చక్కని ఉద్యోగం.. ఐదంకెల జీతం.. చేతి నిండా డబ్బు.. ఎంజాయ్ చేసే వయసు.. మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఇవన్నీ ఉన్నా ఆ యువతి మాత్రం నలుగురికి సాయం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంది. అదే మానవ జన్మకు సార్థకమంటోంది. తండ్రి నుంచి సేవచేయడాన్ని వారసత్వంగా తీసుకున్న ఆమె పేరు ‘పల్లవి ప్రియ’. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఈమె సిటీలో ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అంతేకాదు.. ‘కాజ్ ఫర్ సెలబ్రేషన్’ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పి దాని ద్వారా వందలాది మందికి అండగా నిలుస్తోంది.
సాక్షి,సిటీబ్యూరో: పల్లవి ప్రియ సిటీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తునే అదే కంపెనీలోని సీఎస్‌ఆర్‌లో కోర్ మెంబర్‌గాను ఉంది. ఉత్తరప్రదేశ్‌లో చదువుకునే రోజుల్లో ఎన్‌ఎస్‌ఎస్ మెంబర్‌గా కాలేజీ అయ్యాక తన స్నేహితులతో కలసి సమీపంలోని బస్తీల్లో పర్యటించి అక్కడి వారి అవసరాలను గుర్తించేంది. అలా తన వద్దనున్న డబ్బులతో చేతనైన సాయం అందించేది. ఉద్యోగం వచ్చాక ఈసేవను మరింత విస్తృతం చేసింది. పల్లవిప్రియ చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్డుపై ఉండే చిరు వ్యాపారులు వర్షంలో తడుస్తునే తమ పనులు చక్కబెట్టుకోవడం చూసిన ఆమె ‘ఫుట్‌పాత్ వ్యాపారులకు పెద్ద పెద్ద గొడుగులను ఇవ్వాలనే లక్ష్యంతో నేను ఓ అడుగు వేస్తున్నా.. ఆసక్తి ఉన్నవారు నాతో చేయి కలపండి’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. అది జరిగి ఆరు గంటల్లో పదుల సంఖ్యలో ఆమెను సంప్రదించి నగర వ్యాప్తంగా ఫుట్‌పాత్‌పై ఉండే చిరు వ్యాపారులకు గొడుగులు పింపిణీ చేసే నగదు సమకూర్చుకుని వారిసి సాయం అందించింది.
చిన్నారులకు బహుమతులు ఇస్తున్న పల్లవి ప్రియ
ఒక్క రోజులో ఏడాదికి సరిపోయే బుక్స్
గత ఏడాది సెప్టెంబర్‌లో తన పుట్టిన రోజున నగరంలోని ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లిన పల్లవి ప్రియ అక్కడి పిల్లలతో సరదాగా గడిపి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది. తిరిగి వచ్చే సమయంలో వారంతా ‘అక్కా..మాకు నోట్ బుక్స్ లేవు, చదువుకోవడానికి, రాయడానికి చాలా ఇబ్బంది ఉంద’నడంతో అనాథ పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేసేందుకు దాతలు కావాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. కొన్ని గంటల్లోనే 12 మంది ముందుకు వచ్చారు. అక్కడి పిల్లలకు ఏడాది పాటు కావాల్సిన నోట్‌బుక్స్, బట్టలు, షూస్, ఇతరాత్ర అవసరాల కోసం సాయం అందించారు. మరోరోజు ఇన్ఫోసిస్ కార్యాలయానికి కొందరు పిల్లలు విజిటింగ్ కోసం వచ్చారు. ఆ సమయంలో వారి కాళ్లకు చెప్పులు లేవు. వారి వద్దకు వెళ్లి వారి గురించి ఆరా తీసింది పల్లవిప్రియ. వారంతా నిరుపేదలని తెలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సాయంతో ఆ రోజు అక్కడకు వచ్చిన పిల్లలందరికీ చెప్పులతో పాటు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపింది. అంతేకాదు.. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ స్కూల్స్‌లో బెంచ్‌లు, ఫ్యాన్‌లు పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది పల్లవిప్రియ. ఈమెకు ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. అందుకే పర్యావరణంపై శ్రద్ధను తీసుకుంటోంది. స్కూలు విద్యార్థులను కలిసి పర్యావరణం ప్రాముఖ్యతను వివరిస్తూ వారితో ఎస్సై రైటింగ్స్ పోటీలు నిర్వహిస్తోంది. వక్తృత్వ పోటీలు పెట్టి బహుమతులు సూతం ఇస్తోంది. ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించి చెబుతోంది. పల్లవి ప్రియ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగలు, స్వచ్ఛంద సంస్థలు సైతం అభినందింది సత్కరించడం గమనార్హం.
నాన్నే స్ఫూర్తి..
మా నాన్నకు ఇతరులకు సాయం చేయడం అంటే ఇష్టం. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తున్నాను. సమాజానికి నా వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందనేది గుర్తించాను. అప్పటి నుంచే పేదలకు నాకు తోచిన విధంగా సాయం చేస్తున్నా. అందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకున్నా. నా సొంత డబ్బులతో పాటు నాకెంతో మంది అండగా నిలుస్తున్నారు. వారు ఇచ్చిన ప్రతి రూపాయికి బిల్లులతో సహా లెక్క కూడా చెప్తుంటాను. అందుకే సహాయం కోసం పోస్ట్ పెట్టిన ప్రతిసారీ నాకు తోడుగా ఎంతో మంది వెన్నంటి వస్తున్నారు. – పల్లవి ప్రియ, ఇన్ఫోసిస్ ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment