సంక్షేమం చేరువచేస్తూ..సమాజాన్ని చదివిస్తూ..! | Collector Koteswara Rao In Sakshiis Special Interview | Sakshi
Sakshi News home page

సంక్షేమం చేరువచేస్తూ..సమాజాన్ని చదివిస్తూ..!

Published Thu, Feb 9 2023 3:59 PM | Last Updated on Thu, Feb 9 2023 4:14 PM

Collector Koteswara Rao In Sakshiis Special Interview

‘‘పనుల్లేక వలసలు పోతున్నారనేది అవాస్తవం. రోజుకు లక్ష మందికి ‘ఉపాధి’ పనులు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 60వేల మంది మాత్రమే వస్తున్నారు. అలాగే పింఛన్లు తీసేశారనేది కూడా సత్యదూరమైన ప్రచారం. అర్హత ఉన్న ఎవ్వరి పింఛన్‌ తొలగించలేదు. ఏటికేడు పింఛన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేదలకు ఇళ్లు, వారి పిల్లలకు చదువు, పోషకాహారం అందించి ఆరోగ్యవంతులను చేయడంపై ప్రధానంగా దృష్టి సాధించాం. నా బిడ్డను కూడా అంగన్‌వాడీలో చేర్పించా. క్షేత్రస్థాయి నుంచి సమాజం, పరిస్థితులు తెలుసుకుంటూ పిల్లలు ఎదగాలి. పేదల కష్టాలు తీర్చడమే ప్రభుత్వ, అధికారుల ప్రధాన లక్ష్యం.’’ అని జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలు పంచుకున్నారు. 
– సాక్షి ప్రతినిధి కర్నూలు

సాక్షి: పనుల్లేక వలసలు పోతున్నారని ప్రచారం జరుగుతోంది? నిజంగా పనుల్లేవా? వలసకు కారణమేంటి? నివారణ చర్యలేంటి?  
కలెక్టర్‌: ఆదోని డివిజన్‌లో వలసలు దశాబ్దాలుగా ఉన్నాయి. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వలసలు వెళ్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చర్చించా. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెస్‌(సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషియల్‌ స్టడీస్‌)తో సర్వే చేయించా. గత డిసెంబర్‌ 12న రిపోర్ట్‌ ఇచ్చింది. ఉపాధి పనులు ప్రతీ గ్రామంలో ఉన్నాయి. జిల్లాలో రోజూ లక్ష పనిదినాలు కల్పించే అవకాశం ఉంది. కానీ 60వేల మందే వస్తున్నారు. పనుల్లేక వలసలు పోతున్నారనేది పచ్చి అబద్ధం. తెలంగాణ, గుంటూరులో నవంబర్, డిసెంబర్, జనవరిలో పత్తికోత కోసం ఆ పని తెలిసిన వారు వెళ్తారు. కిలోకు రూ.14చొప్పున కూలి ఇస్తారు. ఒక్కో వ్యక్తి క్వింటాపైన ఒలిచి రూ.1500–రూ.1800 వరకు సంపాదిస్తారు. పత్తికోత తర్వాత తిరిగి గ్రామాలకు వచ్చి ఉపాధి పనులకు వెళతారు. గతంలో కేరళ, కర్ణాటకకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 

సాక్షి: ఆదోని డివిజన్‌లో పోషకాహార లోపం కూడా ఎక్కువగా ఉంది? ముఖ్యంగా అమ్మాయిల్లో ఐరన్‌ లోపం తీవ్రంగా ఉందని తెలుస్తోంది? 
కలెక్టర్‌: పోషకాహార లోపాన్ని నివారించడంలో మనం ప్రథమస్థానంలో ఉన్నాం. ఆదోని డివిజన్‌ వెనుకబాటుకు గురైంది. పేదరికం కూడా ఉంది. దీంతో సరైన పోషకాహారం పిల్లలకు అందలేదు. అందుకే ప్రతీ స్కూలు, కాలేజీలో 10–19 ఏళ్ల బాలికల వివరాలు సేకరిస్తున్నాం. వారంలోపు వివరాలు వస్తాయి. రక్తపరీక్షలు చేసి వారికి ఐరన్‌ లోపం ఉంటే మందులు ఇస్తాం. హాస్టళ్లలో ఉంటే మెడిసిన్‌ అందిస్తాం. స్కూళ్లకు వచ్చేవారికి ఇంటికే పంపిస్తాం. ఇంటివద్దే ఉన్న పిల్లలకు ఫ్యామిలీ ఫిజీషియన్‌ ద్వారా అందిస్తాం. హాస్టళ్లు, విద్యాసంస్థల్లో పోషకాహారం అందిస్తున్నాం. పరీక్షలు రాసి పిల్లలు ఇళ్లకు వెళ్లేలోపు ఏ ఒక్కరిలో ఐరన్‌ లోపం లేకుండా చూస్తాం.

సాక్షి: పింఛన్లు తీసేస్తున్నారని ప్రచారం జరుగుతోంది? వాస్తవం ఏంటి?  
కలెక్టర్‌: పింఛన్లు తీసేశారనే ప్రచారం సరికాదు. మొన్న ఒక గ్రామానికి వెళ్లాను. ఒక ఆవిడ వచ్చి పింఛన్‌ కావాలంది. అన్ని వివరాలు అడుగుతూ భూమి ఎంత ఉంది? అని ప్రశ్నిస్తే 17 ఎకరాలు అని చెప్పింది. ఇలాంటి వారికి పింఛన్లు ఎలా ఇస్తాం. పింఛన్ల పంపిణీ లక్ష్యం ఏంటి? అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛన్‌ తీయలేదు. కొత్తగా వితంతు, వృద్ధాప్య పింఛన్లు మరిన్ని ఇస్తున్నాం. ఏటికేడు పింఛన్ల సంఖ్య పెరుగుతోంది. 

సాక్షి: ఇళ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ఉగాదికి పూర్తి చేసే అవకాశం ఉందా? 
కలెక్టర్‌: 16వేల ఇళ్లు నిర్మిస్తున్నాం. 7వేలు పూర్తయ్యాయి. తక్కినవి పలు దశల్లో ఉన్నాయి. సొంత స్థలం ఉన్నా, గుడిసెలు, శిథిలావస్థలోని ఇళ్లు ఉంటే వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకోవచ్చు. 

సాక్షి: సమస్యల పరిష్కారం కోసం స్పందనకు వస్తున్నారు? ఫలితం ఉందా?  
కలెక్టర్‌: కచ్చితంగా. కావాలంటే మీరు ప్రజలను విచారించవచ్చు. అభ్యంతరం లేదు.  సోమవారం మండల, డివిజన్, జిల్లా స్థాయిలో జరిగే స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కనెక్ట్‌ చేస్తాం. సమస్యకు అక్కడికక్కడే పరిష్కారం సూచిస్తున్నాం. ఎక్కువగా భూసమస్యలు వస్తున్నాయి. గతేడాది 4,727 భూసమస్యలు వచ్చాయి. ఇందులో 70శాతం కుటుంబ తగాదాలే. ఇవేమీ చేయలేం. కోర్టు పరిధిలోని అంశాలు. మా పరిధిలోని సమస్యలు తప్పక పరిష్కరిస్తున్నాం. 

సాక్షి: మీ కుమారుడిని అంగన్‌వాడీలో చదివిస్తున్నారు? కారణమేంటి?  
కలెక్టర్‌: క్షేత్రస్థాయిలో అన్ని పరిస్థితులు తెలుసుకుంటూ పిల్లలు ఎదగాలి. చదువు పేరుతో రుద్ది, వాళ్లను ఉద్యోగంలో వేసి బందీలను చేయకూడదు. ఒకే జీవితం స్వేచ్ఛగా చదవాలి. సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి. అంగన్‌వాడీ నుంచి ఆక్స్‌ఫర్డ్‌ దాకా వెళ్లాలనేది నా కోరిక. ఫస్ట్‌ టీసీలో అంగన్‌వాడీ ఉండాలి. పిల్లలకు చదువుతో పాటు సమాజాన్ని చదివించడం నేర్పాలి. అందుకే ఈ నిర్ణయం.  

సాక్షి: ఇలా పనులకు వెళ్లడంతో పిల్లల చదువుకు ఇబ్బంది కలుగుతుంది కదా? ఈ కారణాలతోనే ఇది దేశంలో అక్షరాస్యతలో కూడా వెనుకబడి 
ఉందా? 

కలెక్టర్‌: పనుల కోసం వెళ్లేవారి పిల్లల కోసం సాధారణ హాస్టళ్లు కాకుండా 71 సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేశాం. గతేడాది ‘పది’ ఫెయిల్‌ అయినవారు, పనులకు వెళ్లేవారి పిల్లలను గుర్తించాం. వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇస్తున్నాం. ఏ కారణంతో ఎవ్వరూ బడికి వెళ్లని పరిస్థితి రాకూడదు. ‘పది’ ఫెయిల్‌ అయిన వారు కూడా మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులై పై చదువులకు పంపే ఏర్పాటు తీసుకున్నాం. చదవులతోనే జీవితాలు బాగుపడతాయని మేమంతా నమ్ముతున్నాం.  

సాక్షి: సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పాలన సులభతరమైందా? ప్రజలకు సేవలు అందించడంలో సంతృప్తి ఉందా? 
కలెక్టర్‌: గతంలో సమస్యల కోసం మండల కేంద్రానికి వెళ్లేవారు. ప్రజలు వెళ్లినప్పుడు అధికారులు ఉండొచ్చు? క్యాంపులకు వెళ్లొచ్చు. దీంతో ఒకటికి రెండుసార్లు పనులు వదులుకుని, డబ్బులు ఖర్చు చేసుకుని వచ్చేవారు. సచివాలయాలు వచ్చాక పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇతర సమస్యలు అక్కడే పరిష్కారమవుతున్నాయి. ఇవి ప్రజలకు సౌలభ్యంగా ఉన్నాయి. వీటి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నాం. 

సాక్షి: పదో తరగతి ఫలితాలు గతేడాది దారుణంగా వచ్చాయి? కారణమేంటి? ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకున్నారా?   
కలెక్టర్‌: గతేడాది ఫలితాలపై నేను చాలా బాధపడ్డాను. పిల్లలు కష్టపడి పాసవ్వాలి. అప్పడే భవిష్యత్‌లో వారి ఆలోచన దృక్పథం బాగుంటుంది. దొడ్డిదారిలో పాస్‌ అయితే, వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అలా అలవాటు చేయొద్దని టీచర్లకు చెప్పా. గతేడాది 22వేల మంది ఫెయిల్‌ అయ్యారు. ఈ అనుభవంతో ఈ ఏడాది ప్రత్యేకంగా మెటీరియల్స్‌ ఇచ్చి ప్రత్యేక చొరవ తీసుకున్నాం. ప్రత్యేక అధికారులను నియమించాం. ఒక్కో టీచర్‌కు 5గురు పిల్లల బాధ్యతను అప్పగించాం. 45రోజులు ప్రత్యేకంగా తీసుకున్నాం. వందశాతం లక్ష్యంగా పెట్టుకున్నాం. దగ్గరగా ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement