నిర్మల్: పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో ఎదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దానికి పరిష్కారం ఉంటుంది. అయితే ఆ సమస్యను స్వీకరించే తీరు, దాన్ని పరిష్కరించుకునే విధానమే కీలకం. తమకు ఎదురైన సమస్యను తెలుసుకుని దానిని అధిగమించే మార్గాలను వెతుకుంటే సమస్య కన్న పరిష్కార మార్గాలే ఎక్కువగా కన్పిస్తాయి. తమకున్న సమస్యనే పెద్దదిగా భావించి విచక్షణ కొల్పోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఎదురైన సమస్యతో బాధపడకుండా మన అనుకునేవారికి చెప్పుకుంటే సగం పరిష్కారం అప్పుడే లభిస్తోంది. పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆలోచన చేయకుండా ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను వీధి పాలు చేస్తున్నారు. పిల్లలు తెలిసి, తెలియని వయస్సులోనే ఆత్మహత్యకు ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని దుఖాన్ని మిగుల్చుతున్నారు.
► ‘భీంపూర్ మండలంలోని అందర్‌బంద్ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే అనురాగ్ (13) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుకోవాల్సిన వయస్సులో బడి మానేసి ఇంటి వద్ద ఉండడంతో బుద్దిగా బడికి వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో తన నూరేళ్ల జీవితానికి ముగింపు పలికి తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడు.’
► ‘ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న తాంసి మండలం పాలోది గ్రామానికి చెందిన అడెపు శృతి(17) మొహర్రం సెలవులకు ఇంటికి వచ్చింది. తనతో చనువుగా ఉంటున్న గ్రామంలోని యువకుడి ఇంటికి వెళ్లిన విషయం తండ్రికి తెలిసి తనను మందలిస్తాడనే భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంది.'
► ‘జైనథ్ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన డౌరే రవీందర్ అనే కౌలు రైతు తనకున్న మూడెకరాలతో పాటు మరో 14ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కన్పించకపోవడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం ఆయన భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. భార్య స్వప్న కూలీ పనిచేస్తు పిల్లలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.'
► 'బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన పాముల సంతోష్ ఆటో నడుపు తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ టోను ఫైనాన్స్‌పై తీసుకున్నాడు. గీరాకి ఆశించనంతగా రాకపోవడం, కుటుంబ పోషణ భారమవుతుందనే కారణంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు ఆధారాన్ని కొల్పోయి దిక్కులేని వారిగా నానా అవస్థల నడుమ కాలం వెల్ల దీయాల్సి వస్తోంది.'
బతికే మార్గం చూడాలి..
చేతినిండా పనిదొరక్క, ఉపాధి అవకాశాలు లేక కుటుంబ భారాన్ని మోయలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పంటలు సరిగ్గా పండక, గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం ద్వారా వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆత్మహత్యలను అరికట్టేలా చర్యలు చేపట్టాలి. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు
కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం..
ఆత్మహత్యలు చేసుకోకుండా ఎస్సైలు తమ పరిధిలో రెగ్యులర్‌గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకోకుండా వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆత్మహత్యలనేవి సమస్యకు ఏ మాత్రం పరిష్కారం కావు. సమస్యలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా విచక్షణతో ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. – డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ
మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు..
మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. డిప్రెన్సన్‌లో ఉన్న వ్యక్తి నడవడిలో మార్పు వస్తుంది. గమనించి వైద్యుల వద్ద చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తే వారిని ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడవచ్చు. మానసిక సంఘర్షణకు గురై, సహనం లేనటువంటి వారు క్షణికావేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ చేస్తే వారు ప్రాణాలు తీసుకోకుండా చూడవచ్చు. – డాక్టర్ ఓంప్రకాశ్, రిమ్స్ మానసిక వైద్య నిపుణులు
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment