ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతులను సత్వరంగా జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టనుంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో విధానంలో ఒకే చోట నుంచి జారీ చేసేందుకు ‘టీఎస్–ఐపాస్’పేరుతో అమలు చేస్తున్న రాష్ట్ర పారిశ్రామిక విధానం ఇప్పటికే దేశవిదేశాల్లో మన్ననలు అందుకుంది. ఇదే తరహాలో భవన నిర్మాణానికి అవసరమైన వివిధ రకాల అనుమతులు, నిరభ్యంతర పత్రాలను ఒకే చోట జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (డీపీఎంఎస్)ను ప్రవేశ పెట్టి రెండేళ్లుగా ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా నిర్ధిష్ట గడువులోగా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తోంది.
అయితే, భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాల కోసం దరఖాస్తుదారులు ఆయా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. భారీ భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్ల నుంచి కొన్ని శాఖల అధికారులు పెద్ద మొత్తంలో మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. చెల్లించని పక్షంలో వివిధ సాకులతో అనుమతులకు నిరాకరిస్తున్నారు. అలాగే అగ్ని మాపక శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రాలు పొందడంలో దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు, భారీ భవన సముదాయాలకు అవసరమైన ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయడానికి కొందరు అధికారులు రూ.లక్షకు పైగా మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలో భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో ద్వారా నిర్ణీత గడువులోగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారుల నుంచి జాప్యానికి సంబంధించి ఒక్కో రోజు లెక్కన జరిమానా విధించాలనే నిబంధనను ఈ విధానంలో పొందుపర్చనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment