ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌ ముందంజ | Hyderabad Is In Lead For Employment Creation | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌ ముందంజ

Published Tue, Jul 27 2021 1:28 AM | Last Updated on Tue, Jul 27 2021 1:28 AM

Hyderabad Is In Lead For Employment Creation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రోపాలిటన్‌ నగరాలు ముందంజలో నిలవనున్నాయి. కోవిడ్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రభావం నుంచి భారత్‌ క్రమంగా కోలుకుంటున్న దశలో, వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన యువతకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న కరోనా ఇబ్బందులకు టీకా కార్యక్రమం ద్వారా చెక్‌ పెట్టే ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఊపందుకున్నాయి. అత్యధిక శాతం ప్రజలకు టీకాలు వేయడంలో మెట్రో నగరాలు మరింత పురోగతిని సాధిస్తున్నాయి. ఇలా ఈ ప్రక్రియలో ముందంజలో ఉన్న హైదరాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చండీగఢ్‌లు ఉద్యోగాల కల్పనలో సైతం దేశంలోనే అగ్ర భాగాన నిలవనున్నట్టు స్టాఫింగ్‌ సంస్థ ‘టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌’తాజా సర్వే వెల్లడించింది. 

ఆర్థిక రంగం కుదుటపడేందుకు దోహదం
కరోనా సెకండ్‌ వేవ్‌ దుష్పరిణామాల నుంచి బయటపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం కుదుటపడేందుకు.. వ్యాపార, వాణిజ్యాలు మెరుగు కావడం, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో దోహదం చేయనున్నట్టు అధ్యయనం అంచనా వేసింది. వివిధ రంగాలకు సంబంధించిన వాణిజ్య అవసరాలు, వ్యాపారాల పురోగతిని బట్టి ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు తెలిపింది. పర్మినెంట్‌ ఉద్యోగాలు–నైపుణ్యంతో కూడిన తాత్కాలిక ఉద్యోగాల (స్కిల్డ్‌ టెంపరరీ జాబ్స్‌) మధ్యనున్న వేతన వ్యత్యాసాలు తగ్గిపోతాయని పేర్కొంది. అమ్మకాలు (సేల్స్‌), సాంకేతికత (టెక్నాలజీ) రంగాల్లో, మరి ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక (డీప్‌ టెక్‌) నైపుణ్యాలకు ప్రధాన నగరాల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యాపారాలు నిలదొక్కుకునేలా పురోగతి సాధనకు గాను కంపెనీలు ఈ అత్యాధునిక సాంకేతిక నిపుణుల కోసం అన్వేషిస్తున్నట్టుగా ఈ పరిశీలనలో వెల్లడైంది. ఈ ఏడాదిలో మొత్తం 618 కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా సంస్థ ఈ అంచనాలకు వచ్చినట్లు ‘టీమ్‌ లీజ్‌’వైస్‌ ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకులు రితుపర్ణ చక్రవర్తి తెలిపారు.

సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు..
► కరోనా మహమ్మారి ప్రభావం ఐటీ, ఈ–కామర్స్, హెల్త్‌కేర్, ఎడ్‌ టెక్‌ తదితర రంగాలపై ఎక్కువగా పడలేదు
► బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, టెలికాం, తయారీ, ఇంజనీరింగ్‌ రంగాలు త్వరగానే కోలుకుంటున్నాయి
► వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) అమ్మకాల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టొచ్చు.
► రిటైల్, జీవనశైలి (లైఫ్‌స్టైల్‌) ఆతిథ్యం వంటి రంగాలు కోలుకునేందుకు సుదీర్ఘ కాలం పట్టే అవకాశాలున్నాయి.
► ‘డీప్‌ టెక్‌’లో సూపర్‌ స్పెషలైజేషన్‌ నైపుణ్యాలున్న వారికి అత్యధిక వేతనాలు లభించే అవకాశం ఉంది.
► వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్, వాహన.. నిర్మాణ రంగాలకు, రియల్‌ ఎస్టేట్, ఈ–కామర్స్, టెక్‌ స్టార్టప్‌లు, పారిశ్రామిక తయారీ, ఆర్థిక రంగాలకు ఆదరణ 
పెరుగుతోంది.

తెలంగాణలో పెరుగుతున్న ఉద్యోగావకాశాలు
ప్రజల్లో కరోనా భయం తగ్గుతుండడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతున్న క్రమంలో మెరుగైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. వివిధ రంగాలకు సంబంధించిన వాణిజ్య, వ్యాపారాలు కోలుకుంటున్న నేపథ్యంలో ఆటోమోటివ్, బ్యాంకింగ్, తయారీ, ఫార్మా, ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. ప్రధానంగా విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్టప్‌ సంస్థలు ఎక్కువగా రావడం శుభ పరిణామం. అంతర్జాతీయ కంపెనీలు, పెద్ద పెద్ద సంస్థలు సైతం తెలంగాణకు వస్తుండడంతో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి.   
 – డాక్టర్‌ బి.అపర్ణ రెడ్డి, హెచ్‌ఆర్‌ నిపుణురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement