single window process
-
నిర్మాణాల కోసం.. ఇక టీఎస్–బీపాస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఏకగవాక్ష (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు జారీ చేసేందుకు ఐదేళ్ల కిందట చేపట్టిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్–ఐపాస్’సత్ఫలితాలను సాధించిపెట్టింది. ఈ తరహాలోనే భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ త్వరలో ‘టీఎస్–బీపాస్’పేరుతో కొత్త పాలసీని తీసుకురాబోతోంది. పురపాలనలో సంస్కరణల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన కొత్త మునిసిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ‘టీఎస్–బీపాస్’విధానానికి రూపకల్పన చేసింది. ఖాళీ స్థలాల్లో లే–అవుట్లు, భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు, డెవలపర్లతో పాటు సాధారణ పౌరులు సైతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పలు రకాల అనుమతులు పొందాల్సిన వస్తోంది. వాటి జారీలో అవినీతి, జాప్యం కారణంగా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ‘టీఎస్–బీపాస్’అనే కొత్త విధానానికి టౌన్,కంట్రీప్లానింగ్ విభాగం అభివృద్ధిపరిచింది. భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులన్నింటినీ ఒకే చోట (సింగిల్ విండో) నుంచి జారీ చేయనున్నారు. భూయజమాని/డెవలపర్ కేవలం స్వీయధ్రువీకరణ పత్రం ఇస్తే టీఎస్–ఐపాస్ తరహాలో 21 రోజుల నిర్దేశిత గడువులోగా సత్వర అనుమతులు జారీ చేయనున్నారు. సాధారణ పౌరులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు ఈ కొత్త విధానంతో ప్రయోజనం పొందనున్నారు. త్వరలో ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ►భవనాలు, లేఅవుట్ల అభివృద్ధి కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టీఎస్–బీపాస్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అనుమతులు పొందిన తర్వాత నిర్దేశిత ప్లాన్ప్రకారమే నిర్మాణాలు జరిపారా? లేక ఉల్లంఘనలున్నాయా? అనుమతులు లేకుండా జరిపారా? అన్న అంశాలను ఈ కమిటీ తనిఖీ చేసి చర్యలు తీసుకోనుంది. ►75 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుదారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ►500 చదరపు మీటర్లలోపు ప్లాట్లలో 10 మీటర్లలోపు ఎత్తు వరకు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ అనుమతులు జారీ చేయనున్నారు. ►నివాసేతర భవనాలు, 10 మీటర్లకు మించిన ఎత్తైన భవనాల నిర్మాణానికి 21 రోజుల నిర్దేశిత గడువులోగా సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతుల జారీ. ►200 చదరపు మీటర్ల వరకు ప్లాట్లలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ►అనుమతుల అనంతరం జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను తనిఖీ చేయనుంది. ►దరఖాస్తుదారులు తప్పుడు సమాచారమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ►అనుమతులను ఉల్లంఘించి నిర్మిస్తే.. ఎలాంటి నోటీసులు లేకుండా తొలగిస్తారు. ►స్వీయధ్రువీకరణ ఆధారంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ. -
గ్రేటర్లో భవన నిర్మాణ పర్మిషన్ ఇక ఈజీ
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే డీపీఎంఎస్ విధానంలో ఆన్లైన్ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీ చేస్తున్న జీహెచ్ఎంసీ...నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటున్నవారు ఇతర శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరమైతే పలు కార్యాలయాల చుట్టూ తిరిగి వాటిని పొందుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖల నుంచి వీటిని పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇకపై ఈ శ్రమ లేకుండా ఆన్లైన్లో కామన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇతర విభాగాల నుంచి క్లియరెన్స్ అవసరమైన పక్షంలో నో అబ్జెక్షన్ కోసం జీహెచ్ఎంసీయే ఆయా విభాగాలకు ఆన్లైన్లో పంపిస్తుంది. ఈమేరకు తగిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఇక ఈ కామన్ అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత ఇళ్లు కట్టుకునే వారి నుంచి బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు నిర్మించే వారి వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. పరిశ్రమలకు టీఎస్ఐపాస్ తరహాలో జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణాలకు ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నోఅబ్జెక్షన్ అవసరమైన రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రిక్, ఎయిర్పోర్ట్, ట్రాఫిక్,అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మాన్యుమెంట్ అథారిటీలతో జీహెచ్ఎంసీ నెట్వర్క్ అనుసంధానం చేసుకుంది. దరఖాస్తు రాగానే పై వాటిల్లో ఏ శాఖనుంచైనా నో అబ్జెక్షన్ అవసరమైతే ఆన్‌లైన్‌ద్వారా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెళ్తుంది. ఎలాంటి అభ్యంతరం లేనట్లయితే ఓకే చేస్తారు. అభ్యంతరాలుంటే, ఆ విషయాన్నీ తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో భవననిర్మాణాలకు దరఖాస్తుచేసుకునే వారికి ఎంతో సమయం, వ్యయం తగ్గుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటికే పలు సంస్కరణలు అమల్లోకి తేవడం తెలిసిందే. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు, బిల్డర్లు, ఫైర్ సర్వీస్, రెవెన్యూ తదితర అధికారులతో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఈ సింగిల్‌విండో అనుమతుల విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో దరఖాస్తుల పరిశీలన త్వరితంగా జరుగుతున్నప్పటికీ, ఇతర శాఖల నుంచి ఎన్ఓసీలు రావడంలో జాప్యం జరిగేదని, ఇక ఈసమస్య ఉండదన్నారు. డీపీఎంఎస్‌లో ఈ కామన్ అప్లికేషన్ విధానాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. ఒక్కరోజులోనే అనుమతి.. భవననిర్మాణ అనుమతులు త్వరితంగా జారీ చేసేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు దానకిశోర్ తెలిపారు. ముఖ్యంగా 500 గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు వచ్చే దరఖాస్తులు నిబంధనల ప్రకారం అన్నీ సవ్యంగా ఉంటే ఒకే రోజులో అనుమతి జారీ చేసే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. దీంతోపాటు 200 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు సెల్ఫ్ అప్రూవల్ ప్రతిపాదన కూడా ఉందన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్‌సిటీప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, ఫైర్సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ పాపయ్య, డా.సుబ్రహ్మణ్యం (ఆస్కి) పాల్గొన్నారు. అందుబాటులోకి నెట్వర్క్ రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రికల్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ మాన్యుమెంట్ అథారిటీ శాఖల నుంచి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. వీటిల్లో నివాస గృహాలకు ముఖ్యంగా యూఎల్సీ, ప్రభుత్వభూమి వంటి సమాచారం కోసం రెవెన్యూతోపాటు ఇరిగేషన్ విభాగాల నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)అవసరం అయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా శాఖల నుంచి పెద్దగా ఎన్ఓసీ అవసరం ఉండదని, వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకు మాత్రం మిగతా శాఖలనుంచీ ఎన్ఓసీ అవసరమవుతుందన్నారు. -
బిల్డింగ్‌కు సింగిల్ విండో!
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతులను సత్వరంగా జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టనుంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో విధానంలో ఒకే చోట నుంచి జారీ చేసేందుకు ‘టీఎస్–ఐపాస్’పేరుతో అమలు చేస్తున్న రాష్ట్ర పారిశ్రామిక విధానం ఇప్పటికే దేశవిదేశాల్లో మన్ననలు అందుకుంది. ఇదే తరహాలో భవన నిర్మాణానికి అవసరమైన వివిధ రకాల అనుమతులు, నిరభ్యంతర పత్రాలను ఒకే చోట జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)ను ప్రవేశ పెట్టి రెండేళ్లుగా ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా నిర్ధిష్ట గడువులోగా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తోంది. అయితే, భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాల కోసం దరఖాస్తుదారులు ఆయా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. భారీ భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్ల నుంచి కొన్ని శాఖల అధికారులు పెద్ద మొత్తంలో మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. చెల్లించని పక్షంలో వివిధ సాకులతో అనుమతులకు నిరాకరిస్తున్నారు. అలాగే అగ్ని మాపక శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రాలు పొందడంలో దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లు, భారీ భవన సముదాయాలకు అవసరమైన ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయడానికి కొందరు అధికారులు రూ.లక్షకు పైగా మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలో భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో ద్వారా నిర్ణీత గడువులోగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారుల నుంచి జాప్యానికి సంబంధించి ఒక్కో రోజు లెక్కన జరిమానా విధించాలనే నిబంధనను ఈ విధానంలో పొందుపర్చనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేయనుంది. -
‘సౌర’ విధానం ఔరా!
సరళీకృత విధానాలతో రాష్ట్ర సౌర విద్యుత్ పాలసీ సింగిల్ విండో ద్వారా ప్రాజెక్టుల అనుమతులు స్టాంపు డ్యూటీ, వ్యాట్ తిరిగి చెల్లింపు 21 రోజుల్లో రూఫ్ టాప్ అనుమతులు హైదరాబాద్: రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు జారీ కానున్నాయి. సౌర విద్యుత్ ఉత్పాదకతను పెంచేం దుకు రాయితీలను ప్రకటించడంతోపాటు అనుమతుల ప్రక్రియను సరళీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ‘తెలంగాణ సౌర విద్యుత్ విధానం-2015’ను ప్రకటించింది. సింగిల్ విండో అనుమతులకు సంబంధించిన విధివిధానాలను మరో 30 రోజుల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రకటించనున్నా యి. అనుమతుల పర్యవేక్షణకు డిస్కంలు సోలార్ పాలసీ సెల్ (ఎస్పీసీ)ను ఏర్పాటు చేయనున్నాయి. అనుమతులిచ్చిన ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఇంధనశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ పనిచేయనుంది. ప్రాజెక్టు అనుమతుల కోసం మెగావాట్‌కు రూ. 10 వేల చొప్పున గరి ష్టంగా రూ. 2 లక్షల రుసుమును డిస్కంలు వసూలు చేయనున్నాయి. ఈ విధానం ఐదేళ్లపాటు అమలులో ఉండనుంది. ఐదేళ్ల వ్యవధి లో పూర్తై ప్రాజెక్టులకు నిర్మాణం పూర్తై నాటి నుంచి 10 ఏళ్లపాటు రాయితీలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో పేర్కొన్న నిర్దిష్ట వ్యవధి లేదా దరఖాస్తు చేసుకున్న రెండేళ్లలోపు ఉత్పత్తి ప్రారంభించిన సొలార్ ప్రాజెక్టులు/పార్కులకే ఈ ప్రోత్సాహకాలు వర్తించనున్నాయి. అనుమతులు సరళీకృతం.. రాయితీల వెల్లువ ప్రాజెక్టుల కోసం సేకరించే వ్యవసాయ భూములను పారిశ్రామిక భూములుగా మార్చేందుకు నిర్ణీత రుసుమును సోలార్ పాలసీ సెల్ (ఎస్పీసీ)కు చెల్లిస్తే సరిపోనుంది. ఇతర అనుమతులు అవసరం లేదు. భూగరిష్ట పరిమితి చట్టం నుంచి సౌర విద్యుత్ ప్రాజెక్టులకు మినహాయింపు. మెగావాట్‌కు గరిష్టంగా 5 ఎకరాల వరకు సేకరించవచ్చు. స్వీయ వినియోగంపై ఉత్పత్తిదారులకు (కాప్టివ్ యూజ్) రాష్ట్రం లోపల వీలింగ్, ట్రాన్స్మిషన్ చార్జీల మినహాయింపు. ట్రాన్స్మిషన్ నష్టాల చార్జీలు మాత్రం వర్తిస్తాయి. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు ఐదేళ్ల వరకు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీల మినహాయింపు. ట్రాన్స్‌కో/డిస్కంల లైన్లతో కొత్త ప్రాజెక్టులను అనుసంధానించే బాధ్యత ఆయా పారిశ్రామికవేత్తలదే. గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన అభివృద్ధి, లేఔట్ చార్జీలపై ఎకరాకు రూ. 25 వేల వరకు మినహాయింపు. ప్రాజెక్టులకు కావాల్సిన అన్ని పరికరాలు/సామగ్రిపై 100 శాతం వ్యాట్/ఎస్జీఎస్టీ పన్నును ప్రభుత్వం ఐదేళ్ల వరకు తిరిగి చెల్లిస్తుంది. ప్రాజెక్టు భూముల కొనుగోళ్లపై 100 శాతం స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు. పీసీబీ నుంచి వారంలో పర్యావరణ అనుమతులు. ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ విక్రయించుకునేందుకు 21 రోజుల్లో అనుమతులు. కాప్టివ్/ఓపెన్యాక్సెస్/షెడ్యూల్డ్ వినియోగదారులు తాము ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంలకు ఇచ్చి తమకు అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు. (ఫిబ్రవరి-జూన్ మధ్య కాలంతోపాటు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల సమయం మినహా). నివాస, వ్యాపార, పారిశ్రామిక భవనాలపై ‘సోలార్ రూఫ్ టాప్’(ఎస్ఆర్పీ)ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు.