలో క్షేత్రస్థాయి అధికారులకు సరైన అవగాహన లేదు. -
నిర్మాణ పనులకు అనుమతి: చీఫ్ సెక్రటరి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన తాజా మార్గదార్శకాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లోని నిర్మాణ పనులకు అనుమతిని ఇస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. బిల్డర్స్ అసోయేషన్లతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు డెవలపర్స్‌కు అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. (ఈ నగరాల్లో జోన్లను బట్టి సడలింపులు: కేంద్రం) ఇక వలస కూలీలకు కైన్సిలింగ్ నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు. వలస కూలీలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ... వైద్యపరమైన సౌకర్యాలు కల్పించి వారికి ప్రోత్సహకం అందించాలని సూచించారు. నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకువచ్చే వెసులుబాటును కల్పిస్తామని చెప్పారు. బిల్డర్లకు నిర్మాణపరమైన వస్తు సామాగ్రిని తీసుకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు కమిషనర్లకు అదేశం ఇచ్చిన్నట్లు ఆయన చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయనతో పాటు తెలంగాణ డీజీపీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ముగ్గురు కమిషనర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
21 డేస్..ఫిక్స్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని శేరిలింగంపల్లి జోన్ పరిధిలో నివసించే ప్రవీణ్‌రెడ్డి.. తన భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి ఇతడికి 21 రోజుల్లో అనుమతులు రావాలి. కానీ నలభై రోజులు దాటినా అప్రూవల్ మాత్రం రాలేదు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు నగర వ్యాప్తంగా వేలల్లోనే ఉన్నారు. భవన నిర్మాణానికి 21 రోజుల్లోనే అనుమతులు జారీ చేస్తున్నట్లు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ మేరకు జీఓ కూడా జారీ చేశారు. కానీ వాస్తవంగా గ్రేటర్లో అమలు కావడం లేదు. నిర్ణీత వ్యవధి (21 రోజులు)లోగా అనుమతి రాకుంటే.. అనుమతించినట్లే భావించవచ్చుననే (డీమ్డ్ టు అప్రూవ్డ్) నిబంధన ఉన్నా అదీ అమలు కావడం లేదు. గ్రేటర్లో నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం 21 రోజుల్లో అనుమతి రానివారి దరఖాస్తుకు సంబంధించి అన్ని పత్రాలు, ప్లాన్ సక్రమంగా ఉంటే అనుమతించినట్టు (డీమ్డ్ టు అప్రూవ్డ్)గా పరిగణించే కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తగిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందస్తున్నారు. వాస్తవానికి భవన నిర్మాణ దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీ, తదితరమైనవి ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నా.. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 21 రోజుల్లో అనుమతులు జారీ కావడం లేదు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోను ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 21 రోజుల్లోగా అనుమతి రానివారు ‘డీమ్డ్ టు అప్రూవ్డ్’ అవకాశాన్ని వినియోగించుకునేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చాక.. 21 రోజుల్లోగా అనుమతి జారీ కాని పక్షంలో సిస్టమ్ నుంచే ‘ఆటోమేటిక్’గా మెసేజ్ వెళుతుంది. ‘నిర్ణీత వ్యవధిలోగా మీ దరఖాస్తు పరిష్కారం కాలేదు. డీమ్డ్ టు అప్రూవ్డ్ అవకాశాన్ని వినియోగించుకోదలచుకుంటున్నారా’.. అనే సందేశంతో మెసేజ్ వెళ్తుంది. అందుకు వారు ఆన్లైన్లో ‘అవును’ అని సమాధానమిస్తే నిర్ణీత ఫారం ప్రత్యక్షమవుతుంది. దాంట్లో తాను నిబంధనల మేరకు దరఖాస్తు చేసినట్లు, ప్లాన్, లాండ్‌యూజ్ తదితర విషయాలన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ప్రస్తుతం డీపీఎంఎస్ విధానంలో భాగంగా ఆన్లైన్లోనే దరఖాస్తులను స్వీకరిస్తుండగా, ప్లాన్‌లో ఏవైనా లోపాలుంటే తిరిగి సరిచేయాల్సి రావడంతో జాప్యం జరుగుతోంది. దాన్ని నివారించేందుకు కూడా ‘ప్రీ ఆటో డీసీఆర్’ ద్వారా ప్లాన్‌ను సబ్మిట్ చేయకముందే.. సిస్టమ్ నుంచే ప్లాన్ సక్రమంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్ అప్లికేషన్‌నూ అందుబాటులోకి తేనున్నారు. దాంతో, ప్లాన్ సరిగ్గా ఉన్నదీ, లేనిదీ దరఖాస్తు చేసేముందే తెలుసుకోవచ్చు. గతంలోనూ ‘డీమ్డ్ టు అప్రూవ్డ్’ నిబంధన ఉన్నప్పటికీ, మాన్యువల్ పద్ధతిలో అనుమతులిచ్చే విధానం వల్ల అధికారులు ఆడింది ఆటగా సాగేది. డీమ్డ్ టు అప్రూవ్డ్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు నోటీసు ఇచ్చిన దరఖాస్తుదారుకు ప్లాన్ సరిగ్గా లేదనో, మరేదైనా పత్రం సమర్పించలేదనో తిరకాసు పెట్టేవారు. దాంతో ఆ నిబంధన అమలైన దాఖాలాల్లేవు. ప్రస్తుతం ప్లాన్‌లో లోపాలను కంప్యూటరే ముందుగా పసిగడుతుంది కనుక లోపాలున్నట్లు చెప్పడం కుదరదు. నిర్ణీత ఫారాన్ని భర్తీ చేశాక, అధికారులు రెండు మూడు రోజుల్లోగా పూర్తి ఫీజు చెల్లించాల్సిందిగా సమాచారం పంపిస్తారు. ఈ లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేస్తారు. ఫీజు చెల్లింపు జరగ్గానే అనుమతి జారీ అవుతుంది. దరఖాస్తు జాప్యానికి కారకుడైన అధికారికి రోజుకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించి జీతం నుంచి వసూలు చేస్తారు. సదరు దరఖాస్తు వెంటనే మరో అధికారికి బదిలీ అవుతుందని, క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్‌ఎస్.దేవేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.ఈ విధానం కేవలం జీహెచ్ఎంసీకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు తగిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నట్టు వివరించారు. -
నిర్మాణ అనుమతుల్లోనే వ్యర్థాల చార్జీలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్ల పక్కన, నాలాల్లో వేస్తున్న నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల(డెబ్రిస్) సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ త్వరలోనే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. దీనిలో భాగంగా పాత భవనాలు కూల్చివేసి.. వాటిస్థానంలో కొత్తవి నిర్మించాలనుకునేవారు భవన నిర్మాణ అనుమతి ఫీజులతోపాటు డెబ్రిస్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకుగాను కూల్చివేసే భవనం బిల్టప్ ఏరియాలో చదరపు అడుగుకు రూ.12 వంతున లెవీగా భవన ని ర్మాణ అనుమతుల ఫీజులతోపాటే చెల్లించాలి. దీన్ని జీహెచ్ఎంసీ ‘డిమాలిషన్ అండ్ రిమూవల్ ఎక్స్పెన్సెస్’పద్దు కింద జమ చేస్తారు. భవనం కూల్చివేతలో వెలువడే డెబ్రిస్‌ను జీహెచ్ంఎసీ సీ అండ్ డీ రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తుంది. ఇది సెల్లార్లు లేని పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించే వాటికి వర్తిస్తుంది. సెల్లార్లు, సబ్ సెల్లార్లకు సంబంధించి పాత భవనాలకు కానీ, కొత్తగా నిర్మించబోయే వాటికి కానీ అనుమతి తీసుకున్న వారు సెల్లార్ తవ్వకం పని ఎప్పుడు ప్రారంభించేది జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేయాలి. సంబంధిత అధికారుల బృందం సెల్లార్ తవ్వక ప్రాంతాన్ని తనిఖీ చేస్తుంది. వీరు సెల్లార్ తవ్వకాల్లో వెలువడే డెబ్రిస్‌తో పాటు కొత్త నిర్మాణ వ్యర్థాల్లో ఎంతమేర రీసైక్లింగ్‌కు ఉపయోగపడుతుందో అంచనా వేసి, డెబ్రిస్ పరిమాణాన్ని నిర్ధారిస్తారు. నిర్మాణదారు దాన్ని జీహెచ్ఎంసీ నుంచి డెబ్రిస్ రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి పొందిన ‘హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ద్వారా కానీ, స్వయంగా కానీ తరలించవచ్చు. ఈ ఏజెన్సీ ద్వారా తరలిస్తే మెట్రిక్ టన్నుకు రూ.342 వంతున చెల్లించాలి. స్వయంగా తరలించాలనుకుంటే రూ.68.5 చెల్లిస్తే సరిపోతుంది. నిర్మాణదారు అండర్‌టేకింగ్ ఇచ్చి, వ్యర్థాలు తరలించాక చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి ఆమోదం పొందాక త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. మెట్రిక్ టన్నుకు రూ.256.. నగరంలో డెబ్రిస్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ డెబ్రిస్ రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాంకీకి చెందిన ‘హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు వచ్చే నవంబర్ నాటికి ప్లాంట్ పని ప్రారంభించాల్సి ఉంది. పని ప్రారంభమయ్యాకే సీ అండ్ డీ వ్యర్థాలను అక్కడకు తరలించాల్సి ఉన్నప్పటికీ, నగరంలో ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పేరుకుపోయిన డెబ్రిస్ సమస్య పరిష్కారానికి ప్రస్తుతం మెట్రిక్ టన్నుకు రూ.256.5 చార్జీతో డెబ్రిస్‌ను తరలించాల్సిందిగా జీహెచ్ఎంసీ కోరింది. ఆ మేరకు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల తరలింపును ఇప్పటికే ప్రారంభించారు. సీ అండ్ డీ వ్యర్థాలను తరలించాలనుకునే ఎవరైనా ప్రస్తుతం రూ.256.5 చెల్లిస్తే సరిపోతుంది. జీడిమెట్ల, ఫతుల్లాగూడలలో రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు పనులు ప్రారంభం కాగా, జీడిమెట్లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్లాంట్ సమీప ప్రాంతానికి డెబ్రిస్ తరలిస్తున్నారు. నగర ప్రజలు తమ వద్ద ఉన్న ఎలాంటి డెబ్రిస్నైనా ఈ చార్జీతో తరలించవచ్చని జీహెచ్ఎంసీ పేర్కొంది. సంబంధిత సమాచారాన్ని ‘మై జీహెచ్ఎంసీ’యాప్, కాల్‌సెంటర్ సేవల ద్వారా పొందవచ్చని తెలిపింది. ప్రైవేటు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి డెబ్రిస్ తరలించే ప్రైవేట్ వాహనాలు విధిగా రాంకీ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. వాటికి జీపీఎస్ తప్పనిసరి. తద్వారా సదరు వాహనాలు నిర్ణీత ప్రదేశానికి కాకుండా వేరే ప్రాంతంలో డెబ్రిస్ కుమ్మరిస్తే బల్దియా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. నగరంలో డెబ్రిస్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఈ చర్యలకు సిద్ధమైంది. -
బిల్డింగ్‌కు సింగిల్ విండో!
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతులను సత్వరంగా జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టనుంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో విధానంలో ఒకే చోట నుంచి జారీ చేసేందుకు ‘టీఎస్–ఐపాస్’పేరుతో అమలు చేస్తున్న రాష్ట్ర పారిశ్రామిక విధానం ఇప్పటికే దేశవిదేశాల్లో మన్ననలు అందుకుంది. ఇదే తరహాలో భవన నిర్మాణానికి అవసరమైన వివిధ రకాల అనుమతులు, నిరభ్యంతర పత్రాలను ఒకే చోట జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)ను ప్రవేశ పెట్టి రెండేళ్లుగా ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా నిర్ధిష్ట గడువులోగా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తోంది. అయితే, భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాల కోసం దరఖాస్తుదారులు ఆయా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. భారీ భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్ల నుంచి కొన్ని శాఖల అధికారులు పెద్ద మొత్తంలో మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. చెల్లించని పక్షంలో వివిధ సాకులతో అనుమతులకు నిరాకరిస్తున్నారు. అలాగే అగ్ని మాపక శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రాలు పొందడంలో దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లు, భారీ భవన సముదాయాలకు అవసరమైన ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయడానికి కొందరు అధికారులు రూ.లక్షకు పైగా మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలో భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో ద్వారా నిర్ణీత గడువులోగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారుల నుంచి జాప్యానికి సంబంధించి ఒక్కో రోజు లెక్కన జరిమానా విధించాలనే నిబంధనను ఈ విధానంలో పొందుపర్చనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేయనుంది. -
పర్మిషన్ @ జోన్!
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్లో భవన నిర్మాణ అనుమతులు ఇక సులభంగా జారీకానున్నాయి. వెయ్యి చదరపు మీటర్ల ప్లాట్ ఏరియా పరిమితితో స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల వరకు అన్ని రకాల అనుమతులను ఇకపై జోనల్ స్థాయిలోనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం 750 చదరపు మీటర్ల పరిమితితో స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల నివాస భవనాల వరకు మాత్రమే అనుమతులిస్తున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలను బలోపేతం చేసే పేరిట ఇకపై వాణిజ్య, తదితర భవనాలకు సైతం నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) అక్కడి నుంచే జారీ చేయనున్నారు. గతం లో జోనల్ కార్యాలయాల్లో స్టిల్ట్ ప్లస్ నాలుగంతస్తుల వరకు మాత్రం అధికారాలుండేవి. గత సం వత్సరం సెప్టెంబర్ నుంచి 750 చ.మీ.ల విస్తీర్ణం వరకు నివాస భవనాలకు స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తులకు అనుమతులిచ్చే అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు నివాస భవనాలతోపాటు వాణిజ్య, తదితర భవనాలకు వర్తింపచేయడమే కాక స్థల విస్తీర్ణాన్ని సైతం వెయ్యి చదరపు మీటర్ల వరకు పెంచారు. అంటే భారీ బహుళ అంతస్తులకు సంబంధించిన అనుమతులు మాత్రమే ఇక ప్రధాన కార్యాలయం నుంచి ఇస్తారు. అవినీతి అక్రమాలకు మరింత ఊతం..? జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో స్టిల్ట్ ప్లస్ మూడు అంతస్తుల వరకు అనుమతులిస్తున్నారు. ఆపైవి అంటే..స్టిల్ట్ ప్లస్ నాలుగంతస్తులు, ఐదంతస్తులవి జోనల్ కార్యాలయాల్లో ఇవ్వనున్నారు. సర్కిళ్లు, జోన్లలోని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటికే అవినీతిలో మునిగిపోయింది. ప్రతి ఫైలుకూ పైసలు లేనిదే పని జరగదనేది బహిరంగ రహస్యం. ఆన్లైన్ ద్వారానే భవన నిర్మాణఅనుమతుల జారీ..నిర్ణీత వ్యవధిలో అనుమతివ్వకుంటే సంబంధిత అధికారులపై చర్యలనేవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. తమ చేయి తడపనిదే ఏదో ఒక కొర్రీ వేసి జాప్యం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రధాన కార్యాలయంలోనూ అవినీతి లేదనలేకున్నా.. కమిషనర్, చీఫ్‌సిటీ ప్లానర్ వంటి ఉన్నతాధికారులు ఉంటారు కాబట్టి జోనల్, సర్కిళ్లతో పోలిస్తే తక్కువ. వెంటనే ఫిర్యాదు చేయడానికి ఉన్నతాధికారులుంటారు కనుక సంబంధిత అధికారులు సైతం దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తారు. సర్కిళ్లు, జోన్లలో మాత్రం టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఆడిందే ఆట అన్నట్లు సాగుతోంది. భవన నిర్మాణ అనుమతుల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల దాకా అదే తంతు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిక వాణిజ్య భవనాలతో సహ 1000 చ.మీ.ల వరకు స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల వరకు అక్కడే అధికారం అంటే జోన్లలోని అధికారులకు, సిబ్బందికి పండగే. ఆన్లైన్ ద్వారా అనుమతులిచ్చే బీపీఎంఎస్ (బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్మెంట్ స్కీమ్)ద్వారా అవినీతి జరగడం లేదని ఉన్నతాధికారులు భావించడం కేవలం వారి భ్రమేనని పలువురు నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ పద్ధతి అమల్లోకి తెచ్చినా ‘చదివింపులు’ లేనిదే పనులు జరగవని, లేనిపోని కొర్రీలు వేస్తూ తీవ్ర జాప్యం చేస్తారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బిల్డర్ ఒకరు చెప్పారు. తాము సైతం ఎలాగూ చెల్లించక తప్పదు కనుక త్వరితంగా పని కావాలనుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల భవనాల అనుమతుల అధికారాన్ని జోన్లకే బదలాయించడం వారి అవినీతిని మరింత పెంచిపోషించేందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారితోపాటు అన్నిరకాల భవనాలకూ స్థానికంగానే అనుమతులివ్వడం వల్ల కార్పొరేటర్లకు పైరవీల ఆదాయం కూడా మరింత పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. బలోపేతం ప్రకటనలకే..? జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలను ఐదు నుంచి ఆరుకు పెంచినందున, వాటిని బలోపేతం చేసేందుకు, ప్రధాన కార్యాలయంలో పనిఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలని పేర్కొంటున్నా..అంతిమంగా దీనిద్వారా అవినీతి కేంద్రీకృతం కానుందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనల్ని ఆమోదించారు. అమలుకు సంబంధించి త్వరలో ఉత్తర్వు జారీ చేయనున్నారు. రహదారుల విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికిచ్చే మినహాయింపులు వంటివి మాత్రం ఎన్ని అంతస్తులవైనా ప్రధాన కార్యాలయానికే పంపిస్తారు. -
ఆన్లైన్ లుక్... అక్రమాలకు చెక్!
గ్రేటర్లో ఇక ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు * జూన్ 1 నుంచి అమలు * లేఔట్ అనుమతులు కూడా.. * 'టౌన్‌ప్లానింగ్’లో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే... * అవకతవకలకు అడ్డుకట్ట పడే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. వచ్చేనెల (జూన్) ఒకటో తేదీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్ అనుమతుల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఆన్లైన్ ద్వారానే అనుమతుల్ని జారీ చేయనున్నారు. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఈ దరఖాస్తులను సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తు అందజేశాక సైతం అనుమతుల కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్‌పెట్టేందుకు, పారదర్శక సేవల కోసం ఆన్లైన్ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆటో డీసీఆర్ సాఫ్ట్వేర్ వినియోగంతో వచ్చే ఒకటో తేదీనుంచి ఆన్లైన్ ద్వారా ఈ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ విధానంలో మొదట ఆటో డీసీఆర్ ద్వారా ఆటోక్యాడ్‌లో ప్లాన్‌ను రూపొందించి, సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తుల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఏవైనా లోటుపాట్లుంటే ప్రాథమిక దశలో ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. తద్వారా ఉద్యోగులకు సమయం కలిసి రావడమే కాక, నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం ఉంటుంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీకి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పుణేకు చెందిన సాఫ్టెక్ సంస్థ రూపొందించింది. ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజలు ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సహకారం పొందవచ్చు. ఇందుకుగాను వారికి ఈనెల 6వ తేదీన భవననిర్మాణ, లే ఔట్ల అనుమతుల జారీకి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీలో పేర్లు నమోదు చేసుకున్న లెసైన్సుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ అవ గాహన కార్యక్రమం ఉంటుందని కమిషనర్ తెలిపారు. సులభతరమైన పరిపాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆన్లైన్ అప్రూవల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన వందరోజుల ప్రణాళికలోనూ ఈ కార్యక్రమం ఉంది. దీంతోపాటు జీహెచ్ఎంసీలో ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా ఈ- ఆఫీస్ ప్లస్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. దాదాపు ఏడాదిగా ఈ- ఆఫీస్ అమల్లో ఉన్నప్పటికీ, అది కేవలం అధికారులకు మాత్రమే పరిమితమైంది. ఈ-ఆఫీస్ ప్లస్‌తో ప్రజలు కూడా తమ ఫైలు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉంది. విశ్వనగరంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌కు సైతం కొత్త హంగులద్దారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో తాజాగా ‘ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్‌సిటీ’ అనే నినాదం కొత్తగా దర్శనమిస్తోంది. వెబ్సైట్లో గతంలో లేని పింక్ కలర్‌ను చేర్చారు. ప్రయోజనాలెన్నో.. ⇒ ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించడం వల్ల దరఖాస్తు ఏ రోజు, ఏ సమయంలో సమర్పించింది స్పష్టంగా తెలుస్తుంది. ⇒ దరఖాస్తుతోపాటు జతపరచాల్సిన పత్రాలు జత చేయలేదనేందుకు, ఎవరైనా మాయం చేసేందుకు ఆస్కారం ఉండదు. ⇒ భవనం విస్తీర్ణానికి అనుగుణంగా సెట్బ్యాక్లు తదితరమైనవి ప్లాన్‌లో సరిగ్గా ఉన్నదీ లేనిదీ సాఫ్ట్‌వేరే గ్రహిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా లేనివాటిని తిరస్కరిస్తుంది. తద్వారా అధికారులకు పనిభారం తగ్గుతుంది. సమయం కలసి వస్తుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. ⇒ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ లేదని కొర్రీలు వేస్తూ , ప్రజలను పదేపదే తిప్పేందుకు అవకాశం ఉండదు. ⇒ దరఖాస్తు ఎప్పుడు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వీలు. ⇒ దరఖాస్తు పరిశీలన పూర్తయి, అనుమతి జారీ అయితే ⇒ ఆ విషయం సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. ఈమెయిల్ ద్వారాను తెలుస్తుంది. ఎక్కడైనా ఫైలు ఎక్కువ రోజులు ఉంటే, ఆ విషయం పైఅధికారులకు తెలుస్తుంది. తద్వారా జాప్యం తగ్గుతుంది. ⇒ 30 రోజుల నిర్ణీత వ్యవధిలో అనుమతుల జారీకి అవకాశం. ⇒ నిర్లక్ష్యం కనబరుస్తూ, జాప్యం చేసే అధికారులకు పెనాల్టీలు వేసేందుకు వీలు. ⇒ 30 రోజుల్లోగా ఫైలు పరిష్కారమో, తిరస్కారమో తెలుస్తుంది.