రామోజీకి ‘పచ్చ’ పైత్యం ముదిరిపోయింది. తన బాబు.. చంద్రబాబును ప్రతిపక్ష నేతగా చూడలేక దిగులు పెరిగిపోయింది. ఇప్పటికిప్పుడే ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే ఆత్రం మితిమీరింది. ఏదో విధంగా జనాన్ని ఏమార్చాలనే కుట్ర, కుతంత్రం ప్రతి కథనంలోనూ కనిపిస్తోంది. జనానికి సీఎం వైఎస్ జగన్ దగ్గరవ్వడం జీర్ణించుకోలేక నిత్యం అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. గురువారం ‘ఈనాడు’ పత్రిక బ్యానర్ కథనంలో ఇచ్చిన ఫొటోను కాసేపు పరిశీలిస్తే రామోజీ డొల్లతనం ఇట్టే తెలిసిపోతోంది.
ఆ ఫొటోలో పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరూ చక్కగా దుప్పట్లు కప్పుకోవడం కనిపిస్తోంది. కొందరైతే అదనంగా తల కింద మరో దుప్పటి పెట్టుకోవడం కూడా కనిపించింది. కేవలం ముగ్గురు విద్యార్థులు దుప్పటి కప్పుకోలేదు. ఆ ముగ్గురికి కూడా దుప్పట్లు ఉన్నాయి. వారు కప్పుకోక పోవడం ప్రభుత్వం తప్పా రామోజీ? ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ప్రగతి మీకు మాత్రమే ఎందుకు కనిపించడం లేదు? చంద్రబాబు ఇచ్చిన దుప్పట్లో దూరుకున్న మీకెలా కనిపిస్తుందిలే..!
కర్నూలు (అర్బన్): ప్రజలు ఏమైనా అనుకుంటారన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా లేకుండా నిత్యం తప్పుడు కథనాలతో ‘ఈనాడు’ అబద్ధాలు వండి వారుస్తోంది. కట్టు కథలు అల్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో పచ్చ పత్రిక పరువు పోగొట్టుకుంటోంది. ఈ నెల 30న ఈనాడు మొదటి పేజీలో ‘మనసు లేని మామ’ శీర్షికతో ప్రచురించిన కథనంలో కర్నూలు డాక్టర్స్ కాలనీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదని, చలికి విద్యార్థులు గజగజ వణికిపోతున్నారని రాశారు. వాస్తవానికి ఈ పాఠశాలలో అలాంటి పరిస్థితే లేదు.
డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొత్తం 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 5న ప్రభుత్వం ఈ పాఠశాలకు వంద దుప్పట్లు సరఫరా చేసింది. వీటిని ఈ నెల 6నే విద్యార్థులకు అందించి, వారికి దుప్పట్లు అందినట్లు సంతకాలను కూడా (అక్విటెన్స్) రిజిస్టర్లో నమోదు చేశారు. కనీసం ఈ విషయాలేవీ తెలుసుకోకుండానే ‘ఈనాడు’ దుర్మార్గంగా ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజల మనుసుల్లో విషం జొప్పించే యత్నం చేసింది.
ఈనాడు తీరు పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లెదుటే వాస్తవం కనిపిస్తుంటే ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా రాస్తారని ఆశ్చర్యపోయారు. అర్ధరాత్రి పూట హాస్టల్ ఫొటోలు తెప్పించుకుని.. ఇలా తప్పుడు రాతలు రాయడం ఏం జర్నలిజం అని హాస్టల్ పరిసర ప్రాంతాల ప్రజలు విస్తుపోతున్నారు.
నాడు–నేడు కనిపించలేదా రామోజీ?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు నడుం బిగించడం తెలిసిందే. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆయా విద్యా సంస్థల్లో సకల వసతులు కల్పిస్తోంది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు చేపట్టి, పూర్తి చేసింది. రెండవ దశలో 22,217 పాఠశాలల్లో పనులు ప్రారంభించింది. చాలా వాటిలో పనులు పూర్తయ్యాయి.
మరికొన్నింటిలో చివరి దశలో కొనసాగుతున్నాయి. మిగతా స్కూళ్లను మూడో దశలో అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్లి చూసినా కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుంది.. ఒక్క రామోజీకి తప్ప. నాడు–నేడు కింద పనులు జరగని పాఠశాలలను వ్యూహాత్మకంగా ఎంచుకుని ప్రభుత్వంపై ఈనాడు బండలేస్తోంది. ఇప్పుడు చలి కాలం వచ్చిందనే నెపంతో దుప్పట్లు లేవంటూ అవాస్తవాలు వల్లె వేసింది.
మాకు 6వ తేదీనే దుప్పట్లు ఇచ్చారు
ఈ నెల 6వ తేదీనే మాకు కొత్త దుప్పట్లు అందించారు. పాతవి కొందరు పడేశారు. మరికొందరు వాటిని అలాగే ఉంచుకున్నారు. రాత్రి పడుకునే సమయంలో మాకు ఇచ్చిన దుప్పట్లను తల కింద పెట్టుకొని పడుకున్నాం. చలి పెట్టినప్పుడు కప్పుకుందాం అనుకున్నాం. మా ఫొటోలు ఎవరు తీశారో.. ఎప్పుడు తీశారో మాకు తెలియదు. చలి వేస్తే.. దుప్పట్లు పెట్టుకుని కూడా కప్పుకోకుండా ఎందుకుంటాం? – మనోజ్‌నాయక్, అఖిల్‌నాయక్, హర్షవర్దన్ నాయక్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, డాక్టర్స్ కాలనీ, కర్నూలు
అందరికీ దుప్పట్లు పంపిణీ
ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు ఈనెల 5న మాకు వచ్చాయి. ఆ మరుసటి రోజు.. అంటే 6వ తేదీన విద్యార్థులకు అందించాం. ఇంకా పది దుప్పట్లు మిగిలాయి. ఇది అద్దె భవనం. ‘నాడు–నేడు’ ఫేజ్–2 కింద ఈ పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా చూశాం. – ఎస్.శ్రీనివాసకుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment