
పేదల సేవలో 15 ఏళ్లుగా అన్నదానాలు, కౌన్సిలింగ్ కేంద్రాలు
ప్రజల మన్ననలు పొందుతున్న మహ్మద్ నజీబ్
మానవ సేవే మాధవ సేవ.. అనే నానుడిని ఒంటబట్టించుకున్నారు.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీబ్. సరిగ్గా అదే తలంపుతో గత 18 ఏళ్లుగా పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ.. నిరుపేదలకు, వలస కూలీలకు సేవలందిస్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ద్వారా పేదల కుటుంబాల్లో తలెత్తే తగాదాలను పరిష్కరిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు వలస కూలీలు, నిరుపేదలకు వైద్య సహాయం, నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మహ్మద్ నజీబ్ షేక్‌పేట ఫ్రెండ్స్ కాలనీలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం వంద కిలోల బియ్యంతో వంట చేస్తూ లేబర్ అడ్డాలు, ఆస్పత్రుల వద్ద భోజన ప్యాకెట్లు అందించారు. – గోల్కొండ
నజీబ్ చిన్ననాటి స్నేహితులతో కలిసి గోల్కొండలోని షేక్ పేటలో నిరంతరాయంగా నిరుపేదలకు సేవలందిస్తున్నాడు మహ్మద్ నజీబ్. స్థానిక ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను గుర్తిస్తూ.. తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. స్థానికులకు, పేదలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా లేబర్ అడ్డాల వద్ద ఒక్కపూట భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాడు. కాలనీలో ప్రత్యేకంగా ఓ వంట శాలను సైతం ఏర్పాటు చేశాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం భోజన ప్యాకెట్లను అందించాడు. పలువురు బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించాడు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సహాయంతో స్థానికులకు వైద్య సేవలను అందించాడు.

కుటుంబ కలహాలు చక్కబెడుతూ..
టోలిచౌకీలోని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రధాన కార్యాలయంలో స్థానికుల కుటుంబ తగాదాలు, భార్యా భర్తల కలహాలకు పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 15 యేళ్లగా చిన్న చిన్న తగాదాలతో విడాకులు తీసుకోడానికి తనవద్దకు వచి్చన వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వారి కలహాలకు పరిష్కారం చూపుతున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 350 మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించి, వారిని ఏకం చేస్తున్నాడు. మరోవైపు నిరుపేద విద్యార్థులకు ఆర్గనైజేషన్ ద్వారా తామున్నామంటూ అండగా ఉంటూ ఫీజులకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. చదువు మధ్యలో వదిలేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి యేటా తాము 8 మంది నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని, పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునేలా వారికి అండగా నిలబడుతున్నాడు. ప్రస్తుతం ఆర్గనైజేషన్ కార్యకలాపాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తృతం చేస్తున్నట్లు నజీబ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment