కుమరం భీం: జిల్లా పోలీసులంటే క్రమశిక్షణకు మారుపేరని.. విధుల్లో అంకితభావం ఉండేదని.. నిక్కచ్చిగా వ్యవహరించేవారని.. ఇక ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తారని.. అసాంఘిక కార్యకలపాలపై ఉక్కుపాదం మోపేవారని ఒకప్పుడు ప్రజల్లో పేరుండేది.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి పోలీసుశాఖలో నెలకొంది. మంగళవారం ‘సాక్షి’లో ‘దర్జాగా పేకాట!’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం కాగా.. అధికారపార్టీ నేతల మెప్పు కోసం ‘పేకాట’కు అండగా నిలుస్తున్న కొందరు పోలీసుల్లో మాత్రం ‘ఆ.. ఏమైతది!?’ అనే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది.
పనిష్మెంట్ ఇచ్చినా.. పోస్టింగ్ ఇస్తరు..
కాగజ్‌నగర్ పట్టణ, శివారు ప్రాంతాల్లో జోరుగా జరుగుతున్న పేకాటపై మంగళవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఓ పోలీసు అధికారి నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడడం.. పోలీసుశాఖపై అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఏ మేరకు ఉంటాయన్న విషయాన్ని బట్టబయలు చే స్తోంది. ‘పేకాటపై కథనం వచ్చింది. ఆ.. ఏమైతది!? ఇట్లాంటి కథనాలు ఎన్ని చూడలే.. పోలీసుబాస్ చీవాట్లు పెడతారు.
మహా అయితే బదిలీ చేస్తరు. అధికారపార్టీ నేతల ఆశీస్సులుంటే మళ్లీ కొన్నాళ్లకు ఇదే జిల్లాలో పోస్టింగ్ ఇస్తరు. అధికారపార్టీ నేతల్ని కాదని ఇక్కడ పనిచేయలేం’ అని పేర్కొనడం క్రమశిక్షణారాహిత్యానికి అద్దం పడుతోంది. పోలీసుశాఖలో ‘లెటర్ల’ వ్యవస్థ వెళితేనే మళ్లీ ఆ శాఖ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని స్థానికులు అభిప్రాయపడతున్నారు.
‘సిర్పూర్’.. అన్నింటికీ అడ్డా..!
సిర్పూర్ నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా కాగజ్‌నగర్ పట్ట ణం కల్తీకి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇక్కడ గుట్కా, పా న్ మసాలాలు, మద్యం ఇలా ఎన్నో కల్తీ ఉత్పత్తుల ను కొన్ని ముఠాలు మార్కెట్లో విక్రయిస్తూ భారీ గా అర్జిస్తున్నాయి. ఇక మట్కాకు ఈ నియోజకవర్గం ఓ డెన్‌గా మారిందంటే అతిశయోక్తికాదు. ఒకవైపు వరుస దాడుల్లో ఈ దందాలన్నీ మూతపడ్డాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు.. ఇక్కడ జరుగుతున్న తీరుకు పొంతన ఉండడం లేదు. ఈ నియోజకవర్గానికి పొరుగున ఉన్న మహారాష్ట్రలోని జిల్లాలో ఒకప్పుడు మద్యపాన నిషేధం అమల్లో ఉండేది.
ఆ సమయంలో ఇక్కడి నుంచి అక్కడకు భారీగా మద్యం సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదనుగా కల్తీ ముఠాలు.. మద్యం బాటిళ్ల నుంచి కొంత మద్యాన్ని తీసి.. అంతే మొత్తంలో స్పిరిట్ కలిపి మళ్లీ యథాతథంగా బాటిళ్లను సీల్ చేసి మహారాష్ట్ర జిల్లాల్లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి. గుట్కా, పాన్‌మాసాలాల విషయంలోనూ అదే మాదిరి కల్తీ చేసి ‘దో నంబర్’ దందాకు తెరతీశారని సమాచారం. ఈ దందాలన్నీ నేటికీ కాగజ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుండటం గమనార్హం.
‘పేకాట’కు పహారా..
కాగజ్‌నగర్‌లోని రెండు ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతోందన్న విషయం నగ్న సత్యం. అధికారపార్టీ నేతల అనుచరులు ఈ రెండు శిబిరాలను నిర్వహిస్తుండడంతో పోలీసులు అటువైపు వెళ్లడానికి సాహసించడం లేదు. పైగా నేతల మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఆ జూద శిబిరాలకు పహారా కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జూద శిబిరాల నిర్వాహకులు నెలానెలా వారికి పెద్దమొత్తంలో ము డుపులు ముట్టజెప్పుతుండటమే ఇందుకు కారణ మని తెలుస్తోంది.
ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఓ అధికారికి రూ.లక్ష.. సిబ్బందికి రూ.50 వేలు.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా దాడులు నిర్వహించే మరో టీం సభ్యులకు రూ.లక్షకు పైగా మామూళ్లు ఇస్తున్నామని ఆ నిర్వాహకులే బాహాటంగానే పేర్కొంటుండడం గమనార్హం. పోలీసుశాఖలోనూ అధికారపార్టీ నేతల చెప్పినట్లు నడుచుకుంటేనే పోస్టింగ్ పదిలమనే భావన నెలకొనడంతో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment