అందం.. సేవానందం.. | Rasmi Thakur Social Service on This Lockdown Time Hyderabad | Sakshi
Sakshi News home page

అందం.. సేవానందం..

Published Tue, Jul 28 2020 8:01 AM | Last Updated on Tue, Jul 28 2020 8:01 AM

Rasmi Thakur Social Service on This Lockdown Time Hyderabad - Sakshi

చక్కని అందంతో పాటు మంచి మనసు కూడా ఉంటే మరింతగా ఆ అందం వన్నెలీనుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. నగరానికి చెందిన మోడల్, పలు అందాల పోటీల విజేత రష్మీ ఠాకూర్‌ అలాంటి వన్నెలీనే గ్లామర్‌ క్వీన్‌. కొంతకాలంగా గ్లామర్‌ రంగంలో రాణిస్తున్న ఆమె.. లాక్‌డౌన్‌ సమయంలో తన రైజ్‌ ఇండియా ఫౌండేషన్‌ ద్వారా ఆపన్నులకు ఆసరాగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయి సంస్థకు నగరానికి చెందిన మోడల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడమనే అరుదైన ఘనతను సాధించారు. 

సాక్షి, సిటీబ్యూరో: యూఎన్‌ ఆధ్వర్యంలోనే గ్లోబల్‌ డిప్లొమాటిక్‌ కౌన్సిల్‌కు ఫార్‌ ఈస్ట్, మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్‌ అంబాసిడర్‌గా అలాగే ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ లైఫ్‌స్టైల్స్‌ డైరెక్టర్‌గా ఎంపికైనట్టు రష్మీ ఠాకూర్‌ తెలిపారు. ఈ సందర్భంగా తన గురించి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... 

ఫ్యాషన్‌.. ప్రొఫెషన్‌.. 
మాది ఒకప్పటి కరీంనగర్‌ జిల్లా.. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాగా మారింది. నాన్న రైతు. నేను బీకామ్‌ కంప్యూటర్స్, టెక్స్‌టైల్స్‌లో డిప్లొమా చేశాను. అనుకోకుండా అందాల పోటీల్లోకి ప్రవేశించాను. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తున్నప్పుడు మోడలింగ్‌ చేశాను. ఫస్ట్‌ 2013లో అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఏడాది 2014 జనవరి 18న మిస్‌ ఏపీ గెలిచాను. అక్కడ నుంచి 2016లో మిస్‌ బ్యూటీఫుల్‌ ఐస్, మిస్‌ పర్ఫెక్ట్‌ టైటిల్స్‌ గెలిచాను. 2016లో మిస్‌ ఇండియా ప్లానెట్‌ గెలిచాను. మొత్తం 7 టైటిల్స్‌ గెలిచాను. ప్రొఫెషనల్‌ మోడల్‌గా దాదాపు అన్ని క్లోతింగ్‌ బ్రాండ్స్‌కు పనిచేశా. పలు అందాల పోటీలకు జడ్జ్‌గా వ్యవహరించాను. 2017 నుంచి  నేషనల్‌ హ్యాండ్లూమ్స్‌కి అంబాసిడర్‌గా ఉన్నాను. సినిమా అవకాశాలు వచ్చాయి.. కానీ చేయలేదు. ఎందుకంటే గ్లామర్‌ రంగం ద్వారా వచ్చిన గెలుపును వ్యక్తిగతానికి కాకుండా సమాజహితానికి వినియోగించాలని నా ఆలోచన. 

సేవానందం.. 
అందాల పోటీలకు, గ్లామర్‌ రంగ తళుకు బెళుకులతో పాటు సమాజంలో ఉన్న కష్టాలు కన్నీళ్లూ కూడా చూశాను. సమాజం పట్ల నా వంతు బాధ్యత నిర్వర్తించాలని 2017 నుంచి రైజ్‌ ఇండియా అనే ఎన్‌జీఓ నిర్వహిస్తున్నాను. ఇటీవల లాక్‌డౌన్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రాసరీస్‌ ఇచ్చాను. తల్లీ, పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్‌ ఫుడ్‌ అందించాం. ఇప్పటికీ కోవిడ్‌–19 పరోక్షంగా చాలామంది జీవితాలను దెబ్బతీసింది. రైజ్‌ ఇండియా ఫౌండేషన్‌ ద్వారా వీలైనంత మంది ఉపాధి కరువైన మహిళలు నిలదొక్కుకునేలా చేయాలని ఆలోచిస్తున్నాం.

బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాలో...  
ఇదే సమయంలో యునైటెడ్‌ నేషన్స్‌తో అనుబంధంగా పనిచేసే గ్లోబల్‌ డిప్లొమాటిక్‌ కౌన్సిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక అవడం నా లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో మరింత ఉపకరిస్తుంది. ఈ సంస్థ 14 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మహిళా స్వయంసాధికారతకు పెద్దపీట వేస్తోంది. అంబాసిడర్‌గా 3 సంవత్సరాలు ఉంటాను. గ్లామర్‌ రంగాన్ని కూడా సరిగా ఉపయోగించుకుంటే మహిళలకు విభిన్న రకాల అవకాశాలు అందించే చక్కని ప్రొఫెషన్‌. ఈ రంగం మీద ఉన్న అపోహలు తొలగించి ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చే ఆలోచన ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement