పరిసరాల పరిశుభ్రతలో భాగంగా చెత్త ఊడుస్తూ..
కేపీహెచ్‌బీకాలనీ : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా.. నిజం మరిచి నిదురపోకుమా.. మహాకవి శ్రీశ్రీ పాటను నిజం చేసి చూపిస్తున్నారాయన. స్వయంకృషితో ఎదిగి ఎదుటివారికి సహాయపడాలని చాటిచెబుతూ ఆచరణలో అమలుపరుస్తున్నారు ఓ మాజీ భద్రతా అధికారి. చిన్నతనంలో తాను చదువుకునేందుకు పడిన కష్టాలను గుర్తుంచుకొని.. ఉన్నత స్థానాలకు చేరుకున్నారాయన. కష్టాల కడలిలో సాగుతున్న పేద విద్యార్థులకు, వృద్ధులకు సహాయ, సహకారాలను అందిస్తున్నారు. సామాజిక సేవతో సాటివారిపై మానవతను చాటుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు రాణాప్రతాప్.
కూకట్‌పల్లిలోని వసంతనగర్ కాలనీలో నివాసముంటున్న రాణాప్రతాప్ ఐడీపీఎల్ సంస్థ భద్రతా విభాగంలో సేఫ్టీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. అనంతరం లిబియాలోని పెట్రో కాంప్లెక్స్‌లో సేఫ్టీ కన్సల్టెంట్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ఓ రసాయన పరిశ్రమలో భద్రతా విభాగం మేనేజర్‌గానూ సేవలందించారు. పదవీ విరమణాంతరం ఖాళీగా ఉండకుండా తోటివారికి సహాయపడేందుకు ముందుకొచ్చారు. కార్మికుల భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమాలను తలపెట్టారు. వసంతనగర్‌కాలనీలో సుమారు 300 మందికి ఆసరా కార్డులను ఇప్పించారు. స్థానిక సంక్షేమ సంఘం కార్యదర్శిగా, సొసైటీ డైరెక్టర్‌గా మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేశారు. వీటితో పాటు అనాథలకు అండగా నిలిచేందుకు, అక్షరం, ఆహారం, ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన పెంపొందించేందుకు తన పెన్షన్ డబ్బుల్లో నుంచి ప్రతినెలా ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
‘సేవ్ ఏ లైప్, సేప్టీ ఫర్ హ్యుమానిటీ’....
రాణాప్రతాప్ ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఆరేళ్లుగా సేవలందిస్తున్నారు. ప్రతి ఏటా పేద అనాథ బాలలకు, విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్‌లను, పాఠశాలలకు బెంచీలు అందజేస్తున్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలోని మహిళలకు చీరలు, కనీస అవసరాల కిట్స్, అన్నదానం, ఒంటరి వృద్ధులకు ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతున్నారు. ఓ వికలాంగ ఉపాధ్యాయురాలికి నెలనెలా వేతనం అందిస్తున్నారు. రోడ్లపై నిద్రించే అనాథలు, పేదలకు ఉచితంగా రగ్గులు, ప్రమాదాల నివారణ, ఆరోగ్యం పట్ల శ్రద్ద, కుటుంబ సంక్షేమం తదితర అంశాలపై ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా చేసిన కృషికి గుర్తింపుగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పౌరసన్మానం పొందారు రాణాప్రతాప్. పేదలకు సేవ చేసేందుకు ఆర్థికస్థోమత ఉన్నవారు ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment