సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్ల పక్కన, నాలాల్లో వేస్తున్న నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల(డెబ్రిస్) సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ త్వరలోనే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. దీనిలో భాగంగా పాత భవనాలు కూల్చివేసి.. వాటిస్థానంలో కొత్తవి నిర్మించాలనుకునేవారు భవన నిర్మాణ అనుమతి ఫీజులతోపాటు డెబ్రిస్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకుగాను కూల్చివేసే భవనం బిల్టప్ ఏరియాలో చదరపు అడుగుకు రూ.12 వంతున లెవీగా భవన ని ర్మాణ అనుమతుల ఫీజులతోపాటే చెల్లించాలి. దీన్ని జీహెచ్‌ఎంసీ ‘డిమాలిషన్ అండ్ రిమూవల్ ఎక్స్‌పెన్సెస్’పద్దు కింద జమ చేస్తారు. భవనం కూల్చివేతలో వెలువడే డెబ్రిస్‌ను జీహెచ్‌ంఎసీ సీ అండ్ డీ రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తుంది.
ఇది సెల్లార్లు లేని పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించే వాటికి వర్తిస్తుంది. సెల్లార్లు, సబ్ సెల్లార్లకు సంబంధించి పాత భవనాలకు కానీ, కొత్తగా నిర్మించబోయే వాటికి కానీ అనుమతి తీసుకున్న వారు సెల్లార్ తవ్వకం పని ఎప్పుడు ప్రారంభించేది జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలియజేయాలి. సంబంధిత అధికారుల బృందం సెల్లార్ తవ్వక ప్రాంతాన్ని తనిఖీ చేస్తుంది. వీరు సెల్లార్ తవ్వకాల్లో వెలువడే డెబ్రిస్‌తో పాటు కొత్త నిర్మాణ వ్యర్థాల్లో ఎంతమేర రీసైక్లింగ్‌కు ఉపయోగపడుతుందో అంచనా వేసి, డెబ్రిస్ పరిమాణాన్ని నిర్ధారిస్తారు. నిర్మాణదారు దాన్ని జీహెచ్‌ఎంసీ నుంచి డెబ్రిస్ రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి పొందిన ‘హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ద్వారా కానీ, స్వయంగా కానీ తరలించవచ్చు.
ఈ ఏజెన్సీ ద్వారా తరలిస్తే మెట్రిక్ టన్నుకు రూ.342 వంతున చెల్లించాలి. స్వయంగా తరలించాలనుకుంటే రూ.68.5 చెల్లిస్తే సరిపోతుంది. నిర్మాణదారు అండర్‌టేకింగ్ ఇచ్చి, వ్యర్థాలు తరలించాక చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి ఆమోదం పొందాక త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.
మెట్రిక్ టన్నుకు రూ.256..
నగరంలో డెబ్రిస్ సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ డెబ్రిస్ రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాంకీకి చెందిన ‘హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు వచ్చే నవంబర్ నాటికి ప్లాంట్ పని ప్రారంభించాల్సి ఉంది. పని ప్రారంభమయ్యాకే సీ అండ్ డీ వ్యర్థాలను అక్కడకు తరలించాల్సి ఉన్నప్పటికీ, నగరంలో ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పేరుకుపోయిన డెబ్రిస్ సమస్య పరిష్కారానికి ప్రస్తుతం మెట్రిక్ టన్నుకు రూ.256.5 చార్జీతో డెబ్రిస్‌ను తరలించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కోరింది.
ఆ మేరకు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల తరలింపును ఇప్పటికే ప్రారంభించారు. సీ అండ్ డీ వ్యర్థాలను తరలించాలనుకునే ఎవరైనా ప్రస్తుతం రూ.256.5 చెల్లిస్తే సరిపోతుంది. జీడిమెట్ల, ఫతుల్లాగూడలలో రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు పనులు ప్రారంభం కాగా, జీడిమెట్లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్లాంట్ సమీప ప్రాంతానికి డెబ్రిస్ తరలిస్తున్నారు. నగర ప్రజలు తమ వద్ద ఉన్న ఎలాంటి డెబ్రిస్‌నైనా ఈ చార్జీతో తరలించవచ్చని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. సంబంధిత సమాచారాన్ని ‘మై జీహెచ్‌ఎంసీ’యాప్, కాల్‌సెంటర్ సేవల ద్వారా పొందవచ్చని తెలిపింది.
ప్రైవేటు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి
డెబ్రిస్ తరలించే ప్రైవేట్ వాహనాలు విధిగా రాంకీ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. వాటికి జీపీఎస్ తప్పనిసరి. తద్వారా సదరు వాహనాలు నిర్ణీత ప్రదేశానికి కాకుండా వేరే ప్రాంతంలో డెబ్రిస్ కుమ్మరిస్తే బల్దియా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. నగరంలో డెబ్రిస్ సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ఈ చర్యలకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment