వెనిగండ్ల పద్మజ , చిన్నారుల సేవలో పద్మజ
సాక్షి, ఒంగోలు : పుటుక నీది, చావు నీది, బతుకంతా ప్రజలది’ అంటాడు కాళోజీ. చదువంటే ఉద్యోగం కోసం అని, ఉద్యోగమంటే సొంత ఆస్తికోసమనే నేటి రోజుల్లో గ్రూప్ 1 ఆఫీసర్‌గా ఉద్యోగం వదిలేసి అనాథ సేవలో తరించేవారు అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో జిల్లాకు చెందిన వెనిగండ్ల పద్మజ ప్రధానంగా కనిపిస్తారు. ఒకరిద్దరు బిడ్డల్ని సాకలేకే వసతిగృహాల్లో చేరుస్తున్న ఈ కాలంలో ఆమె ఏకంగా 400 మంది అనాథ చిన్నారులకు అమ్మగా మారారు. ఇప్పటికి కనీసం 1000 మందికి పైగా చిన్నారుల విద్యోన్నతిలో ఆపన్న హస్తమయ్యారు. కంటేనే అమ్మ కాదు అని నిరూపిస్తూనే జీవన నైపుణ్యాలు లేని విద్య ద్వారా ఏమీ సాధించలేమంటూ ఆ ప్రాంతంలో విద్యా విలువలు బోధిస్తున్నారు. ఇంకోవైపు గాంధీ మార్గంలో తమ ఆశ్రమం ఉన్న ప్రాంతం మొత్తం పరిశుభ్రత కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. మరోవైపు తమ అనాథాశ్రమంలో ఉన్న చిన్నారులను యోగా, శాస్త్రీయ నృత్యంలో తీర్చిదిద్దుతున్నారు. ఇన్ని విశేషాలున్న వెనిగండ్ల పద్మజ జీవితం అందరికీ ఆదర్శనీయం.
నాగులుప్పలపాడు మండలంలోని ఒమ్మెవరానికి చెందిన వెనిగండ్ల పద్మజ ప్రాథమిక విద్యను ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. ‘చిన్నప్పటి నుంచే మంచిపనులు చేయటం వల్ల పెద్దలు ప్రశంసించటంతో ఇదేదో బాగుందని తనకు అనిపించేది. పద్మజ తర్వాత కాలంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం కర్ణాటకలోని రాయచూరు ప్రాంతానికి వలస పోవటంతో అక్కడే డిగ్రీ చేసింది. డిగ్రీ రోజుల్లో చదివే సమయంలో ఒక స్వచ్ఛంద సేవాసంస్థతో కలిసి పనిచేయటంతో సామాజిక సేవవైపు రావాలని నిశ్చయించుకుంది. అయితే, చదివిని చదువుకు సార్ధకత ఉండాలని పెద్దలు చెప్పటంతో ఒకేసారి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల పోటీ పరీక్షలు రాసి గ్రూప్ 1 సాధించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుని 2002 ప్రాంతంలో ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండల అభివృద్ధి అధికారిగా కొంతకాలం పనిచేశారు. తద్వారా ప్రభుత్వ విధానాలపై అవగాహన చేసుకున్నారు. మళ్లీ కొన్నాళ్లకు హైదరాబాద్‌లో ఉపాధికల్పనాధికారిగా కూడా ఉద్యోగించారు. ఆ సమయంలో కొన్నాళ్లు మానసిక వికలాంగుల సేవా సంస్థలో కొంతకాలం పనిచేశారు. సరిగ్గా ఇదే సమయంలో పూర్తి స్థాయిలో అనాథల సేవకు వెళ్లాలని ఆమె భావించారు.
ఈ క్రమంలోనే అన్వేషణ మొదలు పెట్టి విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఓ ఆశ్రమాన్ని సందర్శించారు. అదే జట్టు – భావ సమాఖ్య ఆశ్రమం. అయితే అప్పటికే స్థానికంగా ఉన్న ఉపాధ్యాయుడు పారినాయుడు మాస్టారు నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి పారినాయుడు మాస్టారు నిర్వహిస్తుండగా, ఈ ఆశ్రమాన్ని ఎంచుకుని ఆమె పూర్తి స్థాయిలో సేవలోకి వెళ్లారు. ‘గిరిజన గ్రామాల్లో చిన్నరోగాలతోనే సరైన వైద్య సదుపాయాలు లేక పెద్దలు చనిపోవటంతో చిన్నారులు అనాథలవుతున్నారు. పూర్తి స్థాయిలో వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో జట్టు ఆశ్రమాన్ని ఎంచుకున్నా’ అని చెబుతున్న పద్మజ 2004 నుంచి అక్కడే ఉండి సేవ చేస్తున్నారు. తనకు మిత్రులుగా ఉండేవారిని ఒక ఒక నెట్‌వర్క్ చేసి ఎందరో అనాధలకు తల్లిగా సేవలందిస్తున్నారు.
యోగా, శాస్త్రీయ నృత్యాలు, వ్యవసాయం
జట్టు ఆశ్రమ నిర్వహణ మొత్తం చిన్నారులే నిర్వహిస్తారు. వారికి కొద్దిమంది పెద్దలు సహకరిస్తారు. యోగ, చదువులు వారి దినచర్య. ఈ క్రమంలో పిల్లలే జీవన శైలి మారాలి అంటారు. సంపద కాదు ఆనందాన్ని ఇచ్చేది అనే పద్మజ గడచిన నాలుగేళ్లుగా ఆశ్రమానికి అనుబంధంగా రజనీ రాజా కళాక్షేత్రం నిర్వహిస్తూ చిన్నారులకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. విశేషమేమంటే శాస్త్రీయ నృత్యం, యోగాకు ఆమె శిక్షకురాలు. మరో విశేషమేమంటే ఆ్రస్టేలియా వెళ్లి అనాథాశ్రమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా కోర్సు చేయడం. ఈ క్రమంలోనే స్థానికంగా స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమంలో ఆమె క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. ఇలా జీవితాన్ని సేవారంగానికి వెచ్చిస్తున్న మన జిల్లా వాసి మనకాలం ‘మదర్’గా వేనోళ్ల ప్రశంసలందుకుంటన్నారు. పలు పురస్కారాలు ఆమెను వరించినా, ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించిన ఘనత ఆమె సొంతం.
Comments
Please login to add a commentAdd a comment