
సాక్షి,మదనపల్లె సిటీ: శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి.. మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నారు మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. పేదల ఆకలిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు.
’ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే..
ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. ఈ కేంద్రాన్ని గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వాలో అమరులైన జవానుల జ్ఞాపకార్థం హెల్పింగ్‌మైండ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వాతాతలు, దివ్యాంగులు, అనాథల కడుపులు నింపుతున్నాయి. సంస్థ సభ్యులు ప్రతి రోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తారు. ప్రధానంగా ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి ఇందులో ఆహారపొట్లాలను పెడుతున్నారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్‌ల్లో భద్రపరచడం, పేదలకు అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందరూ సహకారం అందిస్తున్నారు
పేదలకు గుప్పెడు అన్నం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అందరూ సహకరిస్తున్నారు.మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రానికి అందజేయాలి.
–అబూబకర్‌సిద్దిక్, హెల్పింగ్‌మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె