స్టాక్‌మార్కెట్ అంటేనే లాభాలకోసం ఎంచుకునే ఒక మార్గం. షేర్లు లేదా ఆఫ్షన్స్ కొనుగోలు చేసినా విక్రయించినా.. ఏదైనాసరే లాభాలే ప్రధానం. అయితే లాభం ఉండదనీ, మనం పెట్టిన డబ్బు తిరిగిరాదని తెలిసీ ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారా..! కానీ అందరూ ప్రతిసారి స్వలాభం కోసమే ఆలోచించరు. కాసింత సామాజిక స్పృహ ఉన్నవాళ్లు మాత్రం రూపాయి రాకపోయినా సమాజానికి ఖర్చు చేసేవాళ్లున్నారు. అలాంటి వారికోసం స్టాక్‌మార్కెట్‌లో కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అదే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’. అందులో షేర్లు కొనడం ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు. దానిద్వారా ఇటీవల జెరోధా సంస్థ కోటి రూపాయలు పెట్టింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్‌కి వెళ్లొచ్చు. బెంగళూరులోని శ్రీ గురువాయూరప్పన్ భజన్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తుంటుంది. కొత్తగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పదివేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల్లో చేరేలా సహకరించేందుకు ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. దానికి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా నిధులు అవసరం అయ్యాయి. దాంతో ఆ సంస్థ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదుచేసుకుంది. ఎవరినీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. జెరోధా సంస్థ కోటి రూపాయలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా రూ.30లక్షలు, మరో ఇద్దరు చెరో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు.
ప్రత్యేకంగా ఎందుకంటే..
ప్రత్యక్షంగా దాతలను అభ్యర్థించో, సోషల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తమ సేవలకు అవసరమైన నిధులను సేకరిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎందుకనే అనుమానం రావొచ్చు. పైన తెలిపిన కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చు, ఆశించిన మొత్తం అందకపోవచ్చు. చాలామంది దాతలకు తాము ఇచ్చే డబ్బు దుర్వినియోగం అవుతుందేమోననే సందేహం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ని ఎంచుకుంటున్నారు. ఇది దాతలకీ స్వచ్ఛంద సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తుంది.
తొలి సంస్థ ‘ఉన్నతి ఫౌండేషన్’..
మన దేశంలో 2019-20 సంవత్సరపు బడ్జెట్‌లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన తెచ్చారు. సామాజిక అభివృద్ధికి పాటుపడే సంస్థలకు పెట్టుబడి మార్కెట్ అందుబాటులో ఉండాలన్నదే దీని ఆశయం. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. దీని ద్వారా నిధులు పొందిన తొలి సంస్థ ఉన్నతి ఫౌండేషన్. లాభాపేక్ష లేని సంస్థలూ(ఎన్‌పీఓ), లాభాపేక్ష ఉన్న సామాజిక సంస్థలూ(ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్) ఇందులో నమోదుచేసుకోవచ్చు. పేదరికం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు... తదితర రంగాల్లో సేవలు అందించే సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బు ఇచ్చిన దాతల ఖాతాల్లో జీరోకూపన్ జీరో ప్రిన్సిపల్ పేరుతో బాండ్లను జమచేస్తారు. అవి రికార్డు కోసమే తప్ప మరే లాభమూ ఉండదు. వ్యాపార సంస్థలు ఐపీఓకి వెళ్లినట్లే సేవాసంస్థలు నిధుల సేకరణకు వెళ్తాయన్న మాట.
లాభాలు ఇవే..
ఈ విధానం వల్ల అటు దాతలకీ ఇటు లబ్ధిదారులైన సంస్థలకీ ఎన్నో లాభాలున్నాయి.
- తెలిసిన దాతలనే మళ్లీ విరాళాల కోసం అడగలేక ఇబ్బంది పడే ఎన్జీఓలకు కొత్త దాతలు లభిస్తారు.
- బహిరంగంగా జరిగే లావాదేవీలు కాబట్టి ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు.
- డబ్బు వినియోగంలో ఎక్కడికక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి.
- ఏ ప్రయోజనానికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి, గడువు లోపల ఖర్చు పెట్టాలి, ఏటా ఆడిట్ నివేదికలు సమర్పించాలి... కాబట్టి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి.
- దాతలు తామిచ్చిన ప్రతి రూపాయీ సద్వినియోగమైందని నిర్ధారించుకోవచ్చు.
- సామాజిక మార్పులో భాగస్వాములమయ్యామన్న తృప్తి ఉంటుంది.
- స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల పట్ల నమ్మకమూ పెరుగుతుంది.
- ఆయా స్వచ్ఛంద సంస్థలూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి.
- నిధులకు ఇబ్బంది ఉండదు కాబట్టి సేవల పరిధినీ విస్తరించుకోవచ్చు.
ఇదీ చదవండి: 2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే!
అయితే యాభై లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాతలు కనిష్ఠంగా పదివేల నుంచి విరాళం ఇవ్వచ్చు. దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment