
పేదలకు అన్నదానం చేస్తున్న జెనిటర్స్ సంస్థ సభ్యులు
నంద్యాల విద్య: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు..భుజించే ముందు కొందరు దైవాన్ని సైతం గుర్తు చేసుకుంటారు. అయితే అభాగ్యులు చాలా మంది ఒక పూట తింటూ మరోపూట పస్తులతో కాలం గడుపుతున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు నంద్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. తన వద్ద ఆర్థిక స్తోమత లేకపోవడంతో పెళ్లిళ్లు, బర్త్‌డే ఫంక్షన్లు, శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను నేలపాలు చేయకుండా సేకరిస్తున్నాడు. వాటిని పేదలకు అందిస్తూ ఆప్తుడిగా నిలిచాడు.
నంద్యాల పట్టణంలోని ఓ ప్రముఖ ప్యాక్టరీలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్న జాన్.. కొందరు సభ్యులతో కలిసి జెనిటర్స్, జెడ్జిస్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వేడుకల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు సేకరించి నంద్యాల, చుట్టుపక్కల గ్రామాల్లో ఆకలితో అలమటిస్తున్న వారికి పంచుతున్నాడు. ఈ సేవా కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా చేపట్టేందుకు ప్రజలందరినీ చైతన్య పరిచాడు. మిగిలిన ఆహారాన్ని పారవేయకుండా తన సెల్ నంబర్ 6301080873కు సమాచారం ఇవ్వాలని ప్రచారం చేయిస్తున్నాడు. ఆహార పదార్థాలను తీసుకు వెళ్లడానికి శేషు అనే దాత ఆటోను సమకూర్చాడు. ఎవరైనా.. ఎప్పుడైనా ఫోన్‌చేసి ఆహారపదార్థాలు మిగిలి ఉన్నాయని సమాచారాన్ని అందిస్తే వెంటనే అక్కడికి వెళ్లి సేకరిస్తారు.
సంస్థ కార్యదర్శి వెంకటేశ్వర్లు, మిత్రులు ఉసేన్‌వలీ, రాముడు, రాజ్‌కుమార్.. స్వచ్ఛందంగా ముందుకువచ్చి సేవలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రాంతాలేకాకుండా పొరుగు జిల్లాలైన ప్రకాశం, గుంటూరు జిల్లాలో జాన్.. తన మిత్రుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కేవలం ఆహార పదార్థాలే కాకుండా దాతల సహకారంతో వారివద్ద ఉన్న దుస్తులను సేకరించి నిరుపేదలకు, నిరాశ్రయులకు అందజేస్తున్నాడు. జాన్ సేవలను గుర్తించిన ప్రభుత్వం.. నంద్యాల మునిసిపల్ బ్రాండ్ అంబాసిడర్‌గా 2018 స్వచ్ఛసర్వేక్షణ్ జ్ఞాపికను అందజేసింది. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు జాన్‌ను సత్కరించాయి.
మరికొన్ని సేవా కార్యక్రమాలు..
♦ వేసవికాలంలో నల్లమల అటవీ ప్రాంతంలోని మూగజీవులకు ఆకలి, దాహం తీరుస్తున్నారు. ఇందుకు నంద్యాల పట్టణంలోని దాతల సహకారం తీసుకుంటున్నారు.
♦ గర్భిణిలు, వికలాంగులు అపద సమయాల్లో ఫోన్ చేస్తే వెంటనే వారిని ఆటోలో ఆసుపత్రిలో ఉచితంగా చేరవేస్తున్నారు.
సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తా
రైల్వే, బస్‌స్టేషన్ల వద్ద చాలామంది ఆకలితో అలమటించడాన్ని చూశాను. కొంత మంది నోరు తెరిచి అడుగుతారు. మరికొంత మంది అడగలేక అలాగే ఉండిపోతారు. ఇలాంటి వారికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఎవరైనా ఫోన్ చేసి ఆహారం ఉందని చెబితే వెంటనే స్పందిస్తాను. పేదల ఆకలి తీర్చడంలో ఉన్న తృప్తి ఎక్కడా దొరకదు. – ఎం.జాన్, జెనిటర్స్ వ్యవస్థాపకుడు
Comments
Please login to add a commentAdd a comment