కుమరం భీం: ఒక్కొక్కరిది ఒక్కో కారణం. తీవ్ర ఒత్తిడికిలోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడో ఓ చోట ఏదో కారణంతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మానసిక పరిస్థితి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, గృహ హింస, చదువులో విఫలం, ప్రేమ వైఫల్యం తదితర కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.
అలాగే ఫోన్ కొనివ్వలేదని.. పిల్లలు పుట్టడం లేదని.. చివరకు పెళ్లి కాలేదనో.. ఒంటరిగా బతకలేమనే నెపంతో కూడా ప్రాణాలు తీసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలోనే ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఏటా వంద మందికి పైగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
'అమ్మాయిని ప్రేమించిన విషయం రేపోమాపో పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలాంటిది ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక హఠాత్తుగా తనువు చాలించిన యువకుడు.. పిల్లలు పుట్టడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత.. ఆర్థిక ఇబ్బందులతో రైతు బలవన్మరణం.. ఇలా ప్రతిరోజూ ఏదో కారణంతో కొంతమంది విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తమ కుటుంబాలకు తీరని వేదనను మిగుల్చుతున్నారు.'
ఘటనలు..
► మద్యానికి బానిసైన భర్త వేధింపులు భరించలేక ఈ నెల 1న బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ కాలనీకి చెందిన బుర్సు బాయక్క(57) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
► ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడు తూ మనస్తాపానికి గురై 4వ తేదీన ఆసిఫా బాద్ జిల్లా కేంద్రంలోని బజార్‌వాడకు చెదిన జంజిరాల తిరుపతి(40) ఉరేసుకున్నాడు.
► పెళ్లి జరిగి ఐదేళ్లవుతున్నా సంతానం కలగడం లేదనే బెంగతో కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన ఎడ్ల సుజాత(24) పురుగుల మందు తాగింది. ఈ నెల 6న ప్రాణాలు కోల్పోయింది.
► భార్య ఆరోగ్యం కుదుట పడటం లేదని మద్యానికి బానిసై వాంకిడి మండలం కనర్‌గాం గ్రామానికి చెందిన కొండపర్తి బాలేష్(39) 6వ తేదీన ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు.
► కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాం గ్రామానికి చెందిన కృష్ణగుప్త(51) 7వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
► 12న ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన సెండె విట్టు(56) తన భార్యతో గొడవపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మానసిక ఒత్తిడితోనే చిత్తు..
మారుతున్న జీవనవిధానంతో కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఎవరైన మానసిక వేదనకు గురైతే వారిని ఇంటి పెద్దలు గుర్తించి సముదాయించేవారు. పరిష్కార మార్గం చూపేవారు. చిన్న కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆర్థిక స్థితికి మించిన కోరికలు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి, వ్యాపారాల్లో తట్టుకోలేని నష్టాలతో మానసిక వేదనకు గురవుతున్నారు. తీర్చలేని స్థాయిలో అప్పులు చేయడం కూడా ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయా సందర్భాల్లో పరిస్థితి తమ చేయి దాటిపోయిందని భావిస్తూ భార్యపిల్లలతో లోకాన్ని విడిచివెళ్తున్నారు.
ఒక్క క్షణం మీకోసం..
► ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వారు ఒక్క క్షణం ఆగి మీకోసం.. కుటుంబం కోసం ఒకసారి ఆలోచించాలి.
► సమస్య నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తూ ముందుకెళ్లాలి.
► ఓటమి ఎదురైనప్పుడు నిరాశావాదాన్ని వదిలి మరోసారి గెలుపు ప్రయత్నించాలనే ఆశావాదంతో ముందుకెళ్లాలి.
► మనం ఉన్నప్పుడే కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే.. మన తర్వాత మరెవరు ఆదుకుంటారనే ఆలోచన మొదలుకావాలి.
► సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా, దాని నుంచి బయటపడే మార్గాన్ని గుర్తించాలి.
► వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు గుర్తిస్తే మానసిక వైద్యనిపుణుల వద్ద తీసుకెళ్లాలి. వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి.
► మానసికంగా దెబ్బతింటే జిల్లా ఆస్పత్రిలోని మానసిక వైద్యుడిని సంప్రదించాలి.
ఆత్మహత్యలొద్దు..
సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. గుండైధెర్యంతో జీవితాన్ని ఎదుర్కొవాలే తప్ప క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దు. గతంతో పోలిస్తే బలవన్మరణలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మానసిక వైద్యుడు అందుబాటులో ఉన్నారు. ఆత్మహత్యలు నివారించడానికి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యసిబ్బందికి అవగాహన కల్పించాం. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు టెలీమానస్ 14416 ఉచిత కాల్ సెంటర్‌ను సంప్రదించాలి. ఒక్క క్షణం ఆలోచిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని మార్చుకుంటారు. – రామకృష్ణ, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment