పిలుస్తున్నాయి పీఎస్‌యూ'లు!
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మంచి వేతనం ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లో ఉద్యోగం చేజిక్కించుకోవాలని ఆకాంక్షిస్తారు. ఇలాంటి వారికిగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)మంచి మార్గం. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎస్సీ తదితర సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వరంగ యూనిట్లలో ఉద్యోగాలకు కూడా గేట్ స్కోర్ ప్రామాణికంగా మారింది. దీంతో ఈ పరీక్షకు ప్రాధాన్యం పెరిగింది. గేట్-2017 స్కోర్ ఆధారంగా వివిధ పీఎస్‌యూలు నియామకాలకు శ్రీకారం చుట్టాయి.ఈ క్రమంలో ప్రత్యేక కథనం..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మహారత్న కంపెనీలు (భెల్, గెయిల్, ఎన్టీపీసీ..), నవరత్న కంపెనీలు (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్..), మినీరత్న కంపెనీలు (బార్క్, ఏఏఐ..) కార్పొరేట్ సంస్థలతో పోటీగా ఆకర్షణీయమైన వేతనాలు, సౌకర్యాలతో నియామకాలు చేపడుతున్నాయి. అభ్యర్థులు తాము ఇంజనీరింగ్‌లో చదువుతున్న కోర్ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలోనే పనిచేసే అవకాశంతోపాటు, సంతృప్తినిచ్చే పని సంస్కృతిని పీఎస్‌యూలు అందిస్తున్నాయి.
గ్రూప్-ఎ స్థాయి పోస్టులైన సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ఎఫ్ఐ (టెలీ), సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (క్రిప్టో), ఎస్ఆర్వో (ఎస్ అండ్ టీ) నియామకాలకు కూడా గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్.. జేటీవోల భర్తీకి కూడా గేట్‌ను ఆధారంగా చేసుకుంటోంది.
గేట్-2017 ద్వారా 35-40 పీఎస్‌యూలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. గేట్లో జనరల్ కేటగిరీలో 500-1000 లోపు ర్యాంకు సాధిస్తే తదుపరి దశకు ఏదో ఒక సంస్థ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్కోర్ సాధించడానికి ప్రయత్నించాలి.
రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వార్షిక వేతనం అందించే పీఎస్‌యూల్లో మేనేజ్మెంట్ ట్రెయినీ/ఇంజనీర్ ట్రెయినీ ఉద్యోగం సంపాదించాలంటే గేట్ స్కోర్ కీలకం. తుది ఎంపికలో గేట్ స్కోర్‌కు 75%-80% వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటారు.
గేట్ స్కోర్ ఆధారంగా వడపోసిన అభ్యర్థులకు పీఎస్‌యూలు రెండో దశలో గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలు, రిటెన్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. ఎంపికైనవారికి ఆకర్షణీయమైన వేతనాలతో ఆఫర్ లెటర్లు అందుతాయి.
గ్రూప్ డిస్కషన్ (జీడీ)
తుది ఎంపికలో గ్రూప్ డిస్కషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆయా సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను జీడీ ద్వారా పరీక్షిస్తాయి. ఇందులో అభ్యర్థులకు ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి, 10-15 నిమిషాలు చర్చించమంటారు. జీడీ ద్వారా భావ వ్యక్తీకరణ (communication), నాయకత్వ(leadership), బృంద స్ఫూర్తి (team spirit), సృజనాత్మక (ఛిట్ఛ్చ్టజీఠ్ఛి) తదితర నైపుణ్యాలను పరిశీలిస్తారు.
గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ
గ్రూప్ టాస్క్‌లో భాగంగా అభ్యర్థులకు ఒక టాస్క్ ఇచ్చి, దానికి సమాధానాలు కూడా ఇస్తారు. వీటి నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకొని, దాన్ని సమర్థించడానికి కారణాలు వివరించాల్సి ఉంటుంది. చివర్లో వ్యక్తిగత మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా అడిగే అంశాలు.. అభ్యర్థి స్వీయ పరిచయం, బీఈ/బీటెక్ చివరి సంవత్సర ప్రాజెక్టు, తమకు పట్టున్న సబ్జెక్టు అంశాలు,
జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్
ఆయా సంస్థలకు అభ్యర్థులు తమ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ప్రాక్టికల్‌గా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలి. ఇది అభ్యర్థి శ్రద్ధ, నైతికత, పరిపక్వతలను తెలియజేస్తుంది. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా విని, సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు ఒకట్రెండు మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం మంచిది. గతంలో ఆయా సంస్థలకు ఎంపికైన అభ్యర్థుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సంస్థల వెబ్సైట్లను క్షుణ్నంగా పరిశీలించాలి.
గేట్-2017 ద్వారా నియామకాలు జరిపే కొన్ని సంస్థలు
బీఎస్ఎన్ఎల్ (జేటీవో)
ఉద్యోగం: జూనియర్ టెలికం ఆఫీసర్
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, సివిల్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఖాళీలు: 2510
దరఖాస్తు: 2017, జనవరి 1- జనవరి 31
వెబ్సైట్: www.externalexam.bsnl.co.in
(2016, డిసెంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటుంది.)
బీపీసీఎల్
ఉద్యోగం: మేనేజ్మెంట్ ట్రెయినీ. విభాగాలు: మెకానికల్/కెమికల్
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: గేట్ 2017 స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ.
దరఖాస్తు: 2017, జనవరి 1- జనవరి 31
వెబ్సైట్: www.bpclcareers.in
హెచ్‌పీసీఎల్
ఉద్యోగం: గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్
విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికాం.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, జీడీ, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు: 2017, జనవరి 10-ఫిబ్రవరి 10
వెబ్సైట్: www.hindustanpetroleum.com/
www.hpclcareers.com
ఎండీఎల్ (మజగావ్ డాక్ లిమిటెడ్)
ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (టెక్నికల్) విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్ అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఖాళీలు: 8. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: 2017, జనవరి 6-ఫిబ్రవరి 6
వెబ్సైట్: www.mazagondock.gov.in
కేబినెట్ సెక్రటేరియట్
ఉద్యోగం: సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్; టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్; ఫిజిక్స్/కెమిస్ట్రీ. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పీజీ.
ఖాళీలు: 8. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా. వెబ్సైట్: www.cabsec.nic.in
హెచ్‌పీయూ (హర్యానా పవర్ యుటిలిటీస్)
ఉద్యోగం: అసిస్టెంట్ ఇంజనీర్. విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, సివిల్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్ ఆధారంగా
వెబ్సైట్: www.hvpn.gov.in