ప్రేమను పంచడంలో అమ్మ తర్వాతే ఎవరైనా! కొంతమంది తల్లులు తమ పిల్లల్లాగే... ఇతరులను సైతం ప్రేమగా చూసుకుంటుంటారు. కడుపున జన్మించక పోయినప్పటికీ ఆ తల్లి చూపే ప్రేమాభిమానాలకు అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే బిందు రమాకాంత్ ఘట్ పాండే. బిందుని తన పిల్లలేగాక, వేలాదిమంది ‘అమ్మ’ అని అప్యాయంగా పిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెడుతూ ఎందరికో అమ్మగా మారింది బిందు రమాకాంత్ ఘట్‌పాండే. అంతమందికి అమ్మగా మారిన బిందు గురించి ఆమె మాటల్లోనే....
‘‘రాజస్థాన్‌లోని ఝుంఝునులో పుట్టాను. ముగ్గురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు ఉన్న పెద్ద కుటుంబం మాది. నాన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ప్రతి రెండేళ్లకోసారి నాన్నకు బదిలీలు జరిగేవి. దీంతో చాలా భాషలు పరిచయం అయ్యాయి. పంజాబీ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలు చక్కగా మాట్లాడగలను. నా పెళ్లి అయిన తరువాత మా ఆయనతో కలిసి భోపాల్‌లో స్థిరపడ్డాను. నాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి కోల్‌కతా ఐఐఎమ్ టాపర్. అమ్మాయి దుబాయ్‌లో రేడియో జాకీ. యాంకర్‌గా పనిచేస్తోంది. పిల్లల బాధ్యతలు తీరాక నాకు చాలా ఖాళీ సమయం దొరికింది. ఈ సమయంలో సమాజానికి ఏదైనా మంచి చేయాలనిపించింది.
ఏం చేయాలా... అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు టీవీలో ‘గ్రాండ్ మదర్స్ కిచెన్’ గురించి చూశాను. అప్పుడే నాకు కూడా ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. మా ఆయనకు చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. వెంటనే ఇంట్లో భోజనం తయారు చేసి కారులో పెట్టుకుని రోడ్డుమీదకు ఆకలితో ఉన్న వారు కనిపిస్తే వారికి భోజనం పార్శిల్ ఇచ్చేదాన్ని. వాళ్లు తిన్న తరవాత చెప్పే కృతజ్ఞతలతో నాకు కడుపు నిండిపోయేది. అలాగే ఉదయాన్నే పాతిక లీటర్ల గంజి తయారు చేసి వీధికుక్కలకు పోసేదాన్ని. ఆ తరువాత ‘ఉత్కర్షిణి’ పేరిట కిచెన్‌ను ఏర్పాటు చేశాను. ప్రస్తుతం ఈ ఉత్కర్షిణి వందలాది మంది ఆకలి తీరుస్తోంది.
రోజుకో మెను...
కిచెన్‌లో ఎంతో పరిశుభ్రంగా భోజనం వండిస్తాను. తయారీ అంతా నా పర్యవేక్షణలో జరుగుతుంది. రోజుకొక మెను పెడుతున్నాను. ఒక రోజు పప్పు, కూరలు, అన్నం పెడితే.. మరుసటిరోజు రాజ్మా, అన్నం, ఇంకోరోజు పూరీ, కూరలతో వడ్డిస్తున్నాం. పప్పు, అన్నం అయితే ప్లేటు ఐదు రూపాయలకు, రసగుల్లా, హల్వా పూరీ ఉన్న రోజు ప్లేటు ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నాం. మా భోజనం తినేవారి సంఖ్య పెరగడం... ‘‘భోజనం బావుంది, కానీ స్వీట్ ఉంటే బావుంటుంది’’ అని కస్టమర్లు చెప్పడంతో తొలుత హల్వా పెట్టడం మొదలుపెట్టాము. ఇప్పుడు రసగుల్లా కూడా పెడుతున్నాం.
ఆకలి తిరడానికి మాత్రమే...
ఉత్కర్షిణి కిచెన్‌లో తయారైన భోజనానికి ఎలాంటి నిబంధనలు లేవు. నిరుపేదల నుంచి ఎవరైనా తినవచ్చు. మా భోజనం తినేవారిలో పారిశుధ్య కార్మికులు, రిక్షా నడిపేవాళ్లు, నర్సులు, డాక్టర్లు, విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎవరికి ఆకలి వేసినా తిని వెళ్లాల్సిందే తప్ప.. ఇంటికి ప్యాక్ చేసి ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులు మందులు వేసుకునే ముందు ఏదైనా తినాలని చెప్పి సమోసా, బిస్కెట్లు తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే వీరు సైతం తినేలా మా కిచెన్ ఆహార పదార్థాలు అందిస్తోంది.
అలా వందలమందికి..
నేను పెడుతోన్న భోజనానికి డిమాండ్ పెరగడంతో వంటవాళ్లను పెట్టుకుని వండించడం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఆసుపత్రి, దానిపక్కన స్టూడెంట్ క్యాంపస్ ఉంది. అక్కడ భోజనం ప్లేటు ఐదు రూపాయలకు ఇస్తున్నాను. చాలామంది విద్యార్థులు వచ్చి తింటున్నారు. అలా నా దగ్గర భోజనం చేయడానికి వచ్చేవారు నన్ను ‘‘అమ్మ లేదా మా’’ అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా ఉత్కర్షిణి కిచెన్ కుటుంబం రోజురోజుకి పెరిగిపోతోంది. అందుకే త్వరలో భోపాల్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా నా సేవలను విస్తరించబోతున్నాను. మరింత మంది ఆకలి తీర్చడమే నా లక్ష్యం’’అని చెప్పింది బిందు రమాకాంత్ ఘట్‌పాండే.
Comments
Please login to add a commentAdd a comment