సాక్షి, హైదరాబాద్ : 2018 కేరళలో వరదల విల యం.. జనాన్ని కాపాడటంలో అధికార యంత్రాంగం నిమగ్నం.. మరి మూగజీవాల సంగతో?.. అవి వరదలో చిక్కి విలవిల్లాడుతున్నాయని తెలిసి హైదరాబాద్ నుంచి పదిమంది బయల్దేరారు. జేబులు తడుముకుంటే ఓ 90 వేలు పోగయ్యాయి. మరో రూ.30 వేలు విరాళాలుగా పట్టుకుని.. పది హేను రోజులు అక్కడే మకాం వేసి చెట్టూపుట్టా తిరిగి వెయ్యి జంతువులను కాపాడారు.
మొన్న..: హైదరాబాద్‌ను ముంచిన వరదలు.. మళ్లీ ఆ పది మందే రెండ్రోజులపాటు రాత్రింబవళ్లు మోకాల్లోతు నీళ్లలో నగరమంతా తిరిగి వందలాది జంతువులకు ఊపిరిలూదారు.
ఇటీవల..: చందానగర్‌లో 70 అడుగుల లోతైన బోరుబావిలో పిల్లికూన పడిపోయింది. ఈ పదిమందీ 34 గంటలు శ్రమించి బయటకుతీశారు.ఇలా ఈ పది మంది యువకులు ఇప్పటివరకు కాపాడిన జంతువులు, పక్షుల సంఖ్య 70 వేలపైమాటే. యువతలో జీవకారుణ్యాన్ని నయా ట్రెండ్‌గా మార్చే ప్రయత్నంలో ఉన్న వీరంతా ఉన్నత విద్యావంతులే. మూగజీవాలకు నేస్తాలయ్యేందుకు బంగారంలాంటి జాబ్‌లనూ వదిలేసుకున్నారు. బోరుబావులు, వ్యవసాయబావులు, నాలాలు, కాలువల్లో పడ్డ వేలసంఖ్యలో జంతువులను రక్షించారు. మాంజా దారాలు, చెట్టు సందులు, కిటికీల్లో ఇరుక్కున్న, కుక్కల దాడిలో గాయపడిన పక్షులను కాపాడారు. ఒక్కరితో మొదలై హైదరాబాద్ కేంద్రంగా ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’గా రూపాంతరం చెందింది. ప్రమాదంలో ఉన్న మూగజీవాలను కాపాడటంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ప్రదీప్‌నాయర్.. తనలాంటి ఆలోచనలే కలిగిన మరికొందరితో కలిసి దీన్ని ఏర్పాటుచేశారు.
ప్రతి నెలా రూ.లక్షపైనే ఖర్చు
కొద్దిరోజుల కిందట నగరానికి 250 కి.మీ. దూరంలోని నిజామాబాద్ జిల్లా నుంచి రాత్రి ఫోన్‌కాల్.. పెద్దబావిలో కుక్క పడిందని. అప్పటికే మూడ్రోజులు కావటంతో దాని ఆరోగ్యం క్షీణించింది. ఈ బృందం కారు అద్దెకు తీసుకుని వెళ్లి కుక్కను రక్షించింది. రూ.6 వేలు ఖర్చయ్యాయి. దగ్గరైతే టూవీలర్లు, దూరమైతే అద్దె కార్లు.. ప్రతి టూర్‌లో ఖర్చే. వీరిలో ఒక్కరికే సొంత కారుంది. సొంత డబ్బులతోనే జంతువులను కాపాడేందుకు అవసరమైన పరికరాలు కొన్నారు. ట్రాలీతో కూడిన జీపులాంటిది జంతువుల రెస్క్యూ ఆపరేషన్‌కు బాగా ఉపయోగడుతుంది. కానీ, సాయం చేసేవారు లేక సమకూర్చుకోలేదు. రెస్క్యూల ఖర్చు ప్రతినెలా కాస్త అటూఇటూగా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. ఇదంతా జేబు నుంచే పెట్టుకుంటున్నారు.
కేరళ వరదలతో పెరిగిన పట్టుదల
కేరళ వరదల్లో చిక్కుకున్న మూగజీవాలను రక్షించటంలో కీలకంగా వ్యవహరించి అక్కడి ప్రభుత్వ ప్రశంసలందుకుందీ బృందం. 15 రోజులు అక్కడే మకాంవేసి రోజుకు ఐదారువేల చొప్పున పడవ ఖర్చులు భరించి మరీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. 1,200 మూగజీవాలను రక్షించారు. వీటన్నింటికీ అన్ని రోజులూ ఆహారం అందించారు. తల్లి నుంచి దూరమై వరదల్లో కొట్టుకుపోతున్న ఓ ఏనుగునూ కాపాడారు. అలప్పీ ప్రాంతంలోని 20 గ్రామాల్లో వరదల్లో కొట్టుకొచ్చి ఇళ్లలో నక్కిన పాములను పట్టి అటు వాటిని, వాటి నుంచి జనాన్ని కాపాడారు.
మూగజీవాల రక్షణ..విద్యార్థులకు శిక్షణ
నగరం చుట్టూ ఉన్న చెరువుల్లో చేరిన కాలుష్య వ్యర్థాలను తొలగించే బాధ్యతనూ ఈ బృందం భుజాన వేసుకుంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, అమీన్‌పూర్ లేక్, ఫాక్స్‌సాగర్ సహా పలు చెరువుల వద్ద ప్లాస్టిక్, ఇతర రసాయన వ్యర్థాలు, గుర్రపుడెక్క తొలగించి అటు జలచరాలకు ఇటు అక్కడకు వచ్చే పక్షులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వలస పక్షులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిని సంరక్షిస్తున్నారు. విద్యార్థులను సమీకరించి జంతు సంరక్షణపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిలో జీవకారుణ్యాన్ని పెంచుతున్నారు. ఖాళీ సమయాల్లో వృథాగా తిరగకుండా వారిని జంతువులను కాపాడే పనిలో బిజీగా మారుస్తున్నారు. ఏటా వేసవిలో దాహంతో అల్లాడే జంతువుల కోసం నీటి సాసర్లు, ఊరపిచ్చుకలను తిరిగి రప్పించేందుకు వందల సంఖ్యలో గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
జనంలో జీవకారుణ్యం పెంచేందుకే..
బీటెక్ కాగానే మరో ఇద్దరితో కలిసి సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టా. మంచి ఆర్డర్స్, భారీ ఆదాయం. కానీ ప్రమాదంలో ఉన్న జంతువులను కాపాడాలనే నా ఆశయం పక్కదారి పడుతోందనిపించింది. వెంటనే సంస్థను వదిలేసి నాకు నచ్చిన రూట్‌లోకి వచ్చా. నాతో కలిసి యానిమల్ కన్జర్వేషన్ యాక్టివిటీలో ఉన్న సంతోషిని పెళ్లి చేసుకున్నా. సంజీవ్‌శర్మ, అమర్ కూడా మంచి ఉద్యోగాలను వదులుకుని మూగజీవాల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నేటి యువతలో జంతువులపై ప్రేమను పెంచాలన్నదే మా సంకల్పం. అనిరుధ్ సహదేవ్, ప్రభు, మెస్సీ, రాఘవ్, బాలాజీ, మనీష్ చాలాకాలంగా మాతో సాగుతున్నారు.
– ప్రదీప్‌నాయర్, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు
ఆ పదిమంది..
మూగజీవాలంటే అమితమైన ప్రేమ గల ప్రదీప్‌నాయర్.. వాటి కోసం సమయం కేటాయించలేకపోతున్నాననే భావనతో సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీనే మూసేశారు. ఇంటి వద్దే వెబ్ డిజైన్ చేస్తూ ఇప్పుడు మరింత ఎక్కువ సమయాన్ని మూగజీవాల రక్షణకు కేటాయిస్తున్నారు. తనలాంటి అభిరుచే కలిగిన సంతోషిని పెళ్లి చేసుకున్నారు. ఈమె కూడా ‘వర్క్ ఫ్రమ్ హోం’చేస్తూనే మిగతా సమయంలో భర్తకు చేదోడుగా ఉంటారు. బహుళజాతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే బడా ఎమ్మెన్సీలో కీలక ఉద్యోగి అయిన సంజీవ్‌వర్మ.. జంతువులపై ప్రేమతో ఉద్యోగాన్ని వదులుకున్నారు.
ఇంట్లోనే కన్సల్టెన్సీ తరహా సేవలందిస్తూ, ఎప్పుడంటే అప్పుడు మూగజీవాల రక్షణకు పనిచేస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో భారీ ఐటీ ప్రాజెక్టులు చేపట్టే అమర్ సైతం జంతువులపై ప్రేమతో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఐటీ కన్సల్టెన్సీ పెట్టుకున్నారు. వీరంతా పక్షులు, జంతువులపై ప్రేమతో పెద్ద కొలువులు వదిలి.. చిన్నగా ఉపాధి పొందుతూ.. అలా వచ్చిన డబ్బులనే వాటి సంరక్షణకు వెచ్చిస్తున్నారు. ఇంకా.. అనిరుధ్ సహదేవ్, మనీష్, ప్రభు, మెస్సీ, రాఘవ్, బాలాజీ.. వీరంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూనే జంతురక్షణకు సమయం కేటాయిస్తుంటారు. వీరి ధ్యాసంతా మూగజీవాలపైనే. ఫోన్ మోగితే చాలు అర్ధరాత్రయినా లేచి పరుగుపెట్టడమే. డబ్బులకు కటకట ఉన్నా, కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చినా ముందుకే సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment