ప్రతీకాత్మక చిత్రం
వివిధ రకాలుగా పేదలకు సహాయం చేస్తున్నట్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొందరైతే బాధితుల ఇళ్లకు వెళ్లి వారితో భోజనం చేస్తూ, వారి ఇబ్బందులు తెలుసుకుంటూ.. మరి కొందరు బ్యాంకుల్లో ఖాతాలను ప్రాంభించి సహాయం చేయాలని హృదయ విదారక సందేశాలతో సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేస్తూ దయామయులను దోచుకుంటున్నారు.
సాక్షి సిటీబ్యూరో: మేము మూడు నెలలుగా బస్తీల్లోని పేదలకు రోజూ రెండు పూటలా భోజనం అందజేస్తున్నాం. అవసరమైన వారికి మందులు సరఫరా చేస్తున్నాం. రోగాల బారినపడిన వారికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం చేస్తున్నాం. కరోనా టైమ్‌లో ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు చూసి చలించిపోయిన ఎందరో దేశ విదేశాల నుంచి ఆయా అకౌంట్‌లకు విరాళాలను పంపిస్తున్నారు. కొందరు నేరుగా, మరికొందరు తమ పేరు రాకుండా గోప్యంగా ఆయా సంస్థల ప్రతినిధులకు డబ్బులు అందజేస్తున్నారు. అయినా ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
సహాయం చేస్తామని అకౌంట్ ప్రారంభం...
చాంద్రాయణగుట్ట సమీపంలో ఓ పేద కుటుంబం ఉంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నది. వీరికి నలుగురు అమ్మాయిలు. తండ్రి సంపాదన అంతగా లేదు. లాక్‌డౌన్ కారణంగా తండ్రికి వచ్చే కొద్దిపాటి ఆదాయం రాలేదు. తల్లి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. దీంతో చుట్టు పక్కల వారు, బంధువులు తోచినకాడికి సహాయం చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నది అనే విషయం ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ నేతలకు తెలిసింది. వారు ఇంటి వచ్చి చూశారు. ఇంట్లో పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. కుటుంబ సభ్యులు, మంచాన ఉన్న తల్లితో సహా మనస్సు తల్లడిల్లిపోయేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పాటు దేశ విదేశాల నుంచి దాతలు సహాయం చేయడానికి బంధువుల పేరుతో బ్యాంక్‌లో అకౌంట్ ప్రాంభించారు. రెండు మూడు రోజుల్లో ఆ అకౌంట్‌లో దాదాపు రూ. 45 లక్షల సహాయం అందింది.
సంస్థ ప్రతినిధుల సహాయంతో కుటుంబ సభ్యులు తల్లిని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేశారు. డాక్టర్లు రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇంతలోనే దాతల ద్వారా వచ్చిన రూ. 45 లక్షల్లో నుంచి లక్షన్నర ఆస్పత్రిలో కట్టారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. ఆమె మృతికి ముందే ఆ సంస్థ ప్రతినిధి తమ అకౌంట్‌లోని రూ. 15 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. మిగతా డబ్బును కూడా ఇతర ప్రతినిధి అకౌంట్‌లో వేసుకున్నారు. పలు సంస్థలు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాయి. దీంతో కొంత మంది ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా ఎందరో సేవల పేరుతో డబ్బులు స్వాహా చేస్తున్నారు.
విరాళాల దుర్వినియోగం...
పేదలకు, అవసరం ఉన్న వారికి సహాయం చేస్తున్నామని వీడియోలు పోస్టు చేసి దాతల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న వారి వద్ద అందుకు సంబంధించిన లెక్కలు ఉండవనే చెప్పొచ్చు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే వ్యక్తి పేదల కష్టాల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అకౌంట్ నంబర్ ఇచ్చే వారు. ప్రస్తుతం పేదల వీడియో ఆప్‌లోడ్ చేస్తూ సహాయం కోసం అకౌంట్ నంబర్‌కు బదులు ఫోన్ నంబర్ ఇస్తున్నారు. దాతలు ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరుతున్నారు. చాలా మంది పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో డబ్బులు ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారు స్వయంగా రావడం లేదు. దాతలు ఇచ్చే లక్షలాది రూపాయలకు లెక్కలు ఉండవు. ఇచ్చిన డబ్బులోంచి కొంత ఖర్చు చేసి మిగతా డబ్బులు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment