సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లో భవన నిర్మాణ అనుమతులు ఇక సులభంగా జారీకానున్నాయి. వెయ్యి చదరపు మీటర్ల ప్లాట్ ఏరియా పరిమితితో స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల వరకు అన్ని రకాల అనుమతులను ఇకపై జోనల్ స్థాయిలోనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం 750 చదరపు మీటర్ల పరిమితితో స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల నివాస భవనాల వరకు మాత్రమే అనుమతులిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయాలను బలోపేతం చేసే పేరిట ఇకపై వాణిజ్య, తదితర భవనాలకు సైతం నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) అక్కడి నుంచే జారీ చేయనున్నారు. గతం లో జోనల్ కార్యాలయాల్లో స్టిల్ట్ ప్లస్ నాలుగంతస్తుల వరకు మాత్రం అధికారాలుండేవి. గత సం వత్సరం సెప్టెంబర్ నుంచి 750 చ.మీ.ల విస్తీర్ణం వరకు నివాస భవనాలకు స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తులకు అనుమతులిచ్చే అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు నివాస భవనాలతోపాటు వాణిజ్య, తదితర భవనాలకు వర్తింపచేయడమే కాక స్థల విస్తీర్ణాన్ని సైతం వెయ్యి చదరపు మీటర్ల వరకు పెంచారు. అంటే భారీ బహుళ అంతస్తులకు సంబంధించిన అనుమతులు మాత్రమే ఇక ప్రధాన కార్యాలయం నుంచి ఇస్తారు.
అవినీతి అక్రమాలకు మరింత ఊతం..?
జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో స్టిల్ట్ ప్లస్ మూడు అంతస్తుల వరకు అనుమతులిస్తున్నారు. ఆపైవి అంటే..స్టిల్ట్ ప్లస్ నాలుగంతస్తులు, ఐదంతస్తులవి జోనల్ కార్యాలయాల్లో ఇవ్వనున్నారు. సర్కిళ్లు, జోన్లలోని జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటికే అవినీతిలో మునిగిపోయింది. ప్రతి ఫైలుకూ పైసలు లేనిదే పని జరగదనేది బహిరంగ రహస్యం. ఆన్‌లైన్ ద్వారానే భవన నిర్మాణఅనుమతుల జారీ..నిర్ణీత వ్యవధిలో అనుమతివ్వకుంటే సంబంధిత అధికారులపై చర్యలనేవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. తమ చేయి తడపనిదే ఏదో ఒక కొర్రీ వేసి జాప్యం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రధాన కార్యాలయంలోనూ అవినీతి లేదనలేకున్నా.. కమిషనర్, చీఫ్‌సిటీ ప్లానర్ వంటి ఉన్నతాధికారులు ఉంటారు కాబట్టి జోనల్, సర్కిళ్లతో పోలిస్తే తక్కువ. వెంటనే ఫిర్యాదు చేయడానికి ఉన్నతాధికారులుంటారు కనుక సంబంధిత అధికారులు సైతం దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తారు.
సర్కిళ్లు, జోన్లలో మాత్రం టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఆడిందే ఆట అన్నట్లు సాగుతోంది. భవన నిర్మాణ అనుమతుల నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల దాకా అదే తంతు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిక వాణిజ్య భవనాలతో సహ 1000 చ.మీ.ల వరకు స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల వరకు అక్కడే అధికారం అంటే జోన్లలోని అధికారులకు, సిబ్బందికి పండగే. ఆన్‌లైన్ ద్వారా అనుమతులిచ్చే బీపీఎంఎస్ (బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ స్కీమ్)ద్వారా అవినీతి జరగడం లేదని ఉన్నతాధికారులు భావించడం కేవలం వారి భ్రమేనని పలువురు నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ పద్ధతి అమల్లోకి తెచ్చినా ‘చదివింపులు’ లేనిదే పనులు జరగవని, లేనిపోని కొర్రీలు వేస్తూ తీవ్ర జాప్యం చేస్తారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బిల్డర్ ఒకరు చెప్పారు. తాము సైతం ఎలాగూ చెల్లించక తప్పదు కనుక త్వరితంగా పని కావాలనుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల భవనాల అనుమతుల అధికారాన్ని జోన్లకే బదలాయించడం వారి అవినీతిని మరింత పెంచిపోషించేందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారితోపాటు అన్నిరకాల భవనాలకూ స్థానికంగానే అనుమతులివ్వడం వల్ల కార్పొరేటర్లకు పైరవీల ఆదాయం కూడా మరింత పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి.
బలోపేతం ప్రకటనలకే..?
జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయాలను ఐదు నుంచి ఆరుకు పెంచినందున, వాటిని బలోపేతం చేసేందుకు, ప్రధాన కార్యాలయంలో పనిఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలని పేర్కొంటున్నా..అంతిమంగా దీనిద్వారా అవినీతి కేంద్రీకృతం కానుందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనల్ని ఆమోదించారు. అమలుకు సంబంధించి త్వరలో ఉత్తర్వు జారీ చేయనున్నారు. రహదారుల విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికిచ్చే మినహాయింపులు వంటివి మాత్రం ఎన్ని అంతస్తులవైనా ప్రధాన కార్యాలయానికే పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment