రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ నవంబర్ 1న తన 60వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 3000 మంది పిల్లల మధ్య నీతా అంబానీ ఈ వేడుకను జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 1.4 లక్షల మందికి ‘అన్నసేవ’ ద్వారా అన్నదానం చేశారు. ఇందులో దాదాపు 75 వేల మందికి వండిన ఆహారాన్ని అందించగా, సుమారు 65 వేల మందికి ముడి రేషన్ పంపిణీ చేశారు.
ప్రధానంగా పిల్లలకు, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు, రోజు కూలీలకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఆహారం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ, విజయవాడ నగరాల్లో రిలయన్స్ ఫౌండేషన్ అన్నసేవ కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 600 మందికి కిట్ లను అందించారు.
కరోనా మహమ్మారి సమయంలోనూ అన్నసేవ పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. విద్య, మహిళా సాధికారత, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాలలో నీతా అంబానీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment