కాలిఫోర్నియా: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. ఆకలిగా ఉన్నవారికి రెండు ముద్దలు అన్నం పెడితే చాలు వారి కళ్లలో కనిపించే ఆనందం కోట్లు పెట్టి కొన్నా దొరకదు. అలాంటి బృహత్కార్యాన్నే తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా(టాస్క్) చేపట్టింది. కరోనాలాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలిచేందుకు టాస్క్ వర్చువల్ ఫుడ్ పేరిట ఒక డ్రైవ్ చేపట్టింది. దాతలు, టాస్క్ కార్యకర్తలు కొండంత నిండు మనసుతో ఇచ్చిన 5001.95 డాలర్లతో 18,007పౌండ్ల ఆహారాన్ని సేకరించి 15,005 ఆహార పాకెట్లను తయారుచేసి అన్నార్తులకి అందించారు. తాము అనుకున్న దాని కంటే 200 శాతం ఎక్కువగా విరాళాలు సేకరించగలిగామని టాస్క్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని టాస్క్ ప్రెసిడెంట్ శీలం రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ విరాళం మొత్తాన్ని నిరంతరం అన్నదానం చేసే స్వచ్చంధ సంస్థ సెకండ్ హార్వెస్ట్ ఫుడ్ బ్యాంక్ ఆరెంజ్ కంట్రీకి టాస్క్ సభ్యులు రామకృష్ణ రెడ్డి, కేతిరెడ్డి అమరేందర్‌రెడ్డి, కిశోర్ తంగిరాల వీరితో పాటు టాస్క్ సభ్యులు అందజేశారు. టాస్క్ 2020 ఫుడ్ డ్రైవ్ కాలిఫోర్నియాలో నిర్వహించిన ఫుడ్‌డ్రైవ్‌లో టాప్ 10లో నిలవడం ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి టాస్క్ అధ్యక్షులు శీలం రామకృష్ణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment