జ్యోతి వెలిగిస్తున్న దత్తాత్రేయ. చిత్రంలో కిషన్‌రెడ్డి
హిమాయత్‌నగర్: దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) భాగంగా హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ కాలేజీలో గోల్కొండ సాహితీ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రజల్లో స్వధర్మ, స్వాభిమాన, స్వరాజ్య భావాలను పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో సమాచార భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్కొండ సాహితీ మహోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ తరహా ఉత్సవాలు ప్రజల్లో ఉత్సాహం నింపుతాయని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
విస్మరణకు గురైన వీరుల యాదిలో..
భారత స్వతంత్ర పోరాటంలో విస్మరణకు గురైన వీరులను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటిషర్లను ధైర్యంగా ఎదుర్కొన్న వనవాసీ వీరుడు బిర్సా ముండా జయంతిని జాతీయ గిరిజన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో కూడా కుమురంభీం, రాంజీ గోండు, అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన వీరుల గాథలను పరిచయం చేసేందుకు గిరిజన మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం రూ.15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాగా, డాక్టర్ రతన్ శార్దా రచించిన స్వరాజ్య సాధనలో ఆర్‌ఎస్‌ఎస్, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రచించిన నిజాం రూల్ అన్‌మాస్క్‌డ్, డాక్టర్ బి.సారంగపాణి రచించిన ఆంగ్లేయుల ఏలుబడి.. పుస్తకాలను వారు ఆవిష్కరించారు.
ఆకట్టుకున్న స్వాగత తోరణం
కేశవ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో రెండ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన స్వాగత తోరణం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో భారత స్వంతంత్య్ర సమరయోధుల చిత్రాలు, నిజాం సంకెళ్ల నుంచి తెలంగాణను కాపాడటానికి పాటుపడ్డ కవులు, కళాకారులు, యోధుల చిత్రాలు, వారి సంక్షిప్త జీవిత చరిత్ర ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment