విద్యార్ధులు లేని 9వ తరగతి గది (ఇన్‌సెట్) ఇంటికి పయనమైన విద్యార్థిని
విశాఖపట్నం, హుకుంపేట(అరకులోయ): జి.బొడ్డాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రదానోపాధ్యాయురాలు, 9వ తరగతి విద్యార్ధుల మధ్య వివాదం నెలకొంది. హెచ్‌ఎం తమను వేధిస్తుందని, నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులంతా గురువారం ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం చేయకుండా, ఆశ్రమం వదిలి ఇళ్లకు వెళ్లిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. 33 మంది విద్యార్థినులు ఆశ్రమ పాఠశాలను వదిలి, ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటనతో జి.బొడ్డాపుట్టు ప్రాంతంలో కలకలం రేగింది.
శుక్రవారం ఉదయం 9వ తరగతి గదిలో ఒక్క విద్యార్థిని కూడా లేక గది ఖాళీగా ఉంది. ప్రధానోపాధ్యాయురాలు రూపవతి, డిప్యూటి మేట్రిన్ విధులకు కూడా నిర్వహిస్తున్నారు. ఆమె విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినులంతా మాకుమ్మడిగా ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను చెప్పడానికి ఆశ్రమ పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులు కూడా నిరాకరించారు. తోటి విద్యార్థులు కూడా వివరాలు చెప్పడానికి భయపడుతున్నారు. హెచ్‌ఎం రూపవతి సమావేశం నిమిత్తం పాడే రు వెళ్లడంతో ఆమె వివరణకు అందుబాటులో లేరు. అయితే 9వ తరగతి విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయిన సమాచారాన్ని గిరిజన సంక్షేమశాఖ అధికారులకు జి.బొడ్డాపుట్టు గిరిజనులు చేరవేశారు.
Comments
Please login to add a commentAdd a comment