ఉపాధి కల్పనలో ఐటీ రంగం టాప్...
బెంగళూరు: దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) మించి ఐటీ కంపెనీలు ఉపాధి కల్పిస్తున్నాయని ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పారు. ఐటీ సంస్థలు 32 లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, ఏటా అదనంగా రెండు లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతోందని ఆయన తెలిపారు. తయారీ రంగానికి చైనా ప్రసిద్ధి చెందినట్లే .. ఐటీకి కేంద్రంగా భారత్ ఎదిగిందని మూర్తి పేర్కొన్నారు. కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ రంగంలో వచ్చే ప్రతి ఒక్క ఉద్యోగానికి పరోక్షంగా మరో మూడు ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందని మూర్తి పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజాలు భారీ ఆదాయాలతో కల్పించినన్ని ఉద్యోగాలు.. వందేళ్ల చరిత్రలో మరే ఇతర కంపెనీ కూడా కల్పించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఈ ఉద్యోగాలు దేశీ ఎకానమీని కూడా గణనీయంగా మార్చేశాయి. వీటి తోడ్పాటుతో నేడు మన యువత ఖరీదైన వాహనాలు, గృహాలు కొనుక్కోగలుగుతున్నారు. సూపర్‌మార్కెట్లలో షాపింగ్ చేస్తున్నారు’ అని మూర్తి వివరించారు.
మూడు వందల ఏళ్లలో తొలిసారిగా ఐటీ ఊతంతోనే భారత్ అంతర్జాతీయ వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగిందని చెప్పారు. ‘ఇప్పుడు ఏ సంపన్న దేశానికెళ్లినా భారత్‌కి ప్రత్యేక గౌరవం ఉంది. సాఫ్ట్‌వేర్ పరిశ్రమే ఇందుకు కారణం. యావత్‌ప్రపంచానికి ఫ్యాక్టరీగా చైనా ఎలాగైతే పేరు పొందిందో.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విషయంలో భారత్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంది’ అని మూర్తి పేర్కొన్నారు. మరోవైపు, రాబోయే ఐదేళ్లలో దేశీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమ 12-14 శాతం మేర వృద్ధి నమోదు చేయగలదని మూర్తి చెప్పారు. అటు కంపెనీలు సైన్స్, టెక్నాలజీపై కూడా దృష్టి సారించాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బయోకాన్ సంస్థ చీఫ్ కిరణ్ మజుందార్ షా సూచించారు.