అప్పుడు టీ అమ్మాడు.. ఇప్పుడు 'నీట్‌' బోధిస్తున్నాడు | A Person Helping Poor Students To Get Qualifying MBBS Entrance In Odisha | Sakshi
Sakshi News home page

అప్పుడు టీ అమ్మాడు.. ఇప్పుడు 'నీట్‌' బోధిస్తున్నాడు

Published Sat, Sep 14 2019 2:26 PM | Last Updated on Sat, Sep 14 2019 5:29 PM

A Person Helping Poor Studens To Get Qualifying MBBS Entrance In Odisha - Sakshi

భువనేశ్వర్‌ : జార్ఖండ్‌కు చెందిన 47 ఏళ్ల అజయ్‌ బహుదూర్‌ సింగ్‌ పేరు ప్రస్తుతం ఒడిశాలో మారుమోగిపోతోంది. భువనేశ్వర్‌ పట్టణంలో నివసిస్తున్న ఆయన.. మరో సూపర్‌-30 ఆనంద్‌కుమార్‌లా పేరు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు పేదరికంలో మగ్గిన అజయ్‌.. అంచెలంచెలుగా ఎదిగి.. ప్రస్తుతం తన ఇంటిలోనే ఒక గదిని ఏర్పాటు చేసుకొని పేద విద్యార్థులకు నీట్ పాఠాలు బోధిస్తున్నారు. అంతేకాదు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న 19 మంది విద్యార్థుల్లో(2018-19 బ్యాచ్‌కు చెందినవారు) 14 మంది నీట్‌కు అర్హత సాధించడం విశేషం. అదే విధంగా 2017-18 బ్యాచ్‌లో 20 మంది విద్యార్థులకు అజయ్‌ పాఠాలు బోధించగా..వారిలో 18 మంది నీట్‌లో ఉత్తీర్ణులయ్యారు.

విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతూ సేవాభావం చాటుకుంటున్న అజయ్‌ తన నేపథ్యం గురించి చెబుతూ..పరిస్థితుల ప్రభావం వల్ల తాను డాక్టర్‌ కాలేకపోయినా తనలా మరే ఇతర విద్యార్ధి బాధపడకూడదనే ఇలా పాఠాలు బోధిస్తున్నట్లు తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఎంబీబీఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్న సమయంలో నాన్న ఆరోగ్యం పాడవడంతో కుటుంబ పోషణ భారమైంది. దాంతో చదువుకు స్వస్తి చెప్పి టీ అమ్మాల్సి వచ్చింది. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో... ''జిందగీ'' పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాను. నా దగ్గరికి వచ్చే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి నీట్‌ పాఠాలు బోధిస్తున్నా అని పేర్కొన్నారు. ''జిందగీ ఫౌండేషన్‌''ను తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు త్వరలోనే విస్తరించనున్నట్లు వెల్లడించారు.  

నీట్‌కు అర్హత సాధిస్తా..
'మాది నిరుపేద కుటుంబం. మా తండ్రి దినసరి కూలీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేకపోయాను. కానీ జిందగీ ఫౌండేషన్‌ ద్వారా అజయ్‌ బహుదూర్‌ సార్‌ ఉచితంగా నీట్‌ పాఠాలు బోధిస్తున్నట్లు తెలుసుకొని అందులో చేరాను' అని నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్న రేఖారాణి వెల్లడించింది. ఎంత కష్టపడైనా సరే.. నీట్‌లో అర్హత సాధించి ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ సాధించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement