సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు.
కంప్యూటర్ ఇంజనీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్,. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలు అనాథాశ్రయాలను ప్రారంభించిన ఆమె.. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందింస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడుతున్నారు.
సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లికి దక్కిన గౌరవంపై మురిసిపోతూ ఆమె కూతురు, యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషన్‌ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని అన్నారు. సమాజం కోసం చేసిన సేవకు ఆమెకీ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు
‘25 సంవత్సరాలుగా స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలలు నిర్వహిస్తుంది. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. ఎలా జీవించాలో తనను చూసి నేర్చకున్నాను. గుర్తింపుకోసం అమ్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ నిన్న దక్కిన గుర్తింపు ప్రత్యేకం. మా తల్లిదండ్రులు మాకు(తమ్ముడు, నాకు) కష్టపడి పనిచేయడం, మానవత్వం చూపడం, నిస్వార్థంగా జీవించడం వంటి ఎన్నో విలువలు నేర్పించారు’ అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు.
అక్షతమూర్తి పోస్టుపై అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి ఘనతను కొనియాడుతూ.. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ క్లాప్ ఎమోజీని షేర్ చేశారు. కాగా ఇప్పటికే సుధామూర్తి అందించిన సామాజిక కార్యక్రమాలకుగానూ 2006లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment