
మాస్కో: రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మహిళలు ఎనిమిది మంది అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలని, పెద్ద కుటుంబాలను ఏర్పరచాలని కోరారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో ప్రసంగించారు.
"మన పూర్వికులు చాలా మంది పిల్లలను కలిగి ఉండేవారు. మన అమ్మమ్మలు, ముత్తాతలలో చాలా మంది ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. వారంతా సాంప్రదాయక వారసత్వాన్ని కాపాడుకున్నారు. పెద్ద కుటుంబాలను ఏర్పరచడం మనకు ప్రస్తుతం తప్పనిసరి అవసరం. మన జాతి పునాదులకే గాక ఆద్యాత్మిక వారసత్వానికి ఇది ఎంతో ముఖ్యం" అని పుతిన్ అన్నారు.
రష్యాలో గత కొన్ని ఏళ్లుగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధంలోనూ భారీ సంఖ్యలోనే మృతి చెందారు. ఈ వివరాలను పుతిన్ ప్రస్తావించలేదు కానీ ప్రస్తుతం జనాభా ఆవశ్యకతకు ఇది కూడా ముడిపడి ఉంది. రష్యా జననాల రేటు 1990ల నుండి గణనీయంగా పడిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3,00,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచానా. రష్యా విధానాలు నచ్చక 8,20,000-9,20,000 మంది ప్రజలు రష్యాను వీడి పారిపోయారని సమాచారం.
ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్'